వెలిగొండ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు

ఎలాంటి అనుమతులు లేకుండా వెలిగొండ ప్రాజెక్టుపై ఎత్తిపోతలు, ఇతర కాంపొనెంట్ పనులు చేపట్టకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నిలువరించాలని కృష్ణా నది యాజమాన్య బోర్డును తెలంగాణ ప్రభుత్వం కోరింది. అపెక్స్ కౌన్సిల్, బోర్డు అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం కొత్త పనులకు అనుమతులు ఇచ్చిందని కృష్ణా బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు చేసింది. 
 
ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ కేఆర్ఎంబీ చైర్మన్‌కు లేఖ రాశారు. అనుమతులు లేకుండా బేసిన్ వెలుపలకు కృష్ణా జలాలను తరలించడం తగదన్న తెలంగాణ..   కేంద్ర జల శక్తి శాఖ ఆదేశాలను పట్టించుకోకుండా ఏపీ ప్రభుత్వం పనులు చేపడుతోందని ఆక్షేపించింది. 
 
వెలిగొండ లాంటి ప్రాజెక్టుల పనులతో తెలంగాణ ప్రాజెక్టులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ఫ్లోరైడ్ ప్రభావిత నల్గొండ, కరువు పీడిత ప్రాంతమైన పాలమూరుకు అన్యాయం జరుగుతోందని లేఖలో పేర్కొంది. అనుమతి లేని వెలిగొండ ప్రాజెక్టు, కొత్త కాంపొనెంట్ పనులను ఏపీ చేపట్టకుండా నిలువరించాలని కృష్ణా బోర్డును లేఖలో తెలంగాణ ప్రభుత్వం కోరింది.
 
శ్రీశైలం జలాశయం నుంచి వివిధ ప్రాజెక్టుల ద్వారా ఏపీ కృష్ణ జలాలను బేసిన్ వెలుపలకు తరలిస్తోందని ఇప్పటికే పలుమార్లు అభ్యంతరం తెలిపినట్లు మురళీధర్ పేర్కొన్నారు. కాగా బోర్డు అనుమతులు లేకుండా కొత్త పనులకు ప్రభుత్వం ఎలా ఒప్పుకుంటుందని ప్రశ్నించారు.  నిర్మాణానికి అనుమతుల్లేని వెలిగొండ ప్రాజెక్టు పనులను ఏపీ ప్రభుత్వం కొనసాగించకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇప్పటికే పలు మార్లు ఫిర్యాదు చేసినా సంబంధిత అధికారులు స్పందించలేదని, అందువల్లే లేఖ రాయాల్సి వచ్చిందని తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వచ్చే జలాలను వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నీటిని తరలించడంపై తెలంగాణ బోర్డు కృష్ణా నది బోర్డుకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందించలేదు. తాజాగా, అసలు అనుమతులే లేని ప్రాజెక్టు దగ్గర ఎత్తిపోతలు, ఇతర కాంపోనెంట్‌ పనులు చేపట్టం ఏంటని లేఖలో పేర్కొంది. 
 
దీనిపై బోర్డు వెంటనే ఏపీ ప్రభుత్వాన్నీ అడ్డుకోవాలని తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ కేఆర్ఎంబీకి తెలిపారు. కేఆర్‌ఎంబీ ఇకనైనా చర్యలు తీసుకోవాలని లెేఖలో పేర్కొన్నారు.