ఏపీ హైకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులు

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో అయిదుగురు కొత్త న్యాయమూర్తుల నియామకాలకు సుప్రీం కోర్టు కొలిజియం చేసిన సిఫార్సులకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. కొత్త న్యాయమూర్తుల్లో నలుగురిని అదనపు జడ్జిలుగా నియమించగా, మరొకరికి ఏపీ హైకోర్టుకు బదిలీ చేశారు. ఏపీ హైకోర్టు నుంచి ఇద్దరు న్యాయమూర్తులను బదిలీ చేశారు.

దేశంలోని పది హైకోర్టులకు చెందిన 16 మంది న్యాయమూర్తులను కేంద్ర ప్రభుత్వం బుధవారం బదిలీ చేసింది. తొమ్మిది హైకోర్టులకు కొత్తగా 17 మంది న్యాయమూర్తులను నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు నుంచి ఇద్దరు న్యాయమూర్తులు బదిలీపై ఇతర రాష్ట్రాలకు వెళుతున్నారు. మరో న్యాయమూర్తి కర్ణాటక హైకోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు బదిలీపై రానున్నారు.

ఏపీ హైకోర్టులో అదనంగా కొత్తగా నలుగురు అదనపు న్యాయమూర్తులు నియమకాల కోసం కొలిజియం సిఫార్సులకు అమోద ముద్ర వేసింది. దీంతో ఏపీ హైకోర్టు జడ్జిల సంఖ్య 30కి చేరనుంది. ఏపీ హైకోర్టులో పూర్తి స్థాయిలో 37మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉంది.

అమరావతిలో హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్‌ చీకటి మానవేంద్ర నాథ్‌రాయ్‌ గుజరాత్‌ హైకోర్టుకు, జస్టిస్‌ దుప్పల వెంకటరమణను మధ్యప్రదేశ్‌ హైకోర్టుకు బదిలీ చేశారు. కర్ణాటకనుంచి బదిలీపై జస్టిస్‌ జి.నరేందర్‌ వస్తున్నారు. న్యాయమూర్తుల బదిలీలకు ఆగస్టు 10న సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. కేంద్ర న్యాయశాఖ బుధవారం ఉత్తర్వులిచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా న్యాయవాదుల కోటాలో హరినాథ్‌ నూనెపల్లి, కిరణ్మయి మండవ, సుమతి జగడం, న్యాపతి విజయ్‌ నియమితులయ్యారు. అక్టోబర్ 10న సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. వీరి నియామకాలకు రాష్ట్రపతి ఆమోదముద్ర అనంతరం కేంద్ర న్యాయశాఖ బుధవారం నోటిఫికేషన్‌ ఇచ్చింది. కొత్త జడ్జిల నియామకాన్ని న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌ ఎక్స్‌‌లో ప్రకటించారు.

తెలంగాణ హైకోర్టులో ఇద్దరు జడ్జిల బదిలీ

కాగా, తెలంగాణ హైకోర్టులో జడ్జిలుగా ఉన్న జస్టిస్‌ ఎం.లక్ష్మణ్‌ రాజస్థాన్‌కు, జస్టిస్‌ అనుపమ చక్రవర్తి పాట్నాకు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఇద్దరు న్యాయమూర్తులను బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం హైకోర్టులో పనిచేస్తున్న జస్టిస్‌ మున్నూరు లక్ష్మణ్‌ను రాజస్థాన్‌కు, జస్టిస్‌ జి.అనుపమ చక్రవర్తిని పాట్నా హైకోర్టుకు బదిలీ చేస్తూ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.