క్యాష్ పిటీషన్ లో చంద్రబాబుకు తీవ్ర నిరాశ .. 9న తీర్పు

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఎన్నో ఆశలు పెట్టుకున్న క్వాష్ పిటీషన్ పైన తీర్పును సుప్రీంకోర్టు వాయిదా వేసింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్ర బాబు వేసిన క్వాష్ పిటిషన్ తీర్పు వచ్చే నెల (నవంబర్) 8న వెల్లడిస్తామని స్పష్టం చేసింది. అదే విధంగా ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై వాదనలు నవంబరు 9 న వింటామని ధర్మాసనం వెల్లడించింది. 
 
దీంతో, ఆ తరువాతనే చంద్రాబాబు బయటకు ఎప్పుడనేది స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.  చంద్రబాబు కేసులకు సంబంధించి సుప్రీంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. స్కిల్ కేసులో రిమాండ్ లో ఉన్న చంద్రబాబు ఈ కేసులో క్వాష్ పిటీషన్ దాఖలు చేసారు. హైకోర్టులో కొట్టేసిన క్విష్ పిటీషన్ పైన చంద్రబాబు సుప్రీంను ఆశ్రయించారు.
 
 చంద్రబాబు, ఏపీ ప్రభుత్వం తరఫున రెండు గంటలపాటు సాగిన వాదనల్ని విన్న తర్వాత తీర్పును రిజర్వులో ఉంచింది ధర్మాసనం. కానీ,  ఎప్పుడు తీర్పు వెలువరిస్తామన్నది స్పష్టం చెయ్యలేదు. శనివారం నుంచి ఈనెల 29 వరకు కోర్టుకు దసరా సెలవులు. తీర్పు రిజర్వ్ చేయటంతో ఈ రోజు తీర్పు వెలువరిస్తారనే అంచనాలు ఉన్నాయి.
 
కానీ, ఈ తీర్పుకు సంబంధించి శుక్రవారం న్యాయస్థానం స్పష్టత ఇచ్చింది. ఈ కేసులో తీర్పును నవంబర్ 8న వెల్లడిస్తామని కోర్టు స్పష్టం చేసింది. దీంతో, అప్పటి వరకు వేచి చూడక తప్పని పరిస్థితి ఏర్పడింది.  ఇక, ఇదే సమయంలో ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖుల చేసిన ఎస్ఎల్పీ ఈ రోజు సుప్రీంలో విచారణకు వచ్చింది. 
 
తన ముందస్తు బెయిల్ పిటీషన్ ను కొట్టేస్తే ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై చంద్రబాబు సుప్రీంను ఆశ్రయించారు. ఈ కేసులో ఈ నెల 13న విచారణకు వచ్చిన సమయంలో 18వ తేదీ వరకు కోర్టు ఉపశమనం కలిగించింది. ఈ కేసుకు 17ఏ వర్తిస్తుందనే లూద్రా వాదించారు. 
 
స్కిల్ కేసులో విచారణ పూర్తయిన తరువాత దీనిపై విచారిస్తామని చెప్పిన న్యాయమూర్తులు ఈ కేసును 17వ తేదీకి వాయిదా వేశారు. అప్పటి వరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని ప్రభుత్వానికి న్యాయస్థానం సూచించింది. ఈ నేపథ్యంలో తిరిగి ధర్మాసనం తిరిగి ఈ కేసును నవంబర్ 9కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.
లీగల్ ములాఖత్ ల పెంపు పిటిషన్‌ కొట్టివేత

మరోవంక, చంద్రబాబుతో ములాఖత్ విషయంలో ఆయన లాయర్లు దాఖలు చేసిన పిటిషన్ ను ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. ప్రస్తుతం ఆయనను కలిసేందుకు లాయర్లకు రోజుకు ఒకసారి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారని, కనీసం మూడు సార్లు అవకాశమివ్వాలని చంద్రబాబు లాయర్లు కోర్టును కోరారు. 
 
ఏసీబీ కోర్టు, ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టులలో పలు కేసులపై విచారణ జరుగుతోందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో చంద్రబాబును కలిసి చర్చించేందుకు రోజుకు మూడు సార్లు అవకాశం కల్పించాలని కోరారు. కనీసం 45 నుంచి 50 నిమిషాల పాటు చర్చించేందుకు అనుమతించేలా జైలు అధికారులను ఆదేశించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. 
 
గతంలో చంద్రబాబును కలిసేందుకు రోజుకు రెండుసార్లు లీగల్ ములాఖత్ కు అవకాశం కల్పించారని చెప్పారు. అయితే, ప్రస్తుతం దీనిని రోజుకు ఒకసారికి కుదించారని చెప్పారు. లీగల్ ములాఖత్ పై చంద్రబాబు లాయర్లు దాఖలు చేసిన పిటిషన్ ను పరిశీలించిన ఏసీబీ కోర్ పిటిషన్ లో ప్రతివాదుల పేర్లను చేర్చలేదనే కారణంతో విచారణకు తిరస్కరించింది. ఈ పిటిషన్ పై ప్రస్తుతం విచారించాల్సిన అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది.