జర్నలిస్టులకు పోస్టల్ బ్యాలట్ అవకాశం

ఎన్నికల విధుల్లో ఉంటూ ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్న జర్నలిస్టులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కేంద్ర ఎన్నికల కమిషన్  కల్పించింది. గతంలో పాత్రికేయులు ఓటు వేయాలంటే వీలు దొరకక పోవడం, ఒకవేళ వెళ్ళాలంటే విధులకు ఆటంకం కలిగే పరిస్థితులు ఏర్పడేవి.
 
అందువల్ల మీడియా ప్రతినిధులకు కూడా పోస్టల్ బ్యాలెట్ కావాలంటూ జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో గత కొన్నేళ్లుగా కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞాపనలు చేస్తున్నారు. వాటికి స్పందించిన ఎన్నికల సంఘం ఎన్నికల విధులలో పాల్గొనే జర్నలిస్టులకు కూడా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. 
ఆ మేరకు తెలంగాణ సహా ఎన్నికలు జరగబోయే నాలుగు రాష్ట్రాల్లో ని జర్నలిస్టులకు తొలిసారిగా ఈ అవకాశం కల్పిస్తూ ఈసి ఆదేశాలు జారీ చేసింది.  జర్నలిస్టుల తో పాటు ఇతర 12 విభాగాల ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.  బీఎస్ యన్ఎల్, ఎఫ్సీఐ, ఎఎఐ, పీఐబీ, విద్యుత్ శాఖ, రైల్వే, వైద్యరోగ్య శాఖ, పౌరసరాఫరాల శాఖ, హయర్ ఆర్టీసీ, వార్తల సేకరణ కోసం ఈసీ నుంచి పాస్ పొందిన జర్నలిస్టులు, ఫైర్ సిబ్బంది తదితర శాఖల సిబ్బందికి కొత్తగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించారు.

వీరంతా నవంబర్ 7వ తేదీలోగా ఫారం-12డి ద్వారా పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. దీనివల్ల ఎన్నికల సమయంలో వార్తా సేకరణలో నిమగ్నమై ఉన్న లక్షలాది మంది జర్నలిస్టులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా విధులకు ఆటంకం కలగకుండా వోటు వేసే అవకాశం కలుగుతుందని చెప్తున్నారు.

కాగా పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం పలు జర్నలిస్టు సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అయితే జర్నలిస్టులలో కూడా ప్రభుత్వ గుర్తింపు పొందిన వారికి మాత్రమే ఈ అవకాశం కల్పించనున్నారు. రిజిస్టర్డ్ మీడియా సంస్థలో పని చేస్తు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అక్రెడిటేషన్ కార్డు కలిగి ఉన్న జర్నలిస్టులకు పోస్టల్ బ్యాలెట్ వర్తించనుంది. 

అందువల్ల మీడియాలో పనిచేస్తూ ప్రభుత్వ గుర్తింపు పొందిన అక్రెడిటేషన్ కార్డు కలిగి ఉన్న వారంతా నవంబర్ 7వ తేదీ లోగా తమ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి ఫారం 12డి ద్వారా పోస్టల్ బాలెట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.