జర్నలిస్ట్ సౌమ్యా విశ్వనాథన్ హత్య కేసులో ఐదుగురు దోషులు

దేశ రాజధాని ఢిల్లీలో 15 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన ప్రముఖ జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో ఢిల్లీ కోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది. ఈ హత్య కేసులో ఐదుగురు నిందితులను దోషులుగా ఢిల్లీ కోర్టు నిర్ధారించింది.  2008 సెప్టెంబర్‌ 30న హెడ్‌లైన్స్ టుడే న్యూస్ ఛానెల్‌లో జర్నలిస్టుగా పనిచేసిన 25 ఏళ్ల సౌమ్యా విశ్వనాథన్ ఆఫీస్ తర్వాత కారులో ఇంటికి వెళ్తుండగా దుండగులు కాల్పులు జరిపి హత్య చేశారు.
దక్షిణ ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో కారులో ఆమె మరణించి ఉండటాన్ని పోలీసులు చూశారు.  తొలుత రోడ్డు ప్రమాదంగా భావించారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత తలకు బెల్లెట్‌ గాయం వల్ల ఆమె చనిపోయినట్లు తెలిసింది. సీసీటీవీ ఫుటేజ్‌ కూడా దీనిని నిర్ధారించింది.  కాగా, కాల్‌ సెంటర్‌ ఎగ్జిక్యూటివ్‌ను కూడా ఇలాగే హత్య చేయడంపై దర్యాప్తు చేసిన పోలీసులు రవి కపూర్‌, అమిత్ శుక్లాను అరెస్ట్‌ చేశారు. 
 
వారిని ప్రశ్నించగా సౌమ్యా విశ్వనాథన్ కూడా కాల్చి చంపి దోచుకున్నట్లు చెప్పారు. థ్రిల్లింగ్ కోసం ఈ హత్యలు చేసినట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలో మరో ముగ్గురు నిందితులైన బల్జీత్ మల్లిక్, అక్షయ్ కుమార్‌తో పాటు సహకరించిన అజయ్ సేథీని ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. 2010 జూన్‌లో ఈ కేసుపై చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు.

మరోవైపు 15 ఏళ్లపాటు విచారణ జరిపిన ఢిల్లీలోని సాకేత్ కోర్టు బుధవారం తీర్పు ఇచ్చింది.  నలుగురు నిందితులు రవి కపూర్, అమిత్ శుక్లా, బల్జీత్ మల్లిక్, అక్షయ్ కుమార్‌ను హత్య, దోపిడీ అభియోగాల కింద దోషులుగా విచారించగా, వారికి సాయం చేసిన అభియోగాలపై అజయ్ సేఠీని దోషిగా కోర్ట్ ప్రకటించింది. వీరికి త్వరలోనే శిక్ష ఖరారు చేయనుంది.

సౌమ్యా విశ్వనాథన్ తల్లి ఈ తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. న్యాయం గెలిచిందని తెలిపారు. దోషులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించాలని ఆమె డిమాండ్‌ చేశారు. అలాగే ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీస్‌ అధికారిని ఆమె హత్తుకుని అభినందించారు.