దసరాకి దక్షిణ మధ్య రైల్వే 620 ప్రత్యేక రైళ్లు

దసరా పండగ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లాలనుకుంటున్న ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే  దాదాపు 620 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాలకూ నడుపుతామని పేర్కొంది.  పండగ సీజన్‌లో రద్దీ ఎక్కువగా ఉంటుందని, రిజర్వేషన్‌ టికెట్లు కన్‌ఫామ్‌ కాలేదని, సాధారణ బోగీల్లోనూ ప్రయాణం కష్టసాధ్యమన్న ఆందోళన అవసరం లేదని పేర్కొంది.

ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ రైల్వే స్టేషన్లు, కాచిగూడ, లింగంపల్లితో సహా ప్రధాన రైల్వే స్టేషన్ల నుండి నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. విజయవాడ, మచిలీపట్నం, కాకినాడ, తిరుపతి, విశాఖపట్నంతో సహా వివిధ ప్రాంతాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య ప్రయాణికులు ఎక్కువగా ప్రయాణిస్తారని, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రెండు తెలుగు రాష్ట్రాల మధ్య దాదాపు 200 ట్రిప్పులు నడిచేలా ప్రత్యేక రైళ్ల షెడ్యూల్‌నుఖరారు చేసింది.

తెలంగాణ, ఏపీతోపాటు ఇతర రాష్ట్రాల్రకు వెళ్లే ప్రయాణికుల కోసం కూడా ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. జైపూర్‌, షిర్డీ, రామేశ్వరం, రద్దీ గల ఇతర ప్రధాన ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 

గతేడాదితో పోలిస్తే ఈ దసరా సీజన్‌లో దాదాపు 100 సర్వీసులు అదనంగా నడుపుతున్నామని, రోజూ రెగ్యులర్‌ రూట్‌లను నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుందని, ఒక మార్గంలో రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు సాధారణ రైళ్ల కోచ్‌లను పెంచుతామని సీనియర్‌ రైల్వే అధికారులు చెబుతున్నారు. తగి నన్ని కోచ్‌లు అందుబాటులో ఉంటే మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు చెప్పారు.

కాగా, దసరా పండుగ రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే కాచిగూడ, కాకినాడ టౌన్ మధ్య అక్టోబర్ 19 నుంచి 26 వరకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించారు. కాచిగూడ నుంచి కాకినాడ టౌన్ రైలు (నెం. 07653) రాత్రి 9.30 గంటలకు కాచిగూడంలో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 8 గంటలకు కాకినాడ టౌన్ కు చేరుకుంటుంది. అక్టోబర్ 20 నుంచి 29 తేదీల మధ్య కాకినాడ నుంచి కాచిగూడకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాకినాడ టౌన్-కాచిగూడ(రైలు నెం 07654 ) సాయంత్రం 5:10 గంటలకు కాకినాడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4:50 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.