ప్రవళిక మృతిపై పోలీసుల హైడ్రామా

 
ప్రవళిక మృతి విషయంలో పోలీసులు హైడ్రామా నడిపారు. ప్రేమ విఫలం కావడంతోనే ప్రవళిక చనిపోయిందని సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు చెప్పారు. ప్రవళిక అసలు గ్రూప్స్‌కి అప్లై చేయలేదని చెప్పుకొచ్చారు. వాస్తవానికి గ్రూప్ 1, 2, 3, 4 లకు ప్రవళిక దరఖాస్తు చేసుకుంది. 
 
తాజాగా గ్రూప్స్ అప్లికేషన్స్ వెలుగులోకి వచ్చాయి. ప్రవళిక విషయంలో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. పరీక్షలు వాయిదా పడడంతోనే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. విషయాన్ని డైవర్ట్ చేయడానికి పోలీసులు హైడ్రామా ఆడారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

“దివంగత ప్రవళిక పరువు తీసేందుకు కేసీఆర్ పోలీసులను వాడుకుంటున్నారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా కేటీఆర్ వాదన ఉంది. ఆత్మహత్యకు వేరే కారణం ఉందంటే నిరుద్యోగులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు” అంటూ బిజెపి  ఎంపీ, ఓబిసి మోర్చా అధ్యక్షుడు డా. కె లక్ష్మణ్ ధ్వజమెత్తారు. 

పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల నిర్వహణ, లీకేజీలతో 30 లక్షల మందిని మోసం చేశారని పేర్కొంటూ ప్రవలిళికగా గ్రూప్ 4 రాసి గ్రూప్ 1, 2 కోసం ప్రిపేర్ అవుతున్న విషయం కేటీఆర్ దాస్తే దాగేది కాదని స్పష్టం చేశారు. “మీ చేతగాని తనం కోసం చనిపోయిన అమాయక అమ్మాయి మీద నెపం నెట్టడం మరింత దారుణం. కర్కశంగా ఒక కుటుంబాన్ని అబాసు, అప్రతిష్ఠ పాలు చేయడం కరెక్టేనా?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మానవత్వం ఉన్న ఎవరూ కేటీఆర్ లా వ్యవహరించరు, మాట్లాడరని మండిపడ్డారు. “ఒక్క పోటీ పరీక్ష కూడా సక్రమంగా నిర్వహించని చరిత్ర మీది. 3016 నిరుద్యోగ భృతి ఇస్తా అని మోసం చేసింది మీరు. పేదలు చదివే బడులు మూత పడుతున్నాయి. పిల్లల భవిష్యత్‌పై తల్లితండ్రుల ఆందోళన బాగా పెరిగింది” అంటూ విమర్శించారు. 

ఆ కుటుంబంతో పాటు నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తారని హెచ్చరించారు. విచారణ కాకముందే, పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకముందే డీసీపీ ఎలా తీర్పు ఇస్తారు? అని ప్రశ్నించారు. చర్యలు తీసుకోవాల్సింది డీసీపీ మీద , సీఐ మీద కాదని లక్ష్మణ్ స్పష్టం చేశారు.