బిఆర్ఎస్, కాంగ్రెస్ – రెండూ కుటుంబ, అవినీతి పార్టీలే

తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన బీఆర్ఎస్, ప్రస్తుత అధికార కాంగ్రెస్ పార్టీ రెండూ నిరుపయోగమైనవేనని, ఆ రెండు కుటుంబ, అవినీతి పార్టీలని  బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా దుయ్యబ్టటారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో వేల కోట్ల రూపాయల అవినీతికి బీఆర్ఎస్ పార్టీ పాల్పడితే.. దేశవ్యాప్తంగా గతంలో హస్తం పార్టీ చేయని స్కాం లేదని విమర్వించారు. వీళ్లంతా స్కీమ్స్ పెట్టింది స్కామ్స్ కోసమేనని జేపీ నడ్డా ఎద్దేవా చేశారు.
 
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండ, చౌటుప్పల్లో జరిగిన సభలకు హాజరైన జేపీ నడ్డా.. భువనగిరి ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. మొదటి నుంచి రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని చెబుతూ  బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని పదేపదే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ విధంగా నరేంద్ర మోదీ సర్కార్ రిజర్వేషన్లను తొలగించదని స్పష్టం చేశారు.

మరోవైపు, ఎన్డీఏ సర్కారు కృషి వల్లే, దేశంలో 25 కోట్ల మంది పేదల జీవితాల్లో వెలుగులు విరజిమ్మాయని జేపీ నడ్డా తెలిపారు. ప్రధాని అన్న యోజన కింద 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్‌ బియ్యం ఇస్తున్నట్లు, తెలంగాణలోనూ 2 కోట్ల మందికి ఉచితంగా రేషన్‌ బియ్యం ఇస్తున్నట్లు తెలిపారు. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద రైతులకు ఏటా రూ.6 వేలు ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 
 
కరోనా క్లిష్ట సమయాన్ని మోదీ  ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొందని నడ్డా వివరించారు. మోదీ  నాయకత్వంలో భారత్‌ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశంగా ఎదిగిందని పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతోందని ధీమా వ్యక్తం చేశారు.  ప్రస్తుతం ఆటోమొబైల్‌ రంగంలోనూ భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉందని చెప్పారు. పదేళ్ల క్రితం మన దేశంలో ఫోన్లపై మేడిన్‌ చైనా, మేడిన్‌ కొరియా అని ఉండేదని.. ఇప్పుడు మనం వాడుతున్న ఫోన్లపై మేడిన్‌ భారత్‌ అని ఉంటోందని జేపీ నడ్డా హర్షం వ్యక్తం చేశారు.

మోదీ హయాంలో హైవేలు, రైల్వే లైన్ల విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని వ్యాఖ్యానించారు. ఒకే దేశం- ఒకే రాజ్యాంగం ఉండాలనేది మోడీ ప్రభుత్వ విధానమని జేపీ నడ్డా తెలిపారు. కాంగ్రెస్‌ పాలనలో జమ్ముకాశ్మీర్‌కు 70 ఏళ్లపాటు ప్రత్యేక రాజ్యాంగం ఉందని విమర్శించారు. పాకిస్థాన్‌ విషయంలో మోడీ సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని, అటువంటి ఆలోచనలు కాంగ్రెస్ ఎన్నడూ తీసుకోలేదని ద్వజమెత్తారు. దేశం అభివృద్ధి వైపు పయనించాలంటే బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని జేపీ నడ్డా పిలుపునిచ్చారు.