మోదీ గుండెలో బండి సంజయ్‌కి ప్రత్యేక స్థానం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  గుండెలో బండి సంజయ్ కుమార్‌కు ప్రత్యేక స్థానం ఉందని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఐపీఎస్ ఆఫీసర్ అన్నామలై కొనియాడారు. దక్షిణ భారతదేశంలో బీజేపీని బలోపేతం చేసేందుకు బండి సంజయ్‌కు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారని చెబుతూ సంజయ్ చేసిన పోరాటాలు దేశానికే ఆదర్శమయ్యాయని పేర్కొన్నారు. సంజయ్ పాదయాత్ర స్పూర్తితోనే తమిళనాడులో తాను పాదయాత్ర చేపట్టినట్లు చెప్పుకొచ్చారు. 
 
జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటాలు చేసి లాఠీలు, కేసులకు భయపడకుండా జైలుకు వెళ్లిన చరిత్ర సంజయ్‌కే సొంతమని అన్నామలై కొనియాడారు. బండి సంజయ్ గెలిస్తే సామాన్యుడు గెలిచినట్లేనని పేర్కొంటూ మొత్తం పోలైన ఓట్లలో 60 శాతం ఓట్లు బండి సంజయ్‌కే పడేలా ఇంటింటికీ తిరిగి గెలిపించాలని యువతకు పిలుపునిచ్చారు.

హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంటలో జరిగిన బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన యువ సమ్మేళనానికి బండి సంజయ్‌తో పాటు అన్నామలై హాజరవుతూ “బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి చేస్తే.. దానిపై పోరాడినందుకు అనేకసార్లు అరెస్టయిన నాయకుడు బండి సంజయ్. ఆయన సేవలను గుర్తించిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది. ఆయన దక్షిణ భారత దేశంలో పార్టీని బలోపేతం చేస్తారనే నమ్మకం ఉంది” అని తెలిపారు.

 
 కాంగ్రెస్ 6 గ్యారంటీల పేరుతో ఓట్లు దండుకుని గద్దె నెక్కాక వాటిని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు.  మహిళలకు రూ.2500లు ఇవ్వనేలేదు. రూ.4 వేల పెన్షన్ ఇవ్వనేలేదు. రూ.5 లక్షల విద్యార్థి భరోసా కార్డు ఇవ్వనేలేదు. రైతు భరోసా కింద రైతులు, కౌలు రైతులకు రూ.15 వేలు, రైతు కులీలకు రూ.12 వేలు ఇవ్వనేలేదు. ఇంటి జాగా, రూ.5 లక్షల సాయం చేయనేలేదు… అబద్దాలనే పునాదులపైనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ధ్వజమెత్తారు. 
 
గుజరాత్ తో తెలంగాణ పోటీ అంటున్న రేవంత్ రెడ్డి గుజరాత్ లో సబర్మతి నదిని ఏ విధంగా ప్రక్షాళన చేశారో, మూసీ నదిని మీరెందుకు ప్రక్షాళన చేయలేదో చెప్పాలని కోరారు. తమిళనాడులో పంట నష్టపోతే పరిహారం అందిస్తాం… మరి తెలంగాణలోఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కిసాన్ సమ్మాన్ నిధిని యూజ్ లెస్ స్కీంగా కేసీఆర్ తీసిపారేశారని, కానీ రైతులకు మాత్రం మెరుగైన సాయం ఎందుకు చేయలేకపోయారు?  అని ప్రశ్నించారు.
 
ఈ దేశంలో రైతుల, యువత, మహిళల, విద్యార్థుల వ్యతిరేకి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ మాత్రమే అని ధ్వజమెత్తారు.  “ఇకపై మీరంతా ఒక్కొక్క యువ మోర్చా నాయకుడు.. 100 మంది బీజేపీయేతర ఇండ్లకు వెళ్లాలి. వారిని ఒప్పించాలి” అని సూచించారు.