ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

మద్యం కుంభకోణానికి సంబంధించిన ఈడీ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ కస్టడీని దిల్లీలోని రౌజ్‌ అవెన్యూ న్యాయస్థానం మరో వారం రోజులు పొడిగించింది. ఈడీ కేసులో ట్రయల్‌ కోర్టు విధించిన జ్యుడీషియల్‌ కస్టడీ నేటితో ముగియటంతో, కవిత అభ్యర్థన మేరకు ఆమెను నేరుగా కోర్టు ముందు మంగళవారం హాజరుపరిచారు. 

మరోసారి కస్టడీని పొడిగించాలన్న దర్యాప్తు సంస్థల విజ్ఞప్తి మేరకు న్యాయస్థానం, కవిత జ్యుడీషియల్ కస్టడీని మే 14వ తేదీ వరకు పొడిగించింది. దీంతో అప్పటివరకు ఆమె తిహాడ్‌ జైలులోనే ఉండనున్నారు. వారం రోజుల్లో కవితపై చార్జ్‌షీట్‌ను దాఖలు చేస్తామని కోర్టుకు ఈడీ అధికారులు వెల్లడించారు.

జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్న తనను కోర్టు విచారణ సమయంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కాకుండా ప్రత్యక్షంగా ప్రవేశపెట్టేలా దర్యాప్తు సంస్థలను ఆదేశించాలని కోరుతూ కవిత చేసిన విజ్ఞప్తిని న్యాయమూర్తి కావేరి బవేజా పరిగణనలోకి తీసుకున్నారు. ఇక మీదట కోర్టు విచారణ సమయంలో అవసరమైనప్పుడు ఆమెను నేరుగా హాజరుపరచాలని దర్యాప్తు సంస్థల అధికారులను ఆదేశించారు.

దిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఎమ్మెల్సీ కె.కవితకు బెయిల్‌ ఇవ్వడానికి ఇక్కడి రౌజ్‌ అవెన్యూ కోర్టు సోమవారం నిరాకరించింది. తనపై దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసుల్లో బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ ఆమె పెట్టుకున్న వేర్వేరు దరఖాస్తులను స్పెషల్‌ జడ్జి కావేరి బవేజా తిరస్కరించారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం ఉత్తర్వులు వెలువరించారు.