గజ్వేల్ నుంచి కేసీఆర్ పై పోటీ చేస్తా

శాసనసభ ఎన్నికలలో హుజురాబాద్‌తో పాటు సీఎం కేసీఆర్ పై గజ్వేల్ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు బిజెపి రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వెల్లడించారు. హుజూరాబాద్ నియోజకవర్గ బీజేపీ మఖ్యకార్యకర్తలతో సమావేశంలో ఆయన కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. హుజురాబాద్ నియోజకవర్గం 119 నియోజకవర్గాలకు ఆదర్శంగా నిలిచి, డబ్బులు లేకున్నా నాయకుడు కావచ్చు అని నిరూపించిందని ఆయన తెలిపారు.

“కులంతో, మతంతో సంబంధం లేకుండా నన్ను గెలిపించారు. తొలిసారి నేను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు.. నేను మీ బిడ్డను అని చెప్పిన” అని గుర్తు చేశారు. “నేను 6 ఫీట్ల హైట్ లేకపోవచ్చు రాజకీయ నేపథ్యంలో ఉన్న కుటుంబం నుంచి రాకపోవచ్చు కానీ మీ బాధలు తీర్చేవాడిని నేనే అని చెప్పాను. ఆనాటి ప్రభుత్వాలకు సోయి, సెన్స్ ఉండేవి. ఎమ్మెల్యే ప్రస్తావించిన సమస్య న్యాయమైనదంటే దానిని పరిష్కరించేవారు” అంటూ వివరించారు. 

హుజురాబాద్‌ను అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలిపానని చెబుతూ హోదా ఉన్నవాడితో కొట్లాడతాం.. కానీ సైకోతో ఏం కొట్లడతాం? అంటూ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. ఎవరి చరిత్ర ఏంటో చెప్పుకోవాలి అని పేర్కొంటూ అంతిమంగా నిర్ణయించేది ప్రజలే అని ఆయన వెల్లడించారు.సర్కార్ పెట్టే అక్రమ కేసులకు భయపడవద్దని చెబుతూ గతంలో ఉద్యమంలో అనేక కేసుల్లో జైలుకు వెళ్లానని పేర్కొన్నారు.

తనను గెలవనియ్యవద్దని కొందురు అనుకుంటున్నారని, అయితే ఆ విషయాన్నిప్రజలు అనుకుంటేనే అవుతుందని స్పష్టం చేశారు. కేసీఆర్ సర్కార్ ను బొందపెట్టాలని పిలుపునిచ్చారు. 

“రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ మీద, హుజూరబాద్ నియోజకవర్గంలో పోటీ చేస్తా.. మీరు తలుచుకుంటే వేరే వాళ్ళకి డిపాజిట్లు కూడా రావు. ఎన్నికల వేళ మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత నాది” అని ఆయన కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఈ నెల 16వ తేదీ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హుజురాబాద్ రాబోతున్నారు. ఆ సభను విజయవంతం చేయాలని కోరారు.