కాంగ్రెస్ కు `రిటర్న్ గిఫ్ట్’ ఇవ్వనున్న షర్మిల!

 
దేశంలోనే ఇప్పటివరకు మహిళా నేతలెవ్వరూ చేయనంతగా 3,000 కిమీ కు పైగా తెలంగాణాలో పాదయాత్ర జరిపి,  బలమైన రాజకీయ శక్తిగా ఎన్నికల్లో సత్తా చూపేందుకు వ్యూహాత్మకంగా రెండేళ్లకు పైగా అడుగులు వేస్తున్న వైఎస్‌ఆర్‌టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇప్పుడు రాజకీయంగా తనను నట్టేట ముంచేటట్లు వ్యవహరించిన కాంగ్రెస్ పై ఆగ్రహంతో రగిలి పోతున్నారు.
 
ముందుగా పొత్తు పెట్టుకోమని, ఆ తర్వాత కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేయమని పలు దఫాలుగా సంప్రదింపులు జరిపి, పార్టీ అగ్రనాయకత్వం నుండి ఎన్నో భరోసాలు ఇచ్చి, చివరకు ఎన్నికలు వచ్చేసరికి ముఖం చాటేస్తుండటంతో ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 119 నియోజకవర్గాలలో అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా కాంగ్రెస్ కు `రిటర్న్ గిఫ్ట్’ ఇచ్చేందుకు సమాయత్తం అవుతున్నారు.
 
స్వయంగా పార్టీ అధినేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నుండి అనేకమంది సంప్రదింపులు జరిపారు. ముందుగా కొందరు తెలంగాణ కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆంధ్ర ప్రదేశ్ లో పార్టీ బాధ్యతలు చేపట్టాలని కోరారు. ఆ విధంగా అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న తన సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కట్టడి చేయాలని అనుకున్నారు.
 
అందుకు కూడా ఆమె సిద్ధమయ్యారు. కానీ అంతలో మాటమార్చి, రెండు తెలుగు రాష్ట్రాలను వదిలిపెట్టి మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ ప్రచారం చేయమన్నారు. తెలంగాణ నుండి పోటీ చేస్తే కేసీఆర్ గతంలో టిడిపితో పొత్తు పెట్టుకున్నట్లు సెంటిమెంట్ అస్త్రం ప్రయోగిస్తారనే భయంతో రాజ్యసభకు కర్ణాటక నుండి పంపిస్తాములే అని చెప్పారు.
 
కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు ఆమెతో పలుపర్యాయాలు సమావేశమై వివరంగా చర్చలు జరిపారు. చివరకు తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు సిద్ధం కాగా అదిగో, ఇదుగో అంటూ వాయిదా వేస్తూ వచ్చారు. ఇప్పుడు చివరకు తెలంగాణ ఎన్నికల తర్వాత చూద్దాంలే అంటూ దాటవేస్తుండటంతో ఆమె పరిస్థితి దిక్కుతోచని విధంగా మారింది.
 
కాంగ్రెస్ తో కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయించుకొని సుమారు ఐదారు నెలలుగా ఆమె తన పాదయాత్రను ఆపివేశారు. తన పార్టీని ఎన్నికలకు సమాయత్తం చేయడం గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ చేతులెత్తేయడంతో ఆమె ఏమైనా సరే అభ్యర్థులను నిలబెట్టి కాంగ్రెస్ కు తగు గుణపాఠం నేర్పాలనే ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది.
 
ఒక వేళ టిడిపితో బిజెపి పొత్తు పెట్టుకొంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కాంగ్రెస్ దగ్గరకు రాక తప్పదనే అంచనాతో ఆమెను దూరంగా పెడుతున్నట్లు పలువురు భావిస్తున్నారు. ఈ విషయమై ఇప్పటికే జగన్ వద్దకు రాయబారాలు పంపుతున్నట్లు చెబుతున్నారు.

రాష్ట్రంలోని 33 జిల్లాల పార్టీ నేతలతో షర్మిల గురువారం సమావేశమై  రాష్ట్రంలోని మొత్తం 119 స్థానాల్లో వైఎస్‌ఆర్‌టిపి పోటీ చేస్తుందని ప్రకటించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతో కాంగ్రెస్ తో కలిసి వెళ్లాలని అనుకున్నామని,  కాంగ్రెస్ తో చర్చలు జరిపామని, నాలుగు నెలలు వేచి చూశామని ఆమె చెప్పారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో చీలిక నివారించడం కోసం కాంగ్రెస్ లో విలీనంకోసం ప్రయత్నం చేశామని చెప్పిన షర్మిల ఇప్పుడు అన్ని సీట్లకు కూడా పోటీచేస్తామని ప్రకటించడం కాంగ్రెస్ ఓట్లు చీల్చి, ఆ పార్టీ అధికారంలోకి రాకుండా చూడటమే ఆమె లక్ష్యంగా కనిపిస్తున్నది.

 తాను పాలేరుతో పాటు మరో స్థానంలో పోటీ చేస్తానని చెప్పారు. తన తల్లి విజయమ్మ, తన భర్త అనిల్ కూడా పోటీ చేయాలనే డిమాండ్లు ఉన్నాయని తెలిపారు. విజయమ్మ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. బీఫామ్ ల కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తెలంగాణలో మళ్లీ రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు.

తన భర్త, తల్లి కూడా పోటీ చేస్తామని చెప్పడం చూస్తుంటే ఆమె తమ కుటుంభంలో ముగ్గురికి సీట్లు ఇవ్వాలని కోరితే కాంగ్రెస్ అధిష్టానం తిరస్కరించిందని కూడా పలువురు భావిస్తున్నారు. కాంగ్రెస్ తో సయోధ్య ప్రయాత్నాలను అడ్డుకోవడంలో కీలకంగా వ్యవహరించిన టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఓడించడం కోసం స్వయంగా ఆమె భర్త ఆయనపై పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు చెబుతున్నారు.