పార్వతీకుండ్ ఒడ్డున ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు

సరిహద్దు రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లో పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఉదయం పిథోర్‌గఢ్‌కు చేరుకున్నారు. ఆది కైలాస పర్వత శిఖరాన్ని దర్శించారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగానే ముందుగా పితోర్‌గ‌ఢ్‌లోని పార్వతీ కుండ్‌లో ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో పూజ‌లు నిర్వ‌హించారు. అనంత‌రం జోలింగ్‌కాంగ్‌లోని పార్వతి కుండ్ ఒడ్డున ఉన్న శివ-పార్వతీ ఆలయంలో కూడా ప్రధాని మోదీ పూజలు చేశారు. ఆ తర్వాత శివుని నివాసమైన ఆది కైలాస శిఖరం ముందు ప్ర‌ధాని మోదీ కాసేపు కూర్చుని ధ్యానం చేశారు.

తలపాగా, రంగా (పై వస్త్రం)తో కూడిన సంప్రదాయ గిరిజన వస్త్రధారణతో హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆది కైలాస పర్వత శిఖరానికి అభిముఖంగా కూర్చొని కొద్దిసేపు ధ్యానం చేశారు. ఇక్కడి నుంచి ఆది కైలాస దర్శనంతో మనస్సులొ ప్రశాంతత నెలకొన్నదని చెబుతూ దేశ ప్రజల సుఖ సంతోషాల కోసం ప్రార్థించినట్టు మోదీ తెలిపారు.

 ఈ సందర్భంగా ప్రధానికి స్థానిక పూజారులు వీరేంద్ర కుటియాల్, గోపాల్ సింగ్‌లు తోడుగా ఉన్నారు. అక్కడి నుంచి సరిహద్దుల్లోని గుంజీ గ్రామాన్ని మోదీ సందర్శించారు. స్థానికులతోపాటు భద్రతా సిబ్బందితో కూడా ఆయన ముచ్చటించారు. స్థానిక వస్తు ప్రదర్శనను తిలకించారు. సమీపంలోని జగేశ్వర్ ధామ్ లోని శివాలయ సందర్శనకు వెళ్లారు.

”ఉత్తరాఖండ్‌లోని పితోర్‌ఘర్‌లోని పవిత్ర పార్వతి కుండ్‌లో దర్శనం చేసుకుని నేను ఎంతో సంతోషించాను. ఇక్క‌డ పూజ‌లు నిర్వ‌హించి నేను ఎంతో పొంగిపోయాను. ఇక్కడ జ‌రిగిన ఆది కైలాస దర్శనంతో నా మనసు కూడా ఎంతో సంతోషించింది. ప్రకృతి ఒడిలో నెలకొని ఉన్న ఆధ్యాత్మికత, సంస్కృతికి సంబంధించిన ఈ ప్రదేశం నుంచి మన దేశంలోని కుటుంబ సభ్యులందరూ సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను” అని ప్రధాని మోదీ పూజ అనంత‌రం ఎక్స్ లో ఓ పోస్టు చేశారు.

ఈ పర్యటనలో భాగంగా కుమావుమ్ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. పిథోర్‌గఢ్‌లోని ఎస్‌ఎస్ వాల్డియా స్పోర్ట్ స్టేడియంలో బహిరంగ సభలో ప్రసంగించిన తరువాత రూ. 4200 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశాతారు. నైనిసైని విమానాశ్రయం నుంచి బహిరంగ సభా వేదికకు వచ్చేలోగా కుమయూన్‌కు చెందిన సాంస్కృతిక కళాకారుల బృందాలు ప్రధానికి స్వాగతం పలికాయి.

ఉత్త‌రాఖండ్ ప‌ర్య‌ట‌న‌కు ముందు ప్ర‌ధాని మోదీ ఎక్స్‌లో స్పందించారు. తమ ప్ర‌భుత్వం ఉత్త‌రాఖండ్ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ర్ట ప్ర‌జ‌ల ప్ర‌తి ఒక్క‌రి సంక్షేమానికి కట్టుబ‌డి ఉంటుంద‌ని తెలిపారు. ఈ రాష్ట్ర అభివృద్ధికి మ‌రింత వేగాన్ని అందించ‌డం కోసం పితోర్‌ఘ‌డ్‌లో తాను అనేక ప్రాజెక్టుల‌కు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్న‌ట్లు తెలిపారు. 
 
గుంజి గ్రామ ప్రజలతో మమేకమయ్యే మంచి అవకాశం కూడా నాకు ద‌క్కిందని చెబుతూ ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుంటానని చెప్పారు. ఆధ్యాత్మికంగా ప్ర‌సిద్ధి చెందిన పార్వతీ కుండ్ దర్శనం కోసం, జగేశ్వర్ ధామ్‌లో పూజలు నిర్వ‌హించ‌డం కోసం తాను ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాను అని వివరించారు.