సిఐడి విచారణలో భువనేశ్వరి ప్రస్తావన.. లోకేష్ విస్మయం!

ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకుందని చెబుతున్న అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమాల కేసులో వరుసగా రెండు రోజులపాటు ఏపీ సిఐడి జరిపిన విచారణలో అకస్మాత్తుగా తన తల్లి భువనేశ్వరి పేరును తీసుకు రావడం పట్ల టీడీపీ నేత నారా లోకేష్ విస్మయం వ్యక్తం చేశారు. న్యాయవాది సమక్షంలో బుధవారం ఆరు గంటలసేపు జరిపిన విచారణ గురించి మీడియాకు వివరించారు. 
 
రెండు రోజు మొత్తం 47 ప్రశ్నలు అడగగా ఎక్కువగా మొదటిరోజు అడిగిన ప్రశ్నలనే తిరిగి అడిగారని తెలిపారు. హైకోర్టు తనను ఒక్క రోజు విచారించాలని చెప్పినా సీఐడీ మాత్రం రెండో రోజు కూడా రమ్మని పిలవగా తాను హాజరైనట్లు చెప్పారు.  రెండో రోజు కూడా ఈ కేసుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు తన ముందు పెట్టలేదని, కనీసం అందుకు సంబంధించిన ప్రశ్నలను కూడా తనను అడగలేదని ఆయన విమర్శించారు.
 
సిఐడి అధికారులు విచారణలో తన తల్లి భువనేశ్వరి ఐటీ రిటర్న్స్‌ పత్రాలను తన ముందు ఉంచి ప్రశ్నించారని అంటూ విస్మయం వ్యక్తం చేశారు. భువనేశ్వరి ఐటీ రిటర్న్స్‌ మీ వద్దకు ఎలా వచ్చిందని సీఐడీ అధికారులను అడిగితే సమాధానం చెప్పలేదని తెలిపారు.  తన తల్లి ఐటీ రిటర్న్స్ ఎలా వెళ్లాయనే దానిపై సీరియస్ గా తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.
 
నిందితులు కానీ వారి ఐటీ వివరాలు ఎలా బయటికి వచ్చాయి? అనే దానిపై ఐటీ అధికారులకు లేఖ రాస్తామని తెలిపారు.  కాగా, తన శాఖకు సంబంధం లేని ప్రశ్నలు పదేపదే అడిగారని లోకేష్ తెలిపారు. జీవో 282 గురించి ప్రస్తావించగా కోర్టు ఆదేశాలతో 99 మందికి మినహాయింపు ఇచ్చినట్లు చెప్పానని పేర్కొన్నారు. “ఇన్నర్‌ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌తో నాకు సంబంధం లేదు. ఇన్నర్‌ రోడ్ కేసు ఆధారాలు ఎక్కడా చూపెట్టడం లేదు” అంటూ వివరించారు.
 
కాగా, ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ మార్పునకు అధికారులను ఒత్తిడి చేశారా?, మీరు మంత్రి అవ్వగానే కేబినెట్ సబ్ కమిటీలో ఎందుకు చేర్చారు?. మంత్రి వర్గ ఉప సంఘంలో ఇతర సభ్యులను ఐఆర్ఆర్ గురించి ఒత్తిడి చేశారా?. హెరిటేజ్‌, లింగమనేని, నారాయణ భూములకు లబ్ధి చేకూర్చేందుకు అలైన్‌మెంట్‌ ఎందుకు మార్చారు?. 
 
ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు భూసేకరణ పరిహారాన్ని భారీగా పెంచడంలో మీ పాత్ర ఉందా?. భూసేకరణ వ్యయాన్ని రూ.210 కోట్లు అదనంగా ఎందుకు పెంచారు?. లింగమనేని రమేష్‌ మీకు ఎందుకు ఇల్లు ఉచితంగా ఇచ్చారు? అని నారా లోకేశ్ కు సీఐడీ అధికారులు ప్రశ్నలు సంధించారు.