బందీలను విడిచిపెట్టేవరకు గాజాకు అన్ని సరఫరాలు బంద్

బందీలను హమాస్ ఉగ్రవాదులు విడిచిపెట్టేవరకు గాజాకు విద్యుత్, ఇంధనం, మంచినీరు సరఫరా చేసే ప్రసక్తి లేదని ఇజ్రాయెల్ ఇంధన శాఖ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ గురువారం ప్రకటించారు. ఇజ్రాయలీ బందీలు తమ ఇళ్లకు తిరిగివచ్చే వరకు వరకు గాజాలో కరెంట్ స్విచ్ నొక్కే అవకాశం లేదు, మంచినీటి నల్లాలు తిప్పే అవసరం రాదు, ఏ ఇంధనం ట్రక్కు అక్కడకు ప్రవేశించదు అంటూ ఎక్స్‌లో రాసిన పోస్టులో ఇజ్రాయెల్ మంత్రి స్పష్టం చేశారు. 

మానవత్వానికి ప్రతిగా మానవత్వం ఉంటుంది..మాకు ఎవరూ నీతులు చెప్పనక్కర్లేదు అంటూ ఆయన ఘాటుగా జవాబిచ్చారు. ఇజ్రాయెలీ అధికారులు తెలిపిన ప్రకారం అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై దాడి చేసిన హమాస్ ఉగ్రవాదులు దాదాపు 150 మంది ఇజ్రాయెలీలను గాజాలో బందీలుగా చేసుకున్నారు.

ఇందుకు ప్రతీకారంగా గాజాను దిగ్బంధిస్తున్నట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ సోమవారం ప్రకటించారు. గాజాకు విద్యుత్, ఆహారం, మంచినీరు, ఇంధన సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇంధన కొరత కారణంగా గాజాలోని ఏకైక విద్యుత్ స్టేషన్ బుధవారం నుంచి పనిచేయడం ఆగిపోయింది. 

గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయిల్ ర‌క్ష‌ణ ద‌ళాలు చేసిన దాడిలో 1203 మంది పాల‌స్తీనియ‌న్లు మృతిచెందిన‌ట్లు హ‌మాస్ గ్రూపు పేర్కొన్న‌ది. ఆ దాడిలో సుమారు ఆరు వేల మంది గాయ‌ప‌డిన‌ట్లు హ‌మాస్‌కు చెందిన ఆరోగ్య‌శాఖ తెలిపింది. మ‌రో వైపు ఇజ్రాయిల్ భూభాగంలో ఉన్న సుమారు 1500 మంది పాల‌స్తీనా ఉగ్ర‌వాదుల్ని హ‌త‌మార్చిన‌ట్లు ఇజ్రాయిల్ ర‌క్ష‌ణ ద‌ళాలు (ఐడీఎఫ్) పేర్కొన్న‌ది.

40 మంది చిన్నారుల్నిన‌రికివేసిన‌ హ‌మాస్

మరోవంక, హ‌మాస్ మార‌ణ‌హోమం సృష్టిస్తోంది. వేలాది మంది ఇజ్రాయిల్ ప్ర‌జ‌ల్ని చంపేస్తోంది. కిబుజిమ్‌లో హ‌మాస్ ఫైట‌ర్లు బీభ‌త్సం సృష్టించారు. మ‌హిళ‌లు, చిన్నారులు, ప‌సిపిల్ల‌లు, వృద్ధుల్ని అత్యంత కిరాత‌కంగా చంపేస్తున్నారు. ఇస్లామిక్ ఉగ్ర‌వాదుల త‌ర‌హాలో హ‌మాస్ తీవ్ర‌వాదులు రెచ్చిపోతున్నారు. 

కిబుజిమ్‌లో సుమారు 40 మంది చిన్నారుల్ని హ‌మాస్ న‌రికివేసిన‌ట్లు ఐడిఎఫ్ పేర్కొన్నాయి. ప‌సి పిల్ల‌ల‌ను చంపేస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయ‌ని, హ‌మాస్ ఇలాంటి దాడుల‌కు పాల్ప‌డుతుంద‌ని తొలుత న‌మ్మ‌లేద‌ని, కానీ సాక్ష్యులు చెబుతున్న విష‌యాలు భ‌యాన‌కంగా ఉన్న‌ట్లు ఐడీఎఫ్ ప్ర‌తినిధి జోనాథ‌న్ క‌న్‌రిక‌స్ తెలిపారు.  మ‌హిళ‌లు, చిన్నారుల చేతుల‌కు సంకెళ్లు వేసి న‌రికివేస్తున్నార‌ని ఆయ‌న చెప్పారు. హ‌మాస్ క్రూర‌త్వానికి ప్ర‌పంచానికి చూపేందుకు.. కిబుజిమ్ ప్రాంతానికి అంత‌ర్జాతీయ జ‌ర్న‌లిస్టుల‌ను తీసుకువెళ్లారు.

హమాస్ విమాన నిఘా వ్యవస్థ ధ్వంసం

ఇలా ఉండగా, ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడుల్లో హమాస్ విమాన నిఘా వ్యవస్థ ధ్వంసం అయింది. ఇప్పటికే హమాస్ ఉగ్రవాదుల నౌకలను పేల్చేసిన ఇజ్రాయెల్ దళాలు తాజాగా వైమానిక నిఘా వ్యవస్థను నాశనం చేసింది. దీంతో హమాస్ మిలిటెంట్లకు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఈ క్రమంలోనే హమాస్‌ ఆయుధ నిఘా, వ్యవస్థలు క్రమంగా ధ్వంసం అవుతున్నాయి.
ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థను పకడ్బందీగా హమాస్ మిలిటెంట్లు ఏర్పాటు చేసుకున్నారు. కొన్ని బిల్డింగ్‌లపై ఉన్న సోలార్‌ ప్యానళ్ల వెనుక ప్రత్యేకమైన కెమెరాలు ఏర్పాటు చేసి మరీ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఇవి ఇజ్రాయెల్‌ విమానాలు గాల్లో ఉండగానే గుర్తించి.. హమాస్‌ ఉగ్రవాదులకు సమాచారం అందించడంతో వారు ఇజ్రాయెల్ విమానాలపై దాడులకు దిగుతున్నారు. ఇలాంటి నిఘా వ్యవస్థలు గాజా స్ట్రిప్‌లో పలు చోట్ల ఉన్నాయని.. వాటిని ధ్వంసం చేసిన విషయాన్ని ఐడీఎఫ్‌ దళాలు ట్విటర్‌లో వెల్లడించాయి.
 
ఇప్పటికే హమాస్‌ మిలిటెంట్ల నౌకలను ఇజ్రాయెల్‌ పేల్చివేసింది. గాజా స్ట్రిప్‌లోని మధ్యదరా సముద్రం నుంచి హమాస్‌ డైవర్లు ఈదుకుంటూ వచ్చి ఇజ్రాయెల్‌ భూభాగంలోకి చొరబడుతున్నారు. వీటిని అడ్డుకునేందుకు రంగంలోకి దిగిన ఇజ్రాయెల్ దళాలు గాజా సిటీ, ఖాన్‌ యూనిస్‌ రేవుల వద్ద ఉన్న హమాస్‌ నౌకలను పేల్చివేశాయి.