అష్టదిగ్బంధంలో హమాస్.. స్మశానంలా గాజా

అష్టదిగ్బంధంలో హమాస్.. స్మశానంలా గాజా
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో మృత్యుఘోష కొనసాగుతోంది. ఈ యుద్ధంలో రెండు వైపుల మృతుల సంఖ్య రోజుకు రోజుకు భారీగా పెరుగుతోంది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు 1,600 మంది చనిపోయారు. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం నాలుగు రోజులుగా కొనసాగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్ దాడుల్లో 143 మంది పిల్లలు, 105 మంది మహిళలు సహా 704 మంది మరణించారు. 4,000 మందికి పైగా గాయపడ్డారు. ఇక హమాస్ దాడి కారణంగా ఇజ్రాయెల్‌లో కనీసం 900 మంది మరణించారు. 2,600 మంది గాయపడ్డారు. బందీలుగా ఉన్న 100 మంది ఇజ్రాయెల్ పౌరుల మృతదేహాలు ఓ వ్యవసాయ పొలంలో లభించాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు హమాస్ ఉగ్రవాద సంస్థ రహస్య స్థావరాలను ధ్వంసం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. హమాస్‌పై ఇజ్రాయెల్ దాడి చేయడం ప్రారంభించిందని ఆయన తెలిపారు. “మేము ఈ యుద్ధాన్ని కోరుకోలేదు. ఇది అత్యంత క్రూరమైన రీతిలో మాపైకి బలవంతంగా వచ్చింది. హమాస్ ఈ యుద్ధాన్ని ప్రారంభించనప్పటికీ ఇజ్రాయెల్ దానిని పూర్తి చేస్తుంది” అని చెప్పారు.
ఇక హమాస్‌ మిలిటెంట్లు పాగా వేసిన గాజాస్ట్రిప్‌ను ఇజ్రాయెల్‌ అష్ట దిగ్బంధనం చేసింది. అక్కడికి కరెంటు సరఫరా, నీరు, ఆహారం, ఇంధన సరఫరాను నిలిపివేసింది. ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి యోవ్‌ గల్లాంట్‌ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. గాజాలోని సుమారు వెయ్యి ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. 159 ఇండ్లు, 1210 ఇతర నిర్మాణాలు కుప్పకూలాయి. దీంతో ఇప్పటికే గాజాలో లక్ష మందికి పైగా నిరాశ్రయులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తిండి, నీరు లేకపోవడంతో వారంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు సరిహద్దులు దాటి ఇజ్రాయెల్ లోకి చొచ్చుకొచ్చిన హమాస్ మిలిటెంట్లను ఐడీఎఫ్ దళాలు ఏరివేశాయి. సరిహద్దులను సైన్యం తిరిగి స్వాధీనం చేసుకుంది. రక్షణ కంచెల వద్ద యుద్ధ ట్యాంకులతో ఇజ్రాయెల్ దళాలు నిరంతంర పహారా కాస్తున్నాయి. అదనంగా 3 లక్షల మందిని  ఇజ్రాయెల్ రంగంలోకి దించింది.
రాకెట్ దాడులతో ఇజ్రాయెల్ లో ఊచకోతకు దిగిన హమాస్ మిలిటెంట్లను గత 3 రోజులుగా ఇజ్రాయెల్ మట్టుపెడుతోంది. దాడికి దిగిన రోజు రాత్రికి రాత్రే 500 మంది మిలిటెంట్లను హతమార్చింది. కాగా ఇప్పటికే హమాస్ మిలిటెంట్లు సుమారు 130 మందికి పైగా ఇజ్రాయెల్, ఇతర దేశాల వారిని బందీలుగా చేసుకున్నారు. ఇక హమాస్ చేసిన దాడుల్లో అమెరికాకు చెందిన 9 మంది పౌరులు, థాయిలాండ్ కు చెందిన 12 మంది చనిపోయారని.. అలాగే బ్రెజిల్, బ్రిటన్, ఫ్రాన్స్, నేపాల్, మెక్సికో, ఉక్రెయిన్ లకు చెందిన పౌరులు కూడా చనిపోయారు. ఇక ఇజ్రాయెల్ ఉంటున్న భారతీయురాలు హమాస్ రాకెట్ దాడుల్లో గాయపడ్డారు. కేరళకు చెందిన శీజ ఆనంద్ ఆష్కేలోన్ నగరంలో నర్సుగా పనిచేస్తున్నారు. శనివారం ఆమె కుటుంబసభ్యులతో వీడియో కాల్ మాట్లాడుతుండగానే హమాస్ దాడుల్లో గాయపడింది.
హమాస్‌ చేసిన మెరుపు దాడి వెనుక ఇరాన్‌ ఉన్నట్టు నివేదికలు వస్తున్నాయి. ఇరాన్ కూడా పాలస్తీనాకు సపోర్ట్ చేస్తున్నట్టు బహిరంగంగానే ప్రకటించింది. లెబనాన్‌ రాజధాని బీరూట్‌లో ఇజ్రాయెల్‌పై దాడికి సంబంధించి ప్రణాళికలు రచించేందుకు సమావేశాలు జరిగినట్టు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనాలు వెలువరించింది. ఇరాన్‌ ఆర్మీ ఐఆర్‌జీసీకి చెందిన నలుగురు ఉన్నతాధికారులు, హెజ్బొల్లా గ్రూప్‌లతో.. హమాస్‌ గతవారం సమావేశమైనట్టు.. అప్పుడే దాడికి ఇరాన్‌ మద్దతు తెలిపినట్టు పేర్కొంది.
ఇజ్రాయెల్‌ను ముప్పుతిప్పలు పెడుతున్న హమాస్‌ వెనుక దాని మాస్టర్‌మైండ్‌ డెయిఫ్‌ ఉన్నట్టు తెలుస్తున్నది. ఏకకాలంలో 5 వేలకు పైగా రాకెట్లను ప్రయోగించాలనే ప్రణాళిక అతడిదేనట. 1980లో హమాస్‌లో చేరిన డెయిఫ్‌ కస్సాం రాకెట్ల తయారీలోనూ భాగమయ్యాడు. గాజా టన్నెళ్ల నిర్మాణం వెనుక కూడా అతడే ఉన్నాడట. డెయిఫ్‌ను మట్టుబెట్టేందుకు అనేకసార్లు ప్రయత్నించిన ఇజ్రాయెల్‌ సఫలం కాలేకపోయింది. కాగా ఇజ్రాయెల్‌ నుంచి ముందస్తు హెచ్చరికలు లేకుండా తమపై దూసుకొచ్చే ఒక్కో బాంబుకు ప్రతీకారంగా ఒక్కో ఇజ్రాయెల్‌ పౌరుడిని ఉరి తీస్తామని హమాస్‌ హెచ్చరించింది. తమ పౌరుల ఇండ్లపై దాడులకు పాల్పడితే సహించేది లేదని పేర్కొంది. ఈ మేరకు ఇజ్రాయెల్‌కు హమాస్‌ వార్నింగ్‌ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్‌పై దాడికి దిగిన హమాస్.. ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకుంటోంది.