గాజాను అష్టదిగ్బంధనం చేసిన ఇజ్రాయెల్‌

యుద్ధంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఇజ్రాయెల్‌ పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ పాలనలో ఉన్న గాజాను పూర్తిగా దిగ్బంధించాలని నిర్ణయించింది. హమాస్‌ మిలిటెంట్లు పాగా వేసిన గాజాస్ట్రిప్‌ను ఇజ్రాయెల్‌ దిగ్బంధం చేసింది. అక్కడికి కరెంటు సరఫరా, నీరు, ఆహారం, ఇంధన సరఫరాను నిలిపివేసింది. ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి యోవ్‌ గల్లాంట్‌ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు.
 
 ‘గాజాకు కరెంట్‌ సరఫరాను నిలిపివేయాలని ఆదేశించాను. ఆహారం, ఇంధనం, నిత్యావసరాలు సరఫరా అయ్యే మార్గాలను మూసివేయాలని నిర్ణయించాం. 500 మంది హమాస్‌ మిలిటెంట్లను మట్టుబెట్టాం. చాలామందిని అదుపులోకి తీసుకున్నాం. హమాస్‌ నుంచి గాజాకు విముక్తి కల్పించడమే ఇజ్రాయెల్‌ లక్ష్యం’ అని ఆయన వెల్లడించాయిరు.
 
తాము ఇప్పుడు మానవ జంతువులతో పోరాడుతున్నామని, అందుకు తగ్గట్టే వ్యవహరిస్తామని ఆయన స్పష్టం చేశారు. గాజా అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతం. 362 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలోనే సుమారుగా 20 లక్షల మంది నివసిస్తున్నారు. ప్రస్తుత యుద్ధంతో వారంతా బిక్కుబిక్కుంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్నారు. గాజాకు తూర్పు, ఉత్తర భాగాల్లో ఇజ్రాయెల్‌, దక్షిణాన ఈజిప్టు, పశ్చిమ భాగంలో మధ్యదరా సముద్రం సరిహద్దులుగా ఉన్నాయి. యుద్ధం కారణంగా ఇరుదేశాలు జల, వాయు, భూ దిగ్బంధాన్ని విధించాయి. దీంతో గాజా వాసులు ఎటువెళ్లలేని పరిస్థితి నెలకొంది. 

ఎటునుంచి మృత్యువు వస్తుందో తెలియక చావు భయంతో నరకయాతన అనుభవిస్తున్నారు. గతంలో 2005-06లో తాత్కాలికంగా, 2007లో శాశ్వతంగా ఇలా గాజా దిగ్బంధంలో చిక్కుకుంది. ఇక, 2007లో గాజాను హస్తగతం చేసుకున్న నాటి నుంచి ఈ 15 ఏండ్లలో ఇజ్రాయెల్‌పై హమాస్‌ ఐదుసార్లు దాడులకు దిగింది.

గాజాలోని సుమారు 1000 ప్రాంతాలపై ఇజ్రాయెల్‌ దాడులు చేసింది. 159 ఇండ్లు, 1210 ఇతర నిర్మాణాలు కుప్పకూలాయి. దీంతో ఇప్పటికే గాజాలో లక్ష మందికి పైగా నిరాశ్రయులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తిండి, నీరు లేకపోవడంతో వారంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

మరోవైపు సరిహద్దులు దాటి ఇజ్రాయెల్‌లోకి చొచ్చుకొచ్చిన హమాస్‌ మిలిటెంట్లను ఐడీఎఫ్‌ దళాలు ఏరివేశాయి. సరిహద్దులను సైన్యం పటిష్ఠం చేసింది. రక్షణ కంచెల వద్ద యుద్ధ ట్యాంకులతో ఇజ్రాయెల్‌ దళాలు నిరంతరం పహారా కాస్తున్నాయి. అదనంగా 3 లక్షల మందిని ఇజ్రాయెల్‌ రంగంలోకి దించింది. ఇరువైపులా 1300 మందికి పైగా మరణించారు.

మెరుపుదాడి చేస్తూ ఇజ్రాయెల్‌లో ఊచకోతకు దిగిన హమాస్‌ మిలిటెంట్లను ఇజ్రాయెల్‌ మట్టుబెట్టింది. రాత్రికి రాత్రే 500 మంది మిలిటెంట్లను హతమార్చింది. కాగా, ఇప్పటికే హమాస్‌ మిలిటెంట్లు సుమారు 130 మందికిపైగా ఇజ్రాయెల్‌, ఇతర దేశాల వారిని బందీలుగా చేసుకున్నారు. హమాస్‌ చేసిన దాడుల్లో అమెరికాకు చెందిన 9 మంది పౌరులు మరణించినట్టు ఆ దేశం ప్రకటించింది. 12 మంది థాయిలాండ్‌ పౌరులు, బ్రెజిల్‌, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, నేపాల్‌, మెక్సికో, ఉక్రెయిన్‌లకు చెందిన పౌరులు చనిపోయారు.

రంగంలోకి అమెరికా యుద్ధ నౌకలు
 
మరోవంక, హమాస్ దాడులతో అతలాకుతలమవుతున్న ఇజ్రాయెల్‌కు అగ్రరాజ్యం బాసటగా నిలిచింది. ఇజ్రాయెల్‌కు సాయంగా ఎయిర్‌క్రాఫ్ట్ కేరియర్‌తో పాటూ యుద్ధ విమానాలను పంపించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడన్ ఆదివారం ఆదేశించారు.  ఈ నేపథ్యంలోనే ఎయిర్‌క్రాఫ్ట్‌ కేరియర్‌తోపాటు యుద్ధ విమానాలు, నౌకలను పెంటగాన్‌ రంగంలోకి దింపింది. 
 
ఇప్పటికే అమెరికాకు చెందిన యుద్ధ నౌకలు మధ్యదరా సముద్రంలో ఇజ్రాయెల్‌కు బయలుదేరాయి. భూ, వాయు మార్గాల్లో దాడులు చేసే క్షిపణుల్ని ఈ నౌకల ద్వారా పంపుతోంది. అంతే కాదు ఈ యుద్ధ నౌకల్లో దాడుల్ని ముందుగానే గుర్తించే అత్యాధునిక నిఘా పరిజ్ఞానం కూడా అందుబాటులో ఉంచింది.హమాస్‌ ముఖ్యంగా అమెరికా పాలసీలను వ్యతిరేకిస్తుంది. దీనికి ఇరాన్‌, సిరియా, యెమెన్‌, లెబనాన్‌లోని హెజ్బోల్లా గ్రూప్‌ల మద్దతు ఉంది. మరోవైపు అనేక అరబ్‌ దేశాలు హమాస్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. కాగా, ఇజ్రాయెల్‌, అమెరికా దీన్ని ఉగ్రవాద సంస్థగా గుర్తించాయి. ఈ మేరకు 2018లో ఐరాసలో ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన అమెరికా ఓటు కూడా వేసింది.