మధ్యప్రదేశ్ మహా సంగ్రామంలో గెలుపెవరిది..?

5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ కూడా ఒకటి. దేశ రాజకీయాలను ప్రభావితం చేసే రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ కీలకమైనది.ఇక్కడ మొత్తం 230 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 29 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. 2024 లోక్ సభ ఎన్నికలకు రిహార్సల్స్‌గా భావించే ప్రస్తుత ఎన్నికల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పవర్‌లోకి రావటం ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ పార్టీలకు అత్యంత అవసరంగా మారింది. దీంతో మధ్యప్రదేశ్ అసెంబ్లీపై జెండా ఎగరేయటానికి ఈ రెండు పార్టీలు సర్వ శక్తులను ఒడ్డుతున్నాయి.
ఇక.. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలుగుచుకుంది. అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించి అధికారాన్ని చేపట్టింది. మొత్తం 230 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఎంపీ అసెంబ్లీలో.. ఆనాడు కాంగ్రెస్ పార్టీ 114 స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ 109 స్థానాలను కైవసం చేసుకోగా బీఎస్పీ 2, సమాజ్ వాదీ పార్టీ 1, ఇండిపెండెంట్లు 4 చోట్ల విజయం సాధించారు. బీఎస్పీ, ఇతరుల సహాయంతో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టగా.. ఆ పార్టీ నేత కమల్ నాధ్ సింగ్ 2018లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు.
అయితే.. 15 నెలలు అధికారంలో ఉన్న తరువాత.. కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత జ్యతిరాదిత్య సింధియా తిరుగుబాటు చేశారు. తన వర్గానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలతో కలిసి ఆయన భారతీయ జనతాపార్టీలో చేరారు. దీంతో మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ రాజీనామా చేయగా.. బీజేపీ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ గద్దెనెక్కారు.ఆ విధంగా..మధ్య ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించనప్పటికీ.. కాంగ్రెస్ పార్టీలో ఏర్పడ్డ తిరుగుబాటుతో.. భారతీయ జనతా పార్టీ 2020లో అధికారాన్ని కైవసం చేసుకుంది. ఆనాటి నుంచి నేటి వరకు మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ బాధ్యతలు తీసుకున్నారు.
ప్రస్తుతం మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడటంతో అక్కడ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్యే ప్రధాన పోటీ జరుగుతోంది. ఎస్పీ, బీఎస్పీ, ఆమ్ ఆద్మీ పార్టీలు బరిలోకి దిగుతున్నప్పటికీ.. వాటి ప్రభావం నామమాత్రంగానే ఉండే అవకాశం ఉంది. కొన్ని సర్వేలు బీజేపీకి.. మరికొన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రిపోర్టులు ఇస్తున్నప్పటికీ.. ఆ రాష్ట్రంలో ఎన్నికల పోరు నువ్వా..? నేనా..? అనేటట్టు సాగనుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాలన మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందని కాంగ్రెస్ పార్టీ అంటోంది. అయితే.. గత మూడేళ్ళుగా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే బీజేపీని గెలిపిస్తాయని కమలనాధులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చిన తీర్పుకు బీజేపీ తూట్లు పొడిచిందనే భావన న్యూట్రల్ ఓటర్లలో వ్యక్తం అవుతోందని వార్తలు వస్తున్నాయి. ఇది ఆ పార్టీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. మరోవైపు.. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు సైతం 4వ లిస్టులో టికెట్ కన్ఫర్మ్ కావటం కూడా.. ఆయనకు మైనస్ గా చెబుతున్నారు. వ్యక్తిగతంగా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రతిష్ట పడిపోవటం బీజేపీకి ప్రతికూలంగా మారవచ్చని మరికొంత మంది వ్యాఖ్యానిస్తున్నారు.
వాస్తవానికి 2003 నుంచి 2023 వరకు మధ్యలో ఓ 15 నెలలు మినహాయిస్తే మిగిలిన కాలం అంతా మధ్యప్రదేశ్‌లో బీజేపీ మాత్రమే అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా సుదీర్ఘ కాలం పని చేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రతిపక్షాల నుంచి అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ బీజేపీ నేతలు.. ప్రధాని మోదీ ఛరిష్మా పైనే ఆధారపడుతున్నారు. గత 6 నెలల్లో ప్రధాని మోదీ 5 సార్లు మధ్యప్రదేశ్ వచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభల్లో పాల్గొని ప్రచారం నిర్వహించారు. మధ్య ప్రదేశ్ ప్రజలకు బీజేపీ చేసిన మేలు గురించి సుదీర్ఘంగా వివరిస్తున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తున్నారు. గత ఎన్నికల్లో వచ్చిన 41 శాతం ఓట్ల కన్నా.. ఈ సారి ఎన్నికల్లో మరింత ఎక్కువగా సాధించి అధికారాన్ని కైవసం చేసుకునే దిశగానే మధ్యప్రదేశ్ బీజేపీ అడుగులు వేస్తోంది.
ఇటు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ సైతం.. దూకుడుగానే ముందుకు వెళుతోంది. పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ మధ్యప్రదేశ్ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. అధికారంలోకి వస్తే మహిళల కోసం “నారీ సమ్మాన్” పథకాన్ని ప్రారంభిస్తామని ప్రియాంకా గాంధీ ప్రకటించారు. ప్రతీ నెల అర్హులైన మహిళల ఎకౌంట్లో 1500 వేస్తామని.. 100 యూనిట్ల వరకు ఉచితంగా గృహ విద్యుత్తు, రూ.500 కే వంట గ్యాస్ పంపిణీ వంటి హామీలను కాంగ్రెస్ పార్టీ గుప్పిస్తోంది. అయితే దీనికి కౌంటర్‌గా బీజేపీ సైతం ప్రజాకర్షక పథకాలను ప్రకటిస్తోంది. లాడ్లీ బెహానా యోజన కింద అర్హులైన ప్రతీ ఆడపడుచుకు నెలకు రూ.1000 ఇస్తామని సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ ప్రకటించారు. ఇలా పోటా పోటీ సంక్షేమ పథకాలతో మధ్యప్రదేశ్ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 230 అసెంబ్లీ స్థానాల పరిధిలో మొత్తం 29 ఎంపీ సీట్లు ఉండగా.. 2019 ఎన్నికల్లో బీజేపీ 28 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక్క స్థానానికే పరిమితం అయ్యింది. దీంతో.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఘన విజయం సాధించటం ద్వారా.. వచ్చే ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికల్లో సైతం సత్తా చాటాలని భారతీయ జనతాపార్టీ యోచిస్తోంది. దీంతో.. ఢిల్లీ నుంచి గల్లీ వరకు సర్వ శక్తులను ఒడ్డుతోంది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోరు ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.