దేశ సమగ్రత దెబ్బతీసేందుకు న్యూస్‌క్లిక్ కు చైనా నిధులు!

చైనీస్ సంస్థలతో గల లింక్ గురించి దర్యాప్తు చేస్తున్న ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్ న్యూస్‌క్లిక్ “భారతదేశ ఐక్యత, ప్రాదేశిక సమగ్రతలను దెబ్బతీస్తుందని” ఢిల్లీ పోలీసులు ఆరోపిస్తున్నారు. న్యూస్‌క్లిక్‌పై ఢిల్లీ పోలీసులు శుక్రవారం దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ లో భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సర్వసత్తాకతను విచ్ఛిన్నం చేసేందుకు ఈ సంస్థ చైనా నిధులు పొందుతుందని తెలిపారు. 
 
ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ప్రకారం, ఈ పోర్టల్ కు చైనా నుండి పెద్ద మొత్తంలో డబ్బు వచ్చిందని, ఉద్దేశపూర్వకంగా పెయిడ్ వార్తలను చెలామణి చేశారని స్పష్టం చేశారు.  ఎఫ్‌ఐఆర్‌లో న్యూస్‌క్లిక్ వెబ్‌సైట్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ, దాని మానవ వనరుల అధిపతి అమిత్ చక్రవర్తి, అలాగే జర్నలిస్టులు, పౌర సమాజ కార్యకర్తల పేర్లు ఉన్నాయి. 
 
వారు “భారతదేశంపై అసంతృప్తిని కలిగించడానికి”, “ఐక్యత, సమగ్రతను బెదిరించేలా” ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.  ఉగ్రవాద నిరోధక చట్టం యూఏపీఏ కింద నమోదైన కేసులో పుర్కాయస్థ, చక్రవర్తిలను అరెస్ట్ చేశారు. “భారత సార్వభౌమత్వానికి విఘాతం కలిగించి, భారత్‌పై అసంతృప్తిని కలిగించే ఈ కుట్రను కొనసాగించేందుకు, చైనా నుండి పెద్ద మొత్తంలో నిధులు మభ్యపెట్టి, ఉద్దేశపూర్వకంగా పెయిడ్ న్యూస్‌ను గుప్పించి, దేశీయ విధానాలను, భారతదేశ అభివృద్ధి ప్రాజెక్టులను విమర్శిస్తూ ప్రచారం చేశారు” అని ఎఫ్ఐఆర్ తెలిపింది. 
 
అందుకోసం,  చైనా ప్రభుత్వ విధానాలు,  కార్యక్రమాలకు ప్రచారం కావించడం, సమర్థించడం చేశారని వెల్లడించింది.  కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనాకు చెందిన ప్రచార విభాగానికి చెందిన క్రియాశీల సభ్యుడు, అమెరికన్ మిలియనీర్  నెవిల్లే రాయ్ సింఘమ్ నుండి “విదేశీ నిధులు”ను మోసపూరితంగా పొందారని ఎఫ్ఐఆర్ పేర్కొంది.
 
అందుకోసమే సింఘమ్ కు చెందిన వరల్డ్‌వైడ్ మీడియా హోల్డింగ్ ఎల్ ఎల్ సి  న్యూస్‌క్లిక్ లో 7.69 శాతం వాటాల వాటాదారుగా మారగా, పుర్కాయస్థ మిగిలిన 91.38 శాతం వాటాలను కలిగి ఉన్నట్లు పుర్కాయస్తా అరెస్టు తర్వాత పోలీసు అధికారులు మీడియాకు తెలిపారు. వార్తా వెబ్‌సైట్‌ను నడపడానికి, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా వచ్చిన నిధులను దాచిపెట్టి కార్యకలాపాలకు నిధులు సమకూర్చడానికి పుర్కాయస్థ లోతయిన ఆలోచనలతో వ్యవహరించినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది.
 
ఎఫ్ఐఆర్ ప్రకారం,  చైనాకు చెందిన టెలికం దిగ్గజ సంస్థలు క్సియోమి, వివో వంటివి పలు షెల్ కంపెనీలను పిఎంఎల్‌ఎ, ఫెమాల ఉల్లంఘిస్తూ తీసుకువచ్చాయని, కుట్రలో భాగంగానే భారతదేశంలోకి ఈ నిధులను చేరవేస్తున్నాయని వివరించారు. ఇందుకు న్యూస్‌క్లిక్‌ను వాడుకున్నారని పోలీసులు పేర్కొన్నారు.
 
2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసేందుకు పుర్కాయస్థ పీపుల్స్ అలయన్స్ ఫర్ డెమోక్రసీ అండ్ సెక్యులరిజం (పాడ్స్) అనే గ్రూప్ తో కలిసి కుట్ర పన్నారని ఢిల్లీ పోలీసులు ఆరోపించారు.
 
ఇదిలా ఉండగా, పుర్కాయస్థ, చక్రవర్తి అరెస్ట్‌లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు శుక్రవారం అంగీకరించింది. వీరిద్దరికీ ఎఫ్‌ఐఆర్ కాపీని అందజేయాలని గురువారం ట్రయల్ కోర్టు ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. ఈ నెల 9వ తేదీన ఈ కేసును మొదటి కేసుగా న్యాయస్థానం విచారిస్తుంది.
 
ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు మంగళవారం ఢిల్లీలోని 80కి పైగా ప్రాంతాల్లో దాడులు చేశారు. మంగళవారం మొత్తం 46 మంది జర్నలిస్టులు, న్యూస్‌క్లిక్‌కు సహకరించిన వారిని విచారించగా వారి మొబైల్ ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 11 వరకూ వీరికి పోలీసు కస్టడీ విధించారు. ఇప్పటికే విచారణలో భాగంగా న్యూస్‌క్లిక్ కార్యాలయానికి సీల్ వేశారు