100 పతకాలతో ఆసియా క్రీడల్లో భారత్‌ సరికొత్త చరిత్ర

ఆసియా క్రీడల్లో భారత్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది. పతకాల పట్టికలో తొలిసారిగా వంద మార్కును అందుకున్నది. శనివారం ఉదయం ఆర్చరీలో రెండు స్వర్ణాలు సహా నాలుగు పతకాలు, మహిళల కబడ్డీలో గోల్డ్‌ మెడల్‌ లభించడంతో ఈ ఘనత సాధించింది.  దీంతో 25 స్వర్ణాలు, 35 రజతాలు, 40 కాంస్యాలతో పతకాల పట్టికలో టీమ్‌ఇండియా ప్రస్తుతం నాలుగో స్థానంలో కొనసాగుతున్నది.

ఐదేండ్ల క్రితం జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో భారత్‌ 70 పతకాలు సాధించగా.. ఈ సారి వంద మెడల్స్‌ సాధించాలనే లక్ష్యంతో హాంగ్జౌ చేరిన భారత్‌.. ఇప్పుడా సంఖ్యను దాటి ముందుకు సాగుతోంది. సెప్టెంబర్‌ 24న ప్రారంభమైన ఈ ఆసియా క్రీడల్లో భారత్‌ ఆది నుంచి గతం కంటే మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. తొలి రోజు నుంచి భారత పతకాల జోరు కొనసాగుతున్నది.

మహిళల కబడ్డీ ఫైనల్‌లో భారత్‌ 26-25తో చైనీస్‌ తైపీని మట్టికరిపించింది. దీంతో టీమ్‌ఇండియా స్వర్ణం చేజిక్కించుకుంది. అంతకుముందు ఆర్చరీలో ఇండియాకు నాలుగు పతకాలు లభించాయి. ఆర్చరీ మహిళల కాంపౌండ్‌ సింగిల్స్‌లో జ్యోతి సురేఖ స్వర్ణం సాధించగా, అదితి గోపీచంద్‌ కాంస్యం గెలుపొందింది. ఇక ఆర్చరీ పురుషుల కాంపౌండ్‌ సింగిల్స్‌లో ఓజాస్‌ ప్రవీణ్‌ డియోటలేకు  స్వర్ణం లభించగా, అభిషేక్‌ వర్మ సిల్వర్‌ సొంతం చేసుకున్నాడు.

ఆసియా క్రీడల్లో ఓజాస్‌కు ఇది మూడో బంగారు పతకం కావడం విశేషం. పతకాల పట్టికలో 354 మెడల్స్‌తో చైనా అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. ఇందులో 187 స్వర్ణాలు, 104 రజతం, 63 కాంస్యాలు ఉన్నాయి. 169 మెడల్స్‌తో జపాన్‌ (47 గోల్డ్‌, 57 సిల్వర్‌, 65 బ్రోన్జ్‌), 171 పతకాలతో కొరియా (36 స్వర్ణం‌, 50 రజతం‌, 85 కాంస్యం‌), 100 మెడల్స్‌తో భారత్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఇక శుక్రవారం పోటీల్లో అనధికారిక జాతీయ క్రీడ హాకీలో పురుషుల జట్టు దుమ్మురేపింది. ఫైనల్లో హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ సారథ్యంలోని భారత్‌ 5-1తో డిఫెండింగ్‌ చాంపియన్‌ జపాన్‌ను మట్టికరిపించింది. హర్మన్‌ప్రీత్‌ (32వ, 59వ నిమిషాల్లో) డబుల్‌ గోల్స్‌తో మెరిస్తే.. అమిత్‌ రొహిదాస్‌ (36వ ని.), మన్‌ప్రీత్‌ సింగ్‌ (25వ ని.), అభిషేక్‌ (48వ ని.) ఒక్కో గోల్‌ చేశారు. 

జపాన్‌పై ఏకపక్ష విజయంతో పసిడి పతకంతో పాటు భారత జట్టు వచ్చే ఏడాది పారిస్‌ వేదికగా జరుగనున్న ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించింది. బ్రిడ్జ్‌ ఈవెంట్‌లో భారత పురుషుల జట్టు రజతం కైవసం చేసుకుంది. మరోవైపు పురుషుల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో 41 ఏండ్ల తర్వాత భారత షట్లర్‌కు ఆసియా క్రీడల్లో పతకం దక్కింది. హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ కంచుమోత మోగించాడు. 

మరోవైపు పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి జంట ఫైనల్‌కు చేరి చరిత్ర సృష్టించింది. కబడ్డీలో భారత పురుషుల, మహిళల జట్లు ఫైనల్‌కు చేరాయి. సెపక్‌తక్రాలో భారత్‌కు చారిత్రక కాంస్యం లభించింది. ఆర్చరీలో రికర్వ్‌ టీమ్‌ విభాగాల్లో భారత్‌కు రెండు పతకాలు దక్కాయి. రెజ్లింగ్‌లో అమన్‌ షెరావత్‌ కాంస్యం గెలుచుకున్నాడు.

మహిళల 65 కేజీల ఫ్రీ స్టైల్‌ విభాగం కాంస్య పతక పోరులో భారత రెజ్లర్‌ సోనమ్‌ మాలిక్‌ చైనా రెజ్లర్‌ లాంగ్‌ జియాను ఓడించి పతకం దక్కించుకుంది. ఈ పోరులో సోనమ్‌ 7-5 తేడాతో చైనా రెజ్లర్‌ను మట్టి కరిపించింది.
భారత క్రీడాకారులపై మోదీ ప్రశంసలు
భారత క్రీడాకారులను అభినందించిన ప్రధాని నరేంద్ర మోదీ  వారి ప్రదర్శన విస్మయం కలిగించిందని చెప్పారు. 10వ తేదీన భారత్‌కు 100 పతకాలు అందించిన క్రీడాకారులను కలవడానికి ఎదురుచూస్తున్నానని తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ తన ఎక్స్(ట్విట్టర్) ఖాతా వేదికగా ఓ ట్వీట్ చేశారు.
‘‘ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇది అద్భుత విజయం. మనం 100 పతకాల మైలురాయిని చేరుకున్నందుకు భారత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారతదేశానికి ఈ చారిత్రాత్మక మైలురాయికి కారణమైన మన అసాధారణ క్రీడాకారులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. విస్మయం కలిగించే వారి ప్రదర్శన చరిత్ర సృష్టించింది. మన హృదయాలను గర్వంతో నింపింది. నేను 10వ తేదీన మన ఆసియా క్రీడల బృందానికి ఆతిథ్యం ఇవ్వడానికి, వారితో సంభాషించడానికి ఎదురుచూస్తున్నాను.’’ అని తెలిపారు.