ఇజ్రాయిల్ పై విరుచుకుప‌డ్డ పాల‌స్తీనా మిలిటెంట్లు

 
* అయిదు వేల రాకెట్ల‌తో దాడి… 50 మంది మృతి
 
ఇజ్రాయెల్​- గాజా మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. గాజా స్ట్రిప్​ నుంచి హమాస్​ మిలిటెంట్లు.. ఇజ్రాయెల్​పై రాకెట్లతో విరుచుకుపడుతుండగా ఇజ్రాయెల్​ దళాలు ప్రతిఘటిస్తున్నాయి. వివాదాస్పద గాజా స్ట్రిప్‌ ప్రాంతంలో ఉన్న పాలస్తీనా మిలిటెంట్లు శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్‌పై రాకెట్ల వర్షం కురిపించారు. 
 
జెరూసలెం, టెల్ అవివ్‌ సహా దేశవ్యాప్తంగా ఎయిర్‌ రైడ్‌ సైరన్ల మోత మోగింది. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే వేలాది రాకెట్లను ప్రయోగించారు. దీంతో పలు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. ఈ దాడుల‌లో 50 మందికి పైగా పౌరులు మ‌రణించార‌ని, 100 మందికి పైగా గాయ‌ప‌డ్డార‌ని ఇజ్రాయేల్ అధికారులు ప్ర‌క‌టించారు.
 
అలాగే ఆ తర్వాత కాసేపటికే పాలస్తీనా మిలిటెంట్లు తమ భూభాగాల్లోకి చొచ్చుకొచ్చినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం వెల్లడించింది. సరిహద్దుల్లోని ప్రజలంతా ఇళ్లల్లోని ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని హెచ్చరించింది. ఈ దాడుల‌తో అప్రమత్తమైన ఇజ్రాయెల్‌ సైన్యం ప్రతిదాడికి దిగింది.  అప‌రేష‌న్ క‌మాండో చేప‌ట్టింది. హ‌మాస్ మిలిటెంట్ల‌ను ఏరి వేసే కార్య‌క్ర‌మాన్ని భారీగా చేప‌ట్టింది ఇజ్రాయేల్ సైన్యం.
గాజా స్ట్రిప్‌లోని హమాస్‌ స్థావరాలపై ప్రతిదాడులు చేపట్టింది. మిలిటెంట్లు ప్రయోగించిన రాకెట్లను కూల్చేందుకు యాంటీ రాకెట్‌ డిఫెన్స్‌ వ్యవస్థను యాక్టివేట్‌ చేసింది. దీంతో పేలుడు శబ్దాలు భారీగా వినిపిస్తున్నాయి. తాము యుద్ధానికి సిద్ధగా ఉన్నామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఇజ్రాయెల్‌పై మిలిటరీ ఆపరేషన్‌ను ప్రారంభించామని హమాస్‌ మిలిటరీ వింగ్‌ హెడ్‌ మొహమ్మద్‌ డెయిఫ్‌ ప్రకటించాడు.
ఈ తెల్లవారుజామునే ‘ఆపరేషన్‌ ఆల్‌-అక్సా స్ట్రామ్‌’ ప్రారంభమైందని, ఇప్పటివరకు 5వేల రాకెట్లను ప్రయోగించామని డెయిఫ్‌ చెప్పినట్లు ఓ వీడియో సందేశం బయటికొచ్చింది. ఇందులో భాగంగా తొలి 20 నిమిషాల్లో 5,000 క్షిపణులు, షెల్స్‌ను ఇజ్రాయిల్‌పైకి ప్రయోగించినట్లు వెల్లడించారు.

డెయిఫ్‌పై గతంలో అనేకసార్లు దాడులు జరిగాయి. దీంతో కొంతకాలంగా బయటి ప్రపంచానికి దూరంగా ఉంటున్న అతడు ఇప్పుడిలా వీడియో విడుదల చేయడం యుద్ధ తీవ్రతను అద్దం పడుతోంది. గాజా స్ట్రిప్‌లో స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్‌ ఆర్మీ వాహనాలు, పారాచ్యూట్లతో హమాస్‌ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ భూభాగంలోకి చొచ్చుకొచ్చారు. సరిహద్దుల్లోని ఓ పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి దాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు.

అటు ఇజ్రాయెల్ సైన్యం, హమాస్‌ మిలిటెంట్ల మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో పలువురు సామాన్య పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మృతుల సంఖ్య భారీగానే ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. సరిహద్దుపై ఇజ్రాయెల్‌ సైన్యం నియంత్రణ కోల్పోయినట్లు సమాచారం.

హమాస్​ బృందం పక్కా ప్లాన్​తో ఇజ్రాయెల్​పై దాడి చేస్తున్నట్టు కనిపిస్తోంది. దీనికి ఆపరేషన్​ అల్​-అఖ్స ఫ్లడ్​ అన్న పేరు పెట్టింది ఆ బృందం. 5వేలకు పైగా రాకెట్లను లాంచ్​ చేసినట్టు ప్రకటించింది. “ఇజ్రాయెల్​ అరాచకాలకు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాము. పాలస్తీనావాసులు ఎక్కడున్నా సరే.. బయటకు వచ్చి పోరాడండి,” అని హమాస్​ బృందం వెల్లడించింది.

పాల‌స్తీనాలోని హ‌మాస్ ఉగ్ర‌వాదులు చేప‌ట్టిన అల్ అక్సా ఆప‌రేష‌న్‌కు ప్రతీక‌రంగా.. ఇజ్రాయిల్ ద‌ళాలు కూడా స్పెష‌ల్ ఆప‌రేష‌న్ చేప‌ట్టాయి. ఆ ఆప‌రేష‌న్‌కు ఐర‌న్ స్వార్డ్స్ అని పేరు పెట్టారు. 1967 అరబ్‌-ఇజ్రాయెల్‌ యుద్ధంలో తూర్పు జెరూసలెం, గాజా ప్రాంతాలను ఇజ్రాయెల్‌ సైన్యం స్వాధీనం చేసుకుంది. స్వతంత్ర పాలస్తీనాలో ఆ రెండు ప్రాంతాలూ అంతర్భాగాలు కావాలనే డిమాండ్‌తో పాలస్తీనా తిరుగుబాటు చేస్తోంది.

భారతీయులు అప్రమత్తంగా ఉండాలని సూచన

ఇజ్రాయిల్‌పై హమాస్ దాడి నేపథ్యంలో భారత్‌ అప్రమత్తమైంది. ఇజ్రాయిల్‌లోని భారత పౌరుల భద్రత కోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పలు సూచనలు జారీ చేసింది. భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, భద్రతా ప్రోటోకాల్స్‌ను పాటించాలని తెలిపింది. ఇజ్రాయిల్‌లోని భారత రాయబార కార్యాలయం ఈ మేరకు ఒక నోటీస్‌ జారీ చేసింది.
 
 ‘ఇజ్రాయిల్‌లో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆ దేశంలోని భారతీయ పౌరులందరూ అప్రమత్తంగా ఉండాలి. స్థానిక అధికారుల సలహా మేరకు భద్రతా ప్రోటోకాల్స్‌ను పాటించాలి. దయచేసి జాగ్రత్తగా ఉండండి. అనవసర కదలికలు నివారించండి. సెఫ్టీ షెల్టర్స్‌ వద్దకు వెళ్లండి. అదనపు సమాచారం కోసం ఇజ్రాయిల్ హోమ్ ఫ్రంట్ కమాండ్ వెబ్‌సైట్ లేదా వారి బ్రోచర్‌ను చూడండి’ అని పేర్కొంది. 
 
అలాగే అత్యవసర పరిస్థితుల్లో ఇండియన్‌ ఎంబసీ హెల్ప్‌లైన్ నంబర్ +97235226748 లేదా cons1.telaviv@mea.gov.in ఇమెయిల్‌ ద్వారా సంప్రదించాలని ఇజ్రాయిల్‌లోని భారతీయ పౌరులను కోరింది. ఎలాంటి సహాయమైనా అందించేందుకు ఎంబసీ సిబ్బంది సిద్ధంగా ఉన్నారని పేర్కొంది.