డ్రగ్స్ కేసులో హీరో నవదీప్‌కు ఈడీ నోటీసులు!

డ్రగ్ కేసులో నవదీప్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 10న విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇచ్చింది. ఇటీవలే వెలుగు చూసిన మాదాపూర్ డ్రగ్స్‌ కేసులో నవదీప్‌ పేరును ప్రధానంగా ప్రస్తావించింది నార్కోటిక్‌ బ్యూరో. కేసు నమోదు చేయటంతో పాటు ఆయన్ను సుదీర్ఘంగా విచారించింది. 
నార్కోటిక్‌ బ్యూరో కేసు ఆధారంగా ఈడీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. 
2017లో సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నవదీప్ పేరు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పలువురు సినీ హీరోలతో పాటు హీరోయిన్లను విచారించింది ఈడీ. ఈ కేసులో నవదీప్ కు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది.  అయితే విచారణకు నవదీప్ హాజరుకాలేదు. తాజాగా మాదాపూర్ డ్రగ్స్ తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఈ నోటీసులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో హీరో నవదీప్‌ ఇంట్లో తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు ఇటీవల సోదాలు నిర్వహించారు.  ఆగస్టు 31న మాదాపూర్‌ ఫ్రెష్‌ లివింగ్‌ అపార్ట్‌మెంట్స్‌లోని ఓ ఫ్లాట్‌లో డ్రగ్‌ పార్టీ జరిగింది. సోదాలు నిర్వహించిన నార్కోటిక్ బ్యూరో పోలీసులు పలువురు నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసులో పట్టుబడిన రామ్‌చంద్‌ అనే నిందితుడి విచారణతో హీరో నవదీప్‌ పేరు తెరపైకి వచ్చింది. నవదీప్‌ సైతం తనతో కలిసి డ్రగ్స్ తీసుకున్నట్లు రామ్‌చంద్‌ తన వాంగ్మూలంలో వెల్లడించాడు.
 
దీంతో ఈ కేసులో నవదీప్‌ను 37వ నిందితుడిగా ప్రకటించారు.  డ్రగ్స్‌ వినియోగదారుల జాబితాలో తనను అన్యాయంగా ఇరికించారంటూనవదీప్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ఇటీవల కొట్టివేసింది. నవదీప్ బెయిల్ రద్దు చేయాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు విచారించింది. 
ఈ కేసులోని నిందితులతో నవదీప్ కు సంబంధాలు ఉన్నాయని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. 
 
ఇరువైపుల వాదనలు విన్న కోర్టు 41 ఏ కింద నోటీసులు ఇచ్చి నవదీప్ ను విచారించాలని ఆదేశించింది. దీంతో ఆయన సెప్టెంబర్ 23వ తేదీన సైఫాబాద్ లోని నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ కార్యాలయానికి వచ్చారు. 6 గంటలకు పైగా పోలీసులు నవదీప్ ను విచారించారు.