చెంప దెబ్బ కొట్టిన హోంమంత్రిపై కేసు నమోదు చేయాలి

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకల సందర్భంగా హోం మంత్రి మహమ్మద్ అలీ తన భద్రత సిబ్బంది పై చేయి చేసుకున్న ఘటనపై బిజేపి ఎంపీ ధర్మపురి అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకులు అధికార అహంకారంతో విర్రవీగుతున్నారని మండిపడ్డారు. రక్షణ కల్పించే భద్రత సిబ్బంది పై హోంమంత్రి మహమ్మద్ అలీ చేయి చేసుకోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. 
 
ఇది వారి అహంకారానికి నిదర్శనమని పేర్కొంటూ మహమ్మద్ అలీ భద్రత సిబ్బంది పై చేయి చేసుకుంటున్న వీడియోను చూపిస్తూ తక్షణమే ఆయన హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన పై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు.

అధికార అహంతో తన సొంతభద్రత సిబ్బంది చెంపపై కొట్టిన మహమ్మద్ అలీ పై తక్షణమే డీజీపీ కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కాగా అటు రాష్ట్ర బీజేపీ నాయకత్వం, శ్రేణులు సైతం ఈ ఘటనపై సామాజిక మాద్యమాల్లో స్పందిస్తూ హోమ్ మంత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు ఇదే ఘటనపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా స్పందించారు. తెలంగాణ అనే రాష్ట్రం కేవలం ఒక్క కేసీఆర్, అతని అవినీతి కుటుంబం కోసమే ఏర్పడలేదని అంటూ మండిపడ్డారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అనేక సంవత్సరాల పాటు పోరాటం జరిగిందని చెబుతూ 1997లోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర వాదానికి బిజెపి మద్దతునిచ్చినట్లు ఆయన తెలిపారు. 

ప్రజలు కాంగ్రెస్ పార్టీ కి 60 ఏళ్లు అవకాశం ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం లో విఫలం అయిందని చెప్పారు. అందుకే 2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. తెలంగాణ పై చిత్తశుద్ది ,ప్రేమ ఉన్న నాయకుడు నరేంద్ర మోదీ అని ,తెలంగాణ పై చిత్తశుద్ది ఉన్న పార్టీ బీజేపీనేనీ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ , కాంగ్రెస్ ఈ రెండు కుటుంబ పార్టీలను ఓటుతో ఓడించాల్సిన సమయం అసన్నమైందని పిలుపిచ్చారు.