10 వ‌ర‌కూ ఈడీ క‌స్ట‌డీకి ఆప్ ఎంపీ సంజ‌య్ సింగ్‌

* కింగ్‌పిన్ కూడా జైలుకు వెళ్తారు

ఢిల్లీ లిక్క‌ర్ పాలసీ కేసులో బుధ‌వారం అరెస్ట్ అయిన‌ ఆప్ నేత‌, రాజ్య‌స‌భ ఎంపీ సంజ‌య్ సింగ్‌ను  అక్టోబ‌ర్ 10 వ‌ర‌కూ ఈడీ క‌స్ట‌డీకి త‌ర‌లించారు. గ‌త ఏడాదిగా ప‌లువురు ఆప్ నేత‌ల‌ను ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా, మంత్రి స‌త్యేంద‌ర్ జైన్‌ల‌ను ఇప్ప‌టికే ఈడీ వేర్వేరు కేసుల్లో ద‌ర్యాప్తు సంస్ధ అరెస్ట్‌ చేసింది.
 
సంజయ్ సింగ్‌ను విచారించేందుకు వీలుగా ఢిల్లీ కోర్టు గురువారం ఈడీకి ఐదు రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. సంజయ్‌సింగ్‌ను ఈడీ బుధవారం అరెస్టు చేసింది. ఉదయం నుంచి సంజయ్‌సింగ్‌ నివాసంలో సోదాలు జరిపిన తర్వాత ఈడీ ఆయనను మనీలాండరింగ్‌ చట్టం కింద అదుపులోకి తీసుకుంది. 
 
ఢిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేంద్రజైన్‌, ఉపముఖ్యమంత్రి సిసోడియాల అరెస్టుల తర్వాత జరిగిన మూడో పెద్ద అరెస్టుగా దీనిని భావిస్తున్నారు. మద్యం కుంభకోణంలో అప్రూవర్‌గా మారిన వ్యాపారి దినేశ్‌ అరోరా ఇచ్చిన సమాచారం మేరకే సంజయ్‌సింగ్‌ అరెస్టు జరిగినట్లు తెలుస్తోంది. ఈ కేసులో జైలుపాలైన అరోరా ఇటీవలే విడుదలయ్యారు. 
 
సంజయ్‌సింగ్‌ ద్వారానే తాను అప్పటి ఎక్సైజ్‌శాఖ మంత్రి సిసోడియాను కలుసుకున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా త‌న అరెస్ట్‌కు ముందు ఆప్ ఎంపీ సంజయ్‌ సింగ్‌ ఒక వీడియో సందేశాన్ని రికార్డు చేశారు. అవినీతికి వ్యతిరేకంగా తన పోరాటం కొనసాగుతుందని అందులో పేర్కొన్నారు. చావనైనా చస్తాను కానీ, తలొగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 
 
అదానీ స్కామ్‌లను తాను బహిర్గతం చేశానని, ఈడీకి ఫిర్యాదులు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మోదీకి ఓటమి తప్పదని, దాడులు, అరెస్టులు వంటి వాటి ద్వారా విజయం సాధించలేరని స్పష్టం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఈడీ తనను బలవంతంగా అరెస్టు చేస్తున్నదని ఆరోపించారు.
 
ఇలా ఉండగా, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ‘కింగ్ పిన్’ ప్రస్తుతం బయటే ఉన్నారని, త్వరలోనే ఆయన కూడా జైలుకు వెళ్తారని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఉద్దేశించి ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ నిజాయితీ సర్టిఫికెట్ ఇచ్చిన వారంతా ప్రస్తుతం జైలులోనే ఉన్నారని ఎద్దేవా చేశారు. 
 
ఎంపీ సంజయ్ సింగ్ అరెస్టయిన తర్వాత కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కేజ్రివాల్ సర్కార్‌పై విరుచుకుపడుతూ అవినీతికి వ్యతిరేకంగా తమ పార్టీ పోరాడుతుందని చెప్పిన ఆప్ స్వయంగా అవినీతి ఊబిలో కూరుకుపోయిందని విమర్శించారు. ఆప్ నేతల అరెస్టులను వ్యతిరేకిస్తూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీపై పలు ఆరోపణలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేజ్రివాల్ మాటల్ని విని ప్రజలు నవ్వుకుంటున్నారని ధ్వజమెత్తారు. 
 
కేజ్రీవాల్  కళ్లలో భయం కనిపిస్తోందని చెబుతూ. ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్నారని గుర్తు చేశారు. పంజాబ్ లో ఆప్ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో అవినీతి ఆరోపణలతో ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి పదవి నుంచి తొలగిపోయారని ఠాకూర్ ఎద్దేశా చేశారు. 
 మద్యం కుంభకోణం కేసులో తన ప్రమేయంపై కేజ్రివాల్ ఇప్పటివరకు వివరణ ఇవ్వలేదని కేంద్రమంత్రి నిలదీశారు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని చెబుతూ అక్రమార్కులను విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు.