2030 నాటికి 8 వేల కోట్ల ఎగుమతులు లక్ష్యంగా పసుపు బోర్డు

 
* కేంద్రం నోటిఫికేషన్ జారీ
 
తెలంగాణలోని నిజామాబాద్ పరిసర ప్రాంత రైతుల చిరకాల వాంఛను నెరవేరుస్తూ తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్రం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇటీవల మహబూబ్‌నగర్‌ సభలో ప్రధాని నరేంద్ర మోదీ బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించడం, ఆమేరకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేయడం, ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేయడం అన్ని చకచకా జరిగిపోయాయి.
 
అంతర్జాతీయ మార్కెట్‌లో పసుపు వినియోగంపై అవగాహన కల్పించడం, నూతన ఉత్పత్తుల అభివృద్ధి, మార్కెట్‌ పరిశోధనలు, ఎగుమతులకు మౌలిక సదుపాయాల కల్పన, సప్లై చైన్‌ నిర్వహణ, నాణ్యత, వైద్య రంగంలో పసుపు వాడకంపై పరిశోధనలను ప్రోత్సహించడం వంటివి బోర్డు నిర్వర్తిస్తుందని ఆ శాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది. 
 
ఉద్దేశాలకు అనుగుణంగా కేంద్ర ఆమోదానికి బోర్డు వార్షిక ప్రణాళికలు రూపొందించాల్సి ఉంటుందని, అవసరమైన మేరకు కేంద్రం నిధులు ఇస్తుందని వెల్లడించింది. బోర్డుపై పర్యవేక్షణ, నియంత్రణ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుందని తేల్చిచెప్పింది. ఆహారంగా, ఔషధంగా, సౌందర్య సాధనంగా ప్రపంచవ్యాప్తంగా విరివిగా వినియోగిస్తున్న పసుపు పంటను ప్రోత్సహించడం, దిగుబడిని పెంచి పసుపు రైతులకు మెరుగైన ధర అందించడం, పసుపు ఎగుమతులను పెంచడం లక్ష్యంగా ఈ బోర్డు పనిచేస్తుందని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.
ఇప్పటి వరకు సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసుల్లో భాగంగా ఉన్న ‘పసుపు’ కోసం ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేయడం వల్ల దేశంలో పసుపు సాగు చేసే రైతులతో పాటు పసుపుపై ఆధారపడ్డ అనేక రంగాలకు విస్తృత ప్రయోజనాలు అందుతాయని పేర్కొంది. ఈ బోరడు స్పైసెస్ బోర్డుతో పాటు ఇతర ప్రభుత్వ సంస్థలతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తుందని కేంద్రం వెల్లడించింది. అనారోగ్యానికి కారణమయ్యే బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్‌ల నుంచి ప్రభావవంతంగా రక్షణ కల్పించే సహజ గుణం ఉన్న ‘పసుపు’ ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఉంది. ఈ నేపథ్యంలో పసుపుపై అవగాహన పెంపొందించుకుంటూ వినియోగాన్ని మరింత పెంచడానికి ఈ బోర్డు దోహదపడే అవకాశం ఉంది. ఎగుమతులను వృద్ధి చేయడానికి అంతర్జాతీయంగా కొత్త మార్కెట్‌లను అన్వేషించడానికి, కొత్త ఉత్పత్తుల కోసం పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఈ పసుపు బోర్డు ఉపయోగపడుతుంది. పసుపు ఉత్పత్తిదారుల సామర్థ్యం పెంపుదల, నైపుణ్యాభివృద్ధిపై బోర్డు ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది. నాణ్యత, ఆహార భద్రతా ప్రమాణాలను ప్రోత్సహిస్తుంది.

బోర్డు కూర్పు ఎలా ఉంటుంది?

ఇక పసుపు బోర్డులో చైర్‌పర్సన్‌తో పాటు కేంద్ర వాణిజ్య, వ్యవసాయ, ఆయుష్‌, ఫార్మాస్యూటికల్స్‌ శాఖల ప్రతినిధులు, పసుపు పండించే రాష్ట్రా ల ప్రభుత్వ అధికారులు, సుగంధ ద్రవ్యాల బోర్డు కార్యదర్శి, కేరళ కొజికోడ్‌లోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ స్పైసిస్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌, గువాహటి నైపర్‌ డైరెక్టర్‌, నేషనల్‌ మెడిసినల్‌ ప్లాంట్‌ బోర్డు సీఈవో, వాణిజ్య శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. 

ముగ్గురు పసుపు రైతులు, ముగ్గురు ఎగుమతిదారులను సభ్యులుగా కేంద్రం నామినేట్‌ చేస్తుందని, చైర్‌పర్సన్‌ను కేంద్రమే నియమిస్తుందని, సభ్యుల కాలపరిమితి గరిష్టంగా మూడేళ్ల పాటు ఉంటుందని వెల్లడించారు.

పసుపు సాగులో, ఎగుమతిలో నెంబర్ 1

పసుపును ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద ఉత్పత్తిదారుగా, ఎగుమతిదారుగా ఉంది. 2022-23 సంవత్సరంలో 11.61 లక్షల టన్నుల (ప్రపంచ పసుపు ఉత్పత్తిలో 75% పైగా) ఉత్పత్తి భారత్‌లో జరిగింది. మొత్తం 3.24 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పసుపు సాగు జరిగింది. భారతదేశంలో 30 కంటే ఎక్కువ రకాల పసుపు దేశంలోని 20 రాష్ట్రాలలో పండిస్తున్నారు. పసుపును ఎక్కువగా మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు సాగు చేస్తున్నాయి.

ప్రపంచ వాణిజ్యంలో పసుపు విక్రయాల్లో భారతదేశం 62% కంటే ఎక్కువ వాటాను కలిగి ఉంది. 2022-23 సమయంలో 207.45 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన చేసే 1.534 లక్షల టన్నుల పసుపు, పసుపు ఉత్పత్తులను భారత్ ఎగుమతి చేసింది. 

బంగ్లాదేశ్, యూఏఈ, యూఎస్‌ఏ, మలేషియా దేశాలు భారత్ నుంచి పసుపును పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో 2030 నాటికి భారత్ నుంచి రూ. 8 వేల కోట్ల విలువైన పసుపును ఎగుమతి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఆ క్రమంలో ఈ బోర్డు ఏర్పాటు ఎంతో ఉపయోగపడుతుందని వెల్లడించింది.