కీలక వడ్డీ రేట్లు మరోసారి యథాతథం

అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక రేట్లను యథాతథంగా కొనసాగించింది. ఆర్‌బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్‌ నేతృత్వంలో పరపతి విధాన కమిటీ సమీక్ష నిర్ణయాలను శుక్రవారం ప్రకటించారు. రెపోరేటును 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్​ వెల్లడించారు.  వడ్డీ రేట్లను మార్చకుండా అలాగే కొనసాగించడం వరుసగా ఇది నాలుగోసారి.
ఎంఎస్‌ఎఫ్‌, బ్యాంక్‌ రేట్‌ సైతం 6.75 శాతం వద్ద స్థిరంగా ఉన్నాయి. గత ఎంపీసీ సమావేశం జరిగిన ఆగస్టుతో పోలిస్తే ఈసారి ద్రవ్యోల్బణం పెరిగిందని శక్తికాంత దాస్ తెలిపారు  ద్రవ్యోల్బణాన్ని గమనిస్తూనే, దాన్ని లక్ష్యిత పరిధిలోకి తీసుకొచ్చేందుకు ఆర్‌బీఐ కట్టుబడి ఉందని గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. కీలకమైన రెపో రేటును 6.5 శాతం వద్దే యథాతథంగా కొనసాగిస్తున్నామని తెలిపారు. అలాగే ఎంఎస్ఎఫ్, బ్యాంక్ రేటు సైతం 6.75 శాతం వద్ద స్థిరంగా కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.
రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఊతమివ్వాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. అందులో భాగంగానే మరోసారి కీలక రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదని స్పష్టం చేశారు. ‘సర్దుబాటు వైఖరి ఉపసంహరణను కొనసాగించాలని ఎంపీసీ కమిటీ నిర్ణయించింది. ద్రవ్యోల్బణం తీరును నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు ఏర్పడుతున్న కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నెమ్మదించే అవకాశం లేకపోలేదు’ అని తెలిపారు. 
 
ద్రవ్యోల్భణం కట్టడికి ఎంపీసీ ఎప్పటికప్పుడు తగు చర్యలు చేపడుతోందని చెబుతూ ఈ నిర్ణయం గిరాకీ వృద్ధికి ఊతమిస్తుందని, గ్రామీణ ప్రాంతాల్లోనూ గిరాకీ పుంజుకుంటుందని చెప్పారు. దేశ ఖజానాలో 595.1 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉన్నాయి. ద్రవ్యోల్బణం 4 శాతం లోపు ఉండేలా చూడడంపైనే మానిటరీ పాలసీ దృష్టి సారించిందని తెలిపారు ఆర్‌బీఐ గవర్నర్ వివరించారు.

ఆగస్టు నెలలో జరిగిన గత ఎంపీసీ సమావేశంతో పోలిస్తే ఈసారి ద్రవ్యోల్బణం పెరిగింది. వృద్ధి బలంగానే ఉన్నప్పటికీ అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు నిర్ణయాలపరంగా దూకుడుగా వ్యవహరిస్తుండడం అంతర్జాతీయంగా కొన్ని అంశాలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్‌బీఐ కీలక రేట్లను స్థిరంగా ఉంచే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు గత కొంత కాలంగా అంచనా వేస్తూ వచ్చారు.
తాజాగా ఆర్‌బీఐ నిర్ణయాలు కూడా అందుకు అనుగుణంగానే ఉండడం గమనార్హం. వడ్డీ రేట్లను మార్చకుండా అలాగే కొనసాగించాలని ఎంపీసీ ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల వద్ద వివిధ రుణాలు తీసుకునే వారికి వడ్డీల భారం నుంచి ఉపశమనం లభించనుంది.
కాగా, సెప్టెంబర్‌లో ద్రవ్యోల్బణం దిగొచ్చే అవకాశం ఉందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అంచనా వేశారు. కూరగాయల ధరలు, వంట గ్యాస్ సిలిండర్ రేటు తగ్గిన నేపథ్యంలో స్వల్ప కాలంలో ద్రవ్యోల్బణం దిగొస్తుందన్నారు. 2023-24లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉండొచ్చని అంచనా వేశారు. మూడో త్రైమాసికంలో ఆహార పదార్థాల ధరల్లో స్థిరమైన తగ్గుదల నమోదయ్యే సూచనలు లేవని తెలిపారు.
ప్రస్తుతం 6.8 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం వచ్చే ఏడాదికి 5.2 శాతానికి తగ్గొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ ఆహార పదార్థాలు, ఇంధన ధరలు అకస్మాత్తుగా పెరిగితే పరిస్థితులను అదుపు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. మరోవైపు.. ఈ ఆర్థిక ఏడాది దేశ జీడీపీ వృద్ధి రేటు అంచనాలను ఆర్‌బీఐ 6.5 శాతంగా పేర్కొంది.