ఎన్డీఏలోనే ఉన్నా.. పవన్ స్పష్టం

తాను ఇంకా ఎన్డీఏలోనే ఉన్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తాను  ఎన్డీఏ నుంచి బయటకు వచ్చానని జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేస్తూ అదంతా తనపై వైసీపీ సాగిస్తున్న  దుష్ప్రచారం అని ఆరోపించారు. జనసేన పార్టీ ఎన్డీఏ కూటమి నుంచి బయటకు రాలేదని పవన్ వారాహి యాత్రలో తేల్చి చెప్పారు. 
 
తమ పార్టీ ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చేసిందని వైసీపీ నాయకులు దేశమంతా దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వస్తే తానే స్వయంగా ప్రకటిస్తానని, తన తరఫున వైసీపీ నాయకులు, సలహాదారులు కష్టపడనక్కర్లేదన్నారని అంటూ ధ్వజమెత్తారు. 
 తాను బయటకు రావాలంటే అందరికీ చెప్పే వస్తాను తప్ప దొంగచాటుగా ఏ పని చేయనని స్పష్టత ఇచ్చారు.
ప్రస్తుతం జనసేన పార్టీ ఎన్డీఏ కూటమిలోనే ఉందని పేర్కొంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోమంత్రి అమిత్ షా, బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షులు నడ్డాలంటే తనకు అపారమైన గౌరవం ఉందని పవన్ చెప్పుకొచ్చారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం బీజేపీ పెద్దలు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు ఈ సందర్భంగా విశ్వాసం వ్యక్తం చేశారు.
బీజేపీ ఆశీస్సులతో జనసేన – తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఉందని 2021 జనసేన పార్టీ ఆవిర్భావ సభలోనే చెప్పానని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అనేది జనసేన లక్ష్యమని, వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమని చెప్పానని ఆయన తెలిపారు. దానికి అనుగుణంగా కలిసివచ్చిన పార్టీలతో ముందుకు వెళ్తామని చెప్పారు. అధికార పార్టీల దాష్టీకం, దౌర్జన్యాలు పెరిగిపోయినప్పుడు అంతా సమష్టిగా కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పారు. 

1970 దశకంలో అత్యవసర సమయంలో ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అన్ని పార్టీలు కలిసి సమష్టిగా ఎదుర్కొన్నాయని గుర్తు చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో అలాంటి పరిస్థితులే నెలకొన్నాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వాన్ని కలిసి ఎదుర్కొకపోతే రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిపోతుందని హెచ్చరించారు.

2014లో దేశం కోసం ఆలోచించే మోదీకి, రాష్ట్ర క్షేమం కోసం అనుభవం ఉన్న చంద్రబాబుకు సంపూర్ణంగా మద్దతు తెలిపానని, అన్నిటికీ తెగించే అప్పట్లో మద్దతు ఇచ్చానని చెప్పారు. ఆ రోజుల్లో ఆ రెండు పార్టీలు గెలవకపోయి ఉంటే జనసేన పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రాజకీయ ప్రస్థానం అప్పుడే మొదలు పెట్టిన పార్టీని మనుగడ సాగనిచ్చేవారా? ఓటమి అయినా, గెలుపు అయినా స్థిరంగా ప్రజల కోసం నిలిచే వ్యక్తినని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.  రాష్ట్రంలో రెండు పార్టీలకు ఏ మాత్రం బలం లేనపుడు తమను చూసి ఎందుకు భయపడుతున్నారని పవన్ ప్రశ్నించారు.

 తాము తీసుకునే నిర్ణయాలను, మాటలకు మీరెందుకు ఉలికిపడుతున్నారు” అంటూ నిలదీశారు. తమ రాజకీయ విధానపరమైన నిర్ణయాలను తాము తీసుకుంటామని చెబుతూ 175 సీట్లను గెలుస్తామని చెబుతున్న వైసీపీ నాయకులు తమ రెండు పార్టీల నిర్ణయాలు, విధానాలపై ఎందుకు కంగారు పడుతున్నారు? అంటూ ఎద్దేవా చేశారు.