ఎయిరిండియాలో మహిళలకు కావాల్సిన సీట్లు 

తమ విమానాల్లో ప్రయాణించే మహిళల కోసం ఎయిరిండియా ఒక వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టింది. ఒంటరిగా ప్రయాణించే మహిళలు, చిన్న పిల్లలు ఉన్న తల్లుల కోసం కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. వారు బుక్ చేసుకున్న సీటు ప్రయాణించడానికి సౌకర్యవంతంగా ఉండకపోతే ఆ స్థానంలో వేరే సీటు కేటాయించేందుకు అనుమతిని ఇచ్చింది.

దీనికి సంబంధించి ఆ విమానంలో ఉన్న ఎయిరిండియా సిబ్బంది అప్రమత్తతతో వ్యవహరించాలని సూచించింది. ఈ ప్రత్యామ్నాయ సీట్ల కేటాయింపుకు సంబంధించి అక్టోబర్ 3న జరిగిన ఎయిరిండియా అంతర్గత సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఎయిరిండియా అధికార ప్రతినిధి ఎలాంటి ప్రకటనలు చేయకపోయినా ఎయిర్‌లైన్స్ వర్గాలు బయటికి వెలువరించాయి.

ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా వారికి అన్ని ఏర్పాట్లు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. మహిళలు, చిన్న పిల్లల తల్లులు కోరితే కిటికీ పక్కన సీటుగానీ, లేక నడక మార్గం పక్కన సీటు గానీ కేటాయించాలని ఎయిరిండియా సిబ్బందికి సూచించింది. దీనికి సంబంధించి ఎయిరిండియా ఒక సర్క్యులర్‌ను విడుదల చేసింది.

ఒంటరిగా ప్రయాణించే మహిళలు, మధ్య సీట్లలో కూర్చున్న పిల్లలకు కూడా ఈ విధానాన్నే అమలు చేయాలని ఎయిరిండియా నిర్ణయించింది. అయితే ఇలా సీట్ల మార్పు, ప్రత్యామ్నాయ సీట్ల కేటాయింపు విషయంలో ఎయిరిండియా క్యాబిన్ క్రూ చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది.

మహిళలు, పురుషుల మధ్య ఎలాంటి వివాదాలు, ఘర్షణలు, అసభ్య కార్యకలాపాలు చోటు చేసుకోకుండా ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. ఒంటరిగా ప్రయాణించే మహిళలు తాము మధ్య సీట్లలో కూర్చోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని ఎయిరిండియాకు గత కొంత కాలంగా ఫిర్యాదులు వచ్చాయని, వాటిని పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.

అయితే ఈ నిర్ణయంపై కొందరు ఎయిరిండియా ఉద్యోగులతోపాటు ప్రయాణికులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతి విమానంలో కనీసం 10 శాతం మంది ఒంటరి మహిళా ప్రయాణికులు ప్రయాణిస్తారని, ఇలా సీట్లు మార్చడం అనేది సాధ్యం కాదని చెబుతున్నారు. అయినా అది అంత ప్రభావవంతంగా ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ఇక ఇలా విమానంలోకి ఎక్కిన తర్వాత సీట్లు మార్పిడీ చేయకుండా బుకింగ్ చేసుకునేటపుడే ఈ విధానాన్ని అనుసరిస్తే బాగుంటుందని ఏవియేషన్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.