వన్డే ప్రపంచకప్‌ తొలి పోరులో ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్‌ జయభేరి

పుష్కర కాలం తర్వాత భారత్‌ ఆతిథ్యమిస్తున్న వన్డే ప్రపంచకప్‌లో గత ఫైనలిస్ట్‌ల మధ్య గురువారం జరిగిన తొలి పోరులో న్యూజిలాండ్‌ 9 వికెట్ల తేడాతో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌ను చిత్తుచేసింది. బజ్‌బాల్‌ ఆటతో ప్రత్యర్థులను బెంబేలెత్తించడమే పనిగా పెట్టుకున్న ఇంగ్లిష్‌ జట్టుకు కివీస్‌ ప్లేయర్లు గట్టి కౌంటర్‌ ఎటాక్‌ ఇచ్చారు. 
 
బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ కెప్టెన్‌ ఛేదనకు మొగ్గు చూపాడు. ఫలితంగా మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. మాజీ కెప్టెన్‌ జో రూట్‌ (77; 4 ఫోర్లు, ఒక సిక్సర్‌) హాఫ్‌ సెంచరీతో రాణించగా, కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ (43; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), బెయిర్‌స్టో (33; 4 ఫోర్లు, ఒక సిక్సర్‌) పర్వలేదనిపించారు. 
 
ఇంగ్లండ్‌ ప్లేయర్లంతా డబుల్‌ డిజిట్‌ స్కోరు చేసి రికార్డు నెలకొల్పినా మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. కివీస్‌ బౌలర్లలో మ్యాట్‌ హెన్రీ 3, ఫిలిప్స్‌, శాంట్నర్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో న్యూజిలాండ్‌ 36.2 ఓవర్లలో ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి 283 పరుగులు చేసింది. 
 
కాన్వే (121 బంతుల్లో 152 నాటౌట్‌; 19 ఫోర్లు, 3 సిక్సర్లు), రచిన్‌ రవీంద్ర (96 బంతుల్లో 123; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ శతకాలతో చెలరేగిపోయారు. బంతి ఎక్కడ పడ్డా దాని గమ్యస్థానం బౌండ్రీనే అన్నచందంగా ఈ జంట పరుగుల సునామీ సృష్టించడంతో మరో 82 బంతులు మిగిలుండగానే న్యూజిలాండ్‌ జయకేతనం ఎగరవేసింది. 
 
ఇంగ్లండ్‌ బౌలర్లో సామ్‌ కరన్‌ ఏకైక వికెట్‌ పడగొట్టగా, 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు వేసిన మార్క్‌ వుడ్‌ 5 ఓవర్లలో 55 పరుగులు సమర్పించుకున్నాడు. రచిన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.  2019 జూలై 24న జరిగిన వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ హోరాహోరీగా తలపడ్డాయి.
నిర్ణీత ఓవర్లలో ఇరుజట్లు 241 పరుగులే చేయగా.. విజేతను నిర్ణయించేందుకు నిర్వహించిన సూపర్‌ ఓవర్‌లోనూ స్కోర్లు సమమయ్యాయి. దీంతో మ్యాచ్‌లో ఎక్కువ బౌండ్రీలు కొట్టిన ఇంగ్లిష్‌ జట్టును విజేతగా ప్రకటించారు. అది మనసులో బలంగా ముద్రించుకున్న కివీస్‌ ప్లేయర్లు ఈసారి దెబ్బకు దెబ్బ కొట్టారు. ఇంగ్లండ్‌ ఆటగాళ్లు పరుగులు సాధించేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డ చోట కాన్వే, రచిన్‌ ఇద్దరే 38 బౌండ్రీలతో విజృంభించారు.