సెన్సార్‌ బోర్డుపై నటుడు విశాల్‌ ఆరోపణలతో సిబిఐ సోదాలు

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ (సీబీఎఫ్‌సీ)పై ప్రముఖ నటుడు ఆరోపణలు చేయడంతో సిబిఐ రంగంలోకి దిగి, విస్తృతంగా సోదాలు చేపట్టింది. తన చిత్రం కోసం లంచం ఇవ్వాల్సి వచ్చిందంటూ  ఇటీవల విశాల్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై ప్రైవేటు వ్యక్తులతో పాటు పలువురిపై సీబీఐ కేసు నమోదు చేసింది. 
విశాల్‌ నటించిన ‘మార్క్‌ ఆంటోనీ’ సినిమా హిందీలో సెన్సార్‌ సర్టిఫికెట్‌ పొందేందుకు రూ.6.5 లక్షలను అధికారులకు లంచంగా ఇవ్వాల్సి వచ్చిందని సెప్టెంబర్‌ 29న విశాల్‌ సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ చేశారు.
ఈ నేపథ్యంలో సీబీఐ రంగంలోకి దిగి ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసింది.  ముగ్గురు ప్రైవేటు వ్యక్తుల్లో మెర్లిన్ మేనగా, జీజా రామ్దాస్, రాజన్‌తో పాటు సెన్సార్‌ బోర్డుకు చెందిన పలువురి పేర్లను సైతం ఎఫ్‌ఐఆర్‌లో చేరినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అంతకు ముందు కేసుతో సంబంధం ఉన్న నిందితులకు చెందిన నివాసాలు, కార్యాలయాల్లో సీబీఐ అధికారులు దాడులు జరిపారు.

ముంబయితో పాటు నాలుగు చోట్లా సోదాలు నిర్వహించి, కేసు నమోదు చేశారు. విశాల్‌ హీరోగా నటించిన ‘మార్క్‌ ఆంటోనీ’ హిందీలో విడుదల చేసేందుకు సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇచ్చేందుకు బోర్డుకు చెందిన కొందరు అధికారులు రూ.7లక్షల డిమాండ్‌ చేశారని, బేరసారాల తర్వాత చివరికి రూ.6.54లక్షలకు ఒప్పందం కుదిరిందని సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి.

రూ.6.54లక్షలను రెండు వేర్వేరు ఖాతాల్లో చిత్రబృందం డిపాజిట్‌ చేసిందని, ఆ తర్వాత సెప్టెంబర్‌ 26న హిందీలో డబ్‌ చేసిన ‘మార్క్‌ ఆంటోనీ’ సినిమాకు ఎన్‌ఓసీ సర్టిఫికెట్‌ను సెన్సార్‌ బోర్డు జారీ చేసిందని సీబీఐ పేర్కొంది.  అయితే, నిందితుల్లో ఒకరు ఒప్పందం జరిగిన దానికి అదనంగా మరో రూ.20వేలను కో ఆర్డినేటర్‌ ఫీజు కింద తన బ్యాంకు అకౌంట్‌లో జమ చేయించుకున్నట్లు వివరించింది.

మూవీ బృందం డిపాజిట్‌ చేసిన డబ్బులన్నీ నిందితులు వెంటనే విత్‌డ్రా చేసినట్లు గుర్తించినట్లు సీబీఐ అధికారులు చెప్పారు.  విశాల్‌ ఆరోపణల నేపథ్యంలో ముంబయి సెన్సార్‌ బోర్డు అధికారులపై సీబీఐతో విచారణ జరిపించాలని ఇండియన్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేశాయి. అదే సమయంలో పలువురు పార్టీలకు చెందిన నేతలు సైతం విచారణ జరిపించాలని కోరడంతో సీబీఐ చర్యలకు ఉపక్రమించింది. 

ఇదిలా ఉండగా, ‘మార్క్‌ ఆంటోనీ’ సినిమా సెన్సార్‌ కోసం సీబీఎఫ్‌సీ అధికారులు రూ.6లక్షలు లంచం డిమాండ్‌ చేశారని, ముందుగా స్క్రీనింగ్‌ కోసం రూ.3లక్షలు చెల్లించాలని, ఆ తర్వాత సర్టిఫికెట్‌ కోసం రూ.3.5లక్షలు అవుతాయని చెప్పినట్లుగా విశాల్‌ సెప్టెంబర్‌ 29న సోషల్‌ మీడియా పోస్టులో పేర్కొన్నారు. 

లంచం వ్యవహారంపై బోర్డులోని ఓ అధికారి అడిగితే సెన్సార్‌ క్లియరెన్స్‌ కోసం నిర్మాతలు కచ్చితంగా డబ్బులు కట్టాల్సిందేనని ఆ మహిళా అధికారి తనతో అన్నారని విశాల్‌ పోస్టులో పేర్కొన్నారు.