ఎంపీ ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్

అటవీ శాఖ ను మినహాయించి మిగతా అన్ని రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్లను కల్పించాలని మధ్య ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నోటిఫికేషన్ ను గురువారం విడుదల చేసింది. 
 
ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35% రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా ‘‘మధ్య ప్రదేశ్ సివిల్ సర్వీసెస్ రూల్స్ 1997’’ కు ప్రభుత్వం అవసరమైన సవరణలను ప్రవేశపెట్టింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల ప్రకటించారు. 

పోలీసు విభాగంలోని నియామకాల్లో కూడా ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయని తెలిపారు. అలాగే, ఉపాధ్యాయ పోస్ట్ ల్లో 50% మహిళలకు కేటాయిస్తున్నామని వెల్లడించారు. మహిళలకు ప్రతీ నెల రూ. 1250 ఆర్థిక సహాయం అందించే లాడ్లీ బాహనా యోజన పథకాన్ని మధ్య ప్రదేశ్ ఇప్పటికే అమలు చేస్తోంది.లాడ్‌లీ బహనా పథకానికి ఏడాదికి రూ.19 వేల కోట్ల ఖర్చు అవుతుందని అంచనా.

దీనికితోడు విద్యార్థినులకు స్కూటీల కోసం ఆర్థిక సాయం చేస్తామని గత ఆగస్టులో సీఎం చౌహాన్‌ ప్రకటించారు. ఈ సంవత్సరం చివర్లో మధ్య ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. త్వరలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను ఎన్నికల సంఘం విడుదల చేస్తుంది.