న్యూస్‌క్లిక్‌ జర్నలిస్టుల ఇళ్లలో పోలీసుల సోదాలు

ఆన్ లైన్ న్యూస్ పోర్టల్ న్యూస్ క్లిక్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ న్యూస్‌ పోర్టల్‌కు చైనా నుంచి నిధులు అందుతున్నాయంటూ ఇటీవలే వచ్చిన ఆరోపణలు తీవ్ర రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  మంగళవారం ఉదయం ఢిల్లీ పోలీస్‌ స్పెషల్‌ సెల్‌ విభాగం అధికారులు స్థానికంగా ఉన్న న్యూస్‌క్లిక్‌ కార్యాలయంతోపాటు సంస్థలో పనిచేస్తున్న సీనియర్‌ జర్నలిస్టుల ఇళ్లలో సోదాలు చేపట్టారు.
ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్‌ సహా ఏకకాలంలో దాదాపు 30 ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టి పెద్ద ఎత్తున ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
స్టాండ్ అప్ కామిక్, రాజకీయ వ్యంగ్య విమర్శకుడు జంజయ్ రజౌర, జర్నలిస్టులు భాషా సింగ్, ప్రబిర్ పర్కాయస్త, అభిసర్ శర్మ, చరిత్రకారుడు, హక్కుల కార్యకర్త సహేల్ హష్మి, రచయిత గీతా హరిహరన్, సీనియర్ జర్నలిస్టులు పంంజోయ్ గుహ టకుర్త, ఊర్మిలేష్, ఓనింద్యో చక్రవర్తి నివాసాలపై పోలీసులు దాడులు చేశారు.
 
రెండేళ్ల క్రితం మీడియా పోర్టల్ న్యూస్‌క్లిక్‌కు విదేశాల నుంచి భారీగా నిధులు వచ్చినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణలో తేలింది. అమెరికన్ మిలియనీర్ నెవిల్లే రాయ్ సింఘమ్ తరపున న్యూస్‌క్లిక్‌కు చైనా నుంచి భారీగా నిధులు అందినట్లు తేలింది. నెవిల్లే చైనా కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధాలు కలిగి ఉన్నారని ఆరోపించారు. 
 
దీనిపై ‘ది న్యూయార్క్ టైమ్స్’ ఓ కథనం కూడా ప్రచురించింది. దీంతో ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. ఈ క్రమంలోనే న్యూస్‌క్లిక్‌ వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మనీలాండరింగ్ ఆరోపణలపై కేసు నమోదు చేసింది. 2021లో న్యూస్‌క్లిక్ కార్యాలయాలపైన, దాని వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్త నివాసంఐన ఇడి దాడులు చేసింది. 
 
సంస్థలోకి అక్రమంగా విదేశీ నిధులు పెట్టుబడులు పెట్టారని ఇడి ఆరోపిస్తోంది. పెయిడ్ న్యూస్‌కోసం నేరపూరిత కుట్ర జరిగిందని, అందుకోసమే విదేశీ నిధులు అక్రమంగా పొందారన్నది ఇడి చేస్తున్న ఆరోపణ. ప్రబీర్ పుర్కాయస్త ఎడిటర్ ఇన్ చీఫ్‌గా 2009లో న్యూస్‌క్లిక్ ఏర్పడింది. విదేశీ దాతల ప్రోద్బలంతో జాతి వ్యతిరేక వార్తలు ప్రచురించడానికి దీన్ని ఏర్పాటు చేశారంటూ ఇడి ఆరోపించింది.