భారత దేశ జీడీపీ 6.3 శాతం.. ప్రపంచ బ్యాంకు

అంతర్జాతీయ ప్రతికూల పరిణామాల నేపథ్యంలో 2023- 24 ఆర్థిక సంవత్సరానికిగానూ భారత దేశ జీడీపీ 6.3 శాతంగా ఉండబోతోందని ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది. ముఖ్యంగా ఇండియా సర్వీస్ సెక్టార్ గొప్ప ఫలితాలను సాధిస్తుందని, సేవల రంగం వృద్ధి రేటు 7.4 శాతంగా ఉండబోతోందని వెల్లడించింది. 

వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థల పనితీరును అంచనా వేస్తూ ఆయా ఆర్థిక సంవత్సరాల్లో ఆ దేశాల జీడీపీ ఎంత ఉండబోతోందో ప్రపంచ బ్యాంక్ ప్రతి ఏటా అంచనా వేస్తుంది. అందులో భాగంగానే ఈ ఆర్థిక సంవత్సరం భారత దేశ జీడీపీని అంచనా వేసింది. ఈ ఆర్థిక సంవత్సరం  భారత్ లో పెట్టుబడుల వృద్ధి రేటు కూడా 8.9% ఉంటుందని తెలిపింది. 

ఈ వివరాలతో ఇండియా డెవలప్ మెంట్ అప్ డేట్ ను మంగళవారం ప్రపంచ బ్యాంక్ వెలువరించింది. అంతర్జాతీయ ప్రతికూలతలను, దేశయ సవాళ్లను భారత్ ప్రశంసనీయంగా ఎదుర్కొంటోందని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. అంతర్జాతీయ, దేశీయ ప్రతికూలతల మధ్య కూడా 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిచిందని ప్రశంసించింది. 

ఆ సంవత్సర భారత దేశ వృద్ధి రేటు 7.2% గా ఉందని వెల్లడించింది. ఇది జీ 20 దేశాల్లో రెండో అత్యధిక వృద్ధి రేటు అని వెల్లడించింది. భారతీయ బ్యాంకులు కూడా తమ రుణ వితరణలో ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అత్యధికంగా 15. 8% వృద్ధిని నమోదు చేసిందని ప్రపంచ బ్యాంక్ తెలిపింది.  గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో బ్యాంకుల రుణవితరణ 13.3% గా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం భారత్ లో ద్రవ్యోల్బణం కూడా నియంత్రణలోనే ఉండబోతోందని తెలిపింది. భారత్ లో ఈ సంవత్సరం విదేశీ పెట్టుబడులు కూడా భారీగా పెరుగుతాయని వెల్లడించింది.