మహాగణపతి నిమజ్జనానికి ముస్తాబైన హైదరాబాద్

మహాగణపతి నిమజ్జనానికి హైదరాబాద్ నగరం ముస్తాబైంది. గణేశ్‌ శోభాయాత్రకు నగరం సిద్ధమయింది. వీధి వీధినా కొలువైన గణనాథులు ఒక్కొక్కటిగా గంగమ్మ ఒడికి చేరుతున్నాయి. హుస్సేన్‌సాగర్‌తో పాటు హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో గురువారం దాదాపు  100 చోట్ల నిమజ్జనాలు జరగనున్నాయి. 
ఇందుకోసం జీహెచ్‌ఎంసీ క్రేన్లు, జేసీబీలు, టిప్పర్లతోపాటు వేలాదిమంది సిబ్బందిని ఏర్పాటు చేసింది.  
గణేష్ నిమజ్జనం సందర్భంగా మహానగరంలో 3,600 సిసి కెమెరాలను అనుసంధానించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు.  గణేష్ నిమజ్జనానికి హుస్సేన్ సాగర్ చుట్టూ 5 చోట్ల 36 క్రేన్లు ఏర్పాటు చేశారు.  నిమజ్జనం సందర్భంగా ప్రమాదవశాత్తు ఎవరైనా నీళ్లలో పడిపోతే రక్షించేందుకు 200 మంది గజ ఈతగాళ్లను కూడా సిద్ధం చేసింది. అలాగే, శోభాయాత్ర జరిగే రహదారులపై వైద్య శిబిరాలు, 79 అగ్నిమాపక వాహనాలను అందుబాటులో ఉంచింది.
 
నిమజ్జనానికి తరలివచ్చే వారి కోసం జలమండలి 10 లక్షల నీళ్ల ప్యాకెట్లను సిద్ధం చేసింది. నిమజ్జనం రోజున ప్రజల సౌకర్యార్థం హుస్సేన్ సాగర్‌కు నగరం నలుమూలల నుంచి 535 బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది.  అలాగే 29 తెల్లవారుజాము వరకు ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. మెట్రో రైళ్లు కూడా రేపు అర్ధరాత్రి దాటాక 2 గంటల వరకు నడవనున్నాయి.
గణేశ్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ పరధిలో 40 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 25 వేల మందికి పైగా పోలీసులను మోహరించబోతున్నారు. గణేష్ నిమజ్జనం నేపథ్యంలో విగ్రహాలను తరలించే మార్గాలను నగర సీపీ సీవీ ఆనంద్ పరిశీలించారు. క్లిష్టమైన జంక్షన్లలో ఊరేగింపు కదలికలను పర్యవేక్షించాలని సూచించారు.
 
విగ్రహాల ఎత్తు పరిమితులను ధృవీకరించడం, తక్కువ ఎత్తులో ఉన్న వైర్లను గుర్తించి అడ్డంకులను పరిష్కరించడం మరియు ఊరేగింపుకు ఆటంకం కలిగించే అడ్డంకులను గుర్తించాలని అధికారులకు ఆదేశించారు.  మూడు ఆర్ఎఎఫ్ కంపెనీలు, ఇతర పారామిలిటరీ దళాలు ఇప్పటికే చేరుకున్నాయి. ఐదు డ్రోన్ బృందాలను రంగంలోకి దింపనున్నారు. 
 
ఇక దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించే హైదరాబాద్ లోని ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం కోసం ఏర్పాట్లు మొదలయ్యాయి. గురువారం ఉదయం ఆరు గంటలకే ఖైరతాబాద్‌ గణేశుడి శోభాయత్ర మొదలు కానుంది. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల సమయంలో నిమజ్జనం చేయనున్నట్లు భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి ప్రకటించింది.
 
 కాగా, 35 సంవత్సరాల తర్వాత మిలాద్ ఉన్ నబీ.. గణేశ్ నిమజ్జనం ఒకేసారి రావడంతో పోలీసు ఉన్నతాధికారులు ముందుజాగ్రత్త చర్యగా ముస్లిం మత పెద్దలతో మాట్లాడారు. మిలాద్ ఉన్ నబీ ర్యాలీని ఒకటో తేదీకి వాయిదా వేయించారు. కొందరు మాత్రం అదే రోజున జరపాలని పట్టుబడుతున్నారు. మహా గణపతులను గంగమ్మ చెంతకు చేర్చేందుకు 16 టైర్లతో కూడిన 250 టస్కర్లు, మరో 2 వేల ఇతర వాహనాలను రవాణాశాఖ సిద్ధం చేసింది. వీటిని నేటి సాయంత్రం 6 గంటల వరకు అందించనున్నారు.