సుప్రీంకోర్టులో ఊరట పొందలేని చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఆశించిన విధంగా బుధవారం ఊరట పొందలేకపోయారు. విచారణ అక్టోబర్ 3వ తేదీకి వాయిదా పడింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ కింద గవర్నర్ అనుమతి తీసుకోకుండా తనను అరెస్టు చేశారని చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 
 
స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు తనపై తప్పుడు కేసులు పెట్టారని వాటిని కొట్టివేయాలని ముందు హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో హైకోర్టు తీర్పును చంద్రబాబు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ కేసులో  చంద్రబాబు దాఖలు చేసిన ఎస్ఎల్పీ పిటిషన్‌ బుధవారం సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది.
 
అయితే ఈ బెంచ్‌లో తెలుగు న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ‌ఎన్‌ భట్టి కేసు విచారణకు విముఖత వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని చంద్రబాబు లాయర్ సిద్ధార్థ లూథ్రా సీజేఐ ధర్మాసనం ముందుకు తీసుకెళ్లి మరో ధర్మాసనం లేదా సీజేఐ ధర్మాసనం విచారించాలని ఆయన కోరారు. ఈ పిటిషన్ పై విచారణకు సీజేఐ అందుకు అంగీకరించి విచారణను మరో బెంచ్‌కు బదిలీ చేస్తామని సీజేఐ తెలిపారు. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేశారు.

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు 29కు వాయిదా

మరోవంక, అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో హైకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్ పై హైకోర్టులో బుధవారం వాదనలు కొనసాగాయి. మంగళవారం, చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వర్చువల్‌గా వాదనలు వినిపించగా, బుధవారం సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. 

అమరావతి రాజధానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌లో అక్రమాలు జరిగాయని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గత ఏడాది ఏప్రిల్‌ 27న ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబును ఏ1గా పేర్కొంది. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసులో తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 29కు వాయిదా వేసింది. ఇదే కేసులో ఏ14గా ఉన్న నారా లోకేశ్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.

కాగా, చంద్రబాబు బెయిల్‌, సీఐడీ కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో బుధవారం విచారణ జరిగింది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ప్రమోద్‌ దూబే, సీఐడీ తరఫున స్పెషల్‌ పీపీ వివేకానంద తమ వాదనలు వినిపించారు. ఈ కేసులో చంద్రబాబును మరో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను ఏసీబీ కోర్టు అక్టోబర్ 5కు వాయిదా వేసింది.