పెనుగొండ, లేపాక్షి లలో సౌండ్ అండ్ లైట్ షో 

శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండ చారిత్రక నగరంలో, శిల్పకళల కాణాచి లేపాక్షి లో ధ్వని, కాంతి (సౌండ్ అండ్ లైట్ షో) ప్రదర్శనను ఏర్పాటు చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం కార్యాచరణను ప్రారంభించాలని ప్రముఖ చరిత్రకారుడు, పర్యాటక రంగ నిపుణుడు మైనాస్వామి విజ్ఞప్తి చేశారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం ఆయన పెనుగొండ కోటతో పాటు పలు చారిత్రక కట్టడాలను సందర్శించారు. 
విజయనగర సామ్రాజ్య చారిత్రిక కట్టడాల వైభవానికి నిదర్శనగా నిలిచిన గగన్ మహల్ ముందు నిలబడి ఆయన పత్రికా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.  పెనుగొండ, లేపాక్షి లలో సౌండ్ అండ్ లైట్ షో ప్రదర్శనను ఏర్పాటు చేయడం ద్వారా ఆయా ప్రాంతాల చారిత్రక వైభవానికి మరింత ప్రచారం లభిస్తుందని, అదేవిధంగా పర్యాటకుల తాకిడి మరింతగా పెరుగుతుందని మైనాస్వామి అభిప్రాయపడ్డారు.
పర్యాటకుల సంఖ్య పెరిగే కొద్దీ పర్యాటక రంగంలో ఆయా ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు బాగా మెరుగుపడతాయని తెలిపారు.  పెనుగొండ, లేపాక్షి పరిసర ప్రాంతాల్లో లభించిన, లభిస్తున్న శిల్ప సంపదను భావి తరాలకు తెలియజెప్పడం కోసం జాతీయస్థాయిలో రెండు చోట్ల పురావస్తు ప్రదర్శనశాలలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు.
మ్యూజియం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని ఆయన అభిలాషించారు.  చారిత్రక ప్రదేశాల గొప్పదనాన్ని వివరిస్తూ లఘు చిత్రాలను నిర్మించి మ్యూజియంలో ప్రదర్శించాలని, అదేవిధంగా మ్యూజియంలో భాగంగా ఒక ఆడిటోరియంను నిర్మించాలని ఆయన కోరారు.