బెయిల్ కాకుండా క్వాష్ పిటీషన్ వైపే చంద్రబాబు మొగ్గు!

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయి, రిమాండ్ కు వెళ్లి మూడు వారాలు అవుతున్నా ఇంకా ఎప్పుడు బైటకు వస్తారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. అందుకు ప్రధాన కారణం అరెస్ట్ కాగానే బెయిల్ కోసం కాకుండా, అసలు కేసు కొట్టివేయాలంటూ వాదనలు చేస్తుండటంతోనే ఈ జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది.
 
ఈ కేసులో 37వ నిందితుడు కావడంతో బెయిల్ కోరుకొంటే తొందరలోనే వచ్చి ఉండేదని, కానీ  క్వాష్ పిటిషన్ పై పట్టుబడుతూ ఉండడంతో కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తున్నదని న్యాయనిపుణులు భావిస్తున్నారు. చివరకు బుధవారం సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్హ్టి చంద్రచూడ్ సహితం `అసలు మీకేమి కావలి?’ అంటూ నేరుగా ప్రశ్నించినా చంద్రబాబు న్యాయవాది సూటిగా సమాధానం చెప్పలేదు.

దానితో, ప్రధాన న్యాయమూర్తి తానే చొరవ తీసుకొని `మీకు బెయిల్ కావాలా?’ అని అడిగారు. అందుకు సుముఖత వ్యక్తం చేసి ఉంటే బెయిల్ పొందే అవకాశం ఉండెడిది. దానికి కూడా లాయర్ లూథ్రా వద్దని సమాధానం ఇచ్చారు. మూడు వారాల క్రితం సిఐడి అరెస్టు చేసి రాజమండ్రి జైల్లో రిమాండ్ కు పంపినప్పటి నుంచీ చంద్రబాబు బెయిల్ తీసుకోకుండా ఈ కేసే కొట్టేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్లు వేస్తున్నారు.

చంద్రబాబు అరెస్టు తర్వాత రిమాండ్ విధించగానే బెయిల్ కోరేందుకు అవకాశం ఉంది. అయినా చంద్రబాబు వినియోగించుకోలేదు. ఆ తర్వాత హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నా వాడుకోలేదు. కానీ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.  అనంతరం హైకోర్టు దాన్ని కొట్టేస్తే తిరిగి సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ తీసుకునే అవకాశం ఉన్నా లేక హైకోర్టులోనే బెయిల్ కోరే అవకాశం ఉన్నా మొగ్గు చూపలేదు. 
 
చివరికి సుప్రీంకోర్టులోనే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.  తద్వారా సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చేందుకు సిద్ధమైనా వద్దని క్వాష్ పిటిషన్ పై విచారణ జరిపి తీర్పు ప్రకటించమనే చంద్రబాబు కోరారు.  దీంతో స్కిల్ స్కాంలో బెయిల్ తీసుకుని విమర్శలు కొనసాగేలా చేయడం కంటే నిర్దోషిగా బయటపడటమే మేలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదేళ్లుగా సిబిఐ, ఈడీ కేసులలో బెయిల్ పై ఉంటున్న నేతగా విమర్శలు గుప్పిస్తుండగా, ఇప్పుడు తాను అదేవిధంగా ఉండేందుకు విముఖంగా ఉన్నట్లు భావిస్తున్నారు. ముఖ్యంగా అన్నింటి కంటే మించి స్కిల్ స్కాంలో తాను తప్పు చేయలేదని బాబు బలంగా భావిస్తున్నారని, అందుకే బెయిల్ కోరడం లేదని, కేసే కొట్టేయాలని కోరుతున్నారని, ఈ విచారణ జరిగే వరకూ జైల్లో ఉండేందుకూ మొగ్గు చూపుతున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

మరోవంక, రాజకీయ కక్షసాధింపులో భాగంగా అరెస్ట్ చేశారని టీడీపీ శ్రేణులు విస్తృతంగా విమర్శలు చేసి, ప్రజల వద్దకు వెళ్లేందుకు, తద్వారా ప్రజా సానుభూతి పొందేందుకు కొద్దిరోజులు జైలులో ఉండటం ఉపయోగపడుతోందనే ఆలోచనలు కూడా ఉన్నట్లు కనిపిస్తుంది.