హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ మృతి

భార‌తీయ హ‌రిత విప్లవానికి జాతిపిత‌గా కీర్తించ‌బ‌డే ప్ర‌ఖ్యాత వ్య‌వ‌సాయ శాస్త్ర‌వేత్త ఎంఎస్ స్వామినాథ‌న్ గురువారం ఉదయం క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 98 ఏళ్లు. భార‌తీయ వ్య‌వ‌సాయ రంగంలో ఆయ‌న అనేక విప్ల‌వాత్మ‌క మార్పుల‌ను సృష్టించారు. అత్య‌ధిక స్థాయిలో దిగుబ‌డిని ఇచ్చే అనేక వ‌రి వంగ‌డాల‌ను ఆయ‌న అభివృద్ధి చేశారు. త‌క్కువ ఆదాయం ఉన్న రైతుల‌కు .. దిగుబ‌డిని పెంచే అనేక ప‌ద్ధ‌తుల‌ను ఆయ‌న నేర్పారు.

అధిక దిగుబడిని ఇచ్చే పలు వరి వంగడాలను రూపొందించి, చిన్న, సన్నకారు రైతులు అధిక ఆదాయం పొందడానికి డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ కారణమయ్యారు. తమిళనాడులోని తంజావూరు జిల్లాలో ఆగస్ట్ 7, 1925న డాక్టర్ స్వామినాథన్ జన్మించారు. వ్యవసాయంపై చిన్ననాటి నుంచి మక్కువ ఉన్న స్వామినాథన్ విద్యాభ్యాసం అనంతరం వ్యవసాయ శాస్త్రవేత్తగా, వ్యవసాయ ఆర్థిక వేత్తగా మారారు.

పంటల స్వల్ప దిగుబడులు, వాతావరణ మార్పుల కారణంగా దిగుబడులు ఘోరంగా తగ్గుతున్న సమయంలో అధిక దిగుబడులను ఇచ్చే అనేక వరి వంగడాలను రూపొందించారు. తక్కువ నీటి వినియోగంతో, తక్కువ సమయంలోనే పంట చేతికి వచ్చేలా వంగడాలను సృష్టించారు. నాణ్య‌మైన‌, బ‌ల‌మైన ఆహారాన్ని ప్ర‌జ‌ల‌కు అందించ‌డ‌మే ఆయ‌న ఉద్దేశం.

హ‌రిత విప్ల‌వంతో ఎన్నో అద్భుతాలు సృష్టించిన హంగ‌ర్ ఫైట‌ర్  గా పేరొందారు. శాస్త్రీయ విధానంతో వినూత్న‌ వంగ‌డాల‌ను సృష్టించి, ఆక‌లి లేని స‌మాజాన్ని స్ధాపించాల‌న్న స్వామినాథ‌న్ ఆశ‌యం అద్వితీయం. తిండి కొర‌త‌లేకుండా చేయాల‌న్న సంక‌ల్పంతో జీవించారు.

20వ శతాబ్ధంలో ఆసియాలో ప్ర‌భావం చూపిన 20 మంది వ్య‌క్తుల్లో ఎంఎస్ స్వామినాథ‌న్ ఒక‌రని టైమ్ మ్యాగ్జిన్ కీర్తించింది. మ‌హాత్మా గాంధీ, ర‌వీంద్ర‌నాథ్ ఠాకూర్ త‌ర్వాత ప్ర‌భావంత‌మైన భార‌తీయ వ్య‌క్తుల్లో ఆయ‌న ఒక‌రు అని టైమ్ మ్యాగ్జిన్ పేర్కొన్న‌ది. స్వామినాథ‌న్‌ను ఫాద‌ర్ ఆఫ్ ఎక‌నామిక్ ఎకాల‌జీ అని ఐక్య‌రాజ్య‌స‌మితి కీర్తించింది. 

వ్య‌వ‌సాయంలో హ‌రిత విప్ల‌వానికి స్వామినాథ‌న్ నాయ‌క‌త్వం వ‌హించిన‌ట్లు యూఎన్ ఓ ద‌శ‌లో పేర్కొన్న‌ది. ప్ర‌పంచ శాస్త్ర‌వేత్త‌ల్లో అరుదైన గుర్తింపు క‌లిగిన వ్య‌క్తి స్వామినాథ‌న్ అంటూ యూఎన్ మాజీ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ ఓసారి కీర్తించారు.  ఆహార భ‌ద్ర‌త కోసం ఐక్య‌రాజ్య‌స‌మితిలో ఆయ‌న ఎన్నో కీల‌ప ప‌ద‌వుల్ని చేప‌ట్టారు. 

1980లో ఏర్పాటు చేసిన‌ యూఎన్ సైన్స్ అడ్వైజ‌రీ క‌మిటీలో ఆయ‌న చైర్మెన్‌గా చేశారు. వియ‌న్నా యాక్ష‌న్ ప్లాన్‌లో పాల్గొన్నారు. ఎఫ్ఏవో కౌన్సిల్‌లో ఇండిపెండెంట్ చైర్మెన్‌గా ఉన్నారు. ప్ర‌కృతి, ప్ర‌కృతివ‌న‌రుల సంర‌క్ష‌ణ అంత‌ర్జాతీయ సంఘానికి అధ్య‌క్షుడిగా చేశారు. వ‌ర‌ల్డ్ వైడ్ ఫండ్ ఫ‌ర్ నేచ‌ర్‌కు అధ్య‌క్షుడిగా చేశారు. 

1961 నుంచి 72 వ‌ర‌కు ఇండియ‌న్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ రీస‌ర్చ్ ఇన్స్‌టిట్యూట్‌కు డైరెక్ట‌ర్‌గా చేశారాయ‌న‌. వ్య‌వ‌సాయ మంత్రిత్వ‌శాఖ‌లో ఎన్నో కీల‌క ప‌ద‌వుల్ని చేప‌ట్టారు. పిలిప్పీన్స్‌లో ఇంట‌ర్నేష‌న‌ల్ రైస్ రీస‌ర్చ్ ఇన్స్‌టిట్యూట్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్‌గా చేశారు.

వ్యవసాయ రంగంలో విశేష కృషి చేసిన డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ కు ప్రతిష్టాత్మక అవార్డులెన్నో వచ్చాయి. 1987లో తొలి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అయననే వరించింది. ఆ తర్వాత ఆయన చెన్నైలో ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ను స్థాపించారు. 1971 లో రామన్ మెగసేసే పురస్కారం, 1986 లో అల్బర్ట్ ఐన్ స్టీన్ వరల్డ్ సైన్స్ అవార్డ్ డాక్టర్ స్వామినాథన్ కు వచ్చాయి. 

అలాగే పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, ఇందిరా శాంతి బహుమతి, ఇందిరా జాతీయ సమైక్యతా పురస్కరాలు కూడా పొందారు. స్వామినాథ‌న్‌కు భార్య మీనాతో పాటు ముగ్గురు కుమార్తెలు సౌమ్యా స్వామినాథ‌న్‌, మ‌ధురా స్వామినాథ‌న్‌, నిత్యా స్వామినాథ‌న్‌ ఉన్నారు. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌లో సౌమ్యా స్వామినాథ‌న్‌ చీఫ్ సైంటిస్టుగా ఉన్న విష‌యం తెలిసిందే.