ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో ఏ14గా నారాలోకేష్

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఎ 14గా నారా లోకేశ్ పేరును చేర్చింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేశ్ పేరును చేరుస్తూ ఏసీబీ కోర్టులో మెమో దాఖలైంది. ఈ కేసులో మాజీ మంత్రి నారాయణ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపలు ఎదుర్కొంటున్నారు. తమ వ్యక్తిగత ఆస్తుల విలువను పెంచుకోడానికి ఇన్నర్‌ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను మార్చారని సిఐడి ఆరోపిస్తోంది.

సింగపూర్‌ కన్సల్టెన్సీకి మాస్టర్‌ ప్లాన్ తయారు చేసే బాధ్యతలు అప్పగించి, అందులో నిబంధనలను తమకు అనుగుణంగా మార్చుకున్నారని సిఐడి అభియోగాలు నమోదు చేసింది. ఇన్నర్‌ రింగ్‌ అలైన్‌మెంట్‌ వ్యవహారంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, ప్రముఖులు, ముఖ్యమైన వ్యక్తుల భూముల విలువను అమాంతం పెంచుకునేలా అలైన్‌మెంట్‌ మార్పులు జరిగాయని సిఐడి ఆరోపిస్తోంది.

హెరిటేజ్ భూములకు దగ్గరగా రింగ్ రోడ్డు వెళ్లేలా దక్షిణం వైపుకు జరిపారని, విజయవాడలో మాజీ మంత్రి నారాయణ భూముల విలువ పెరిగేలా మార్పులు చేశారని సిఐడి ఆరోపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో అప్పటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తుల ప్రమేయం ఉందని సిఐడి ఆరోపిస్తోంది. ఈ కేసులో ఏ14గా నారా లోకేష్‌ పేరును చేర్చారు.

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీలో కీలకంగా ఉన్న నారా లోకేష్‌ను కూడా అరెస్ట్‌ చేస్తారని ప్రచారం కొద్దీ రోజులుగా జరుగుతుంది. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో ఏ1 గా నాటి సిఎం చంద్రబాబు నాయుడు, ఏ2గా నారాయణలతో పాటు లింగమననేని రమేష్, బిల్డర్ అంజనీకుమార్‌ ఉన్నారు. 

తాజాగా ఈ వ్యవహారంలో లోకేష్‌ పేరును కూడా చేర్చారు. మరోవైపు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసును క్వాష్‌ చేయాలంటూ మాజీ మంత్రి నారాయణ వేసిన పిటిషన్‌ను హైకోర్టు అక్టోబర్ 3కు వాయిదా వేసింది. చంద్రబాబు నాయుడు సైతం ఇదే కేసులో ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్ దాఖలు చేయగా, అదికూడా వాయిదా పడింది.

కాగా, తాను తిరిగి యువగళం పాదయాత్ర ప్రారంభిస్తున్నామని ప్రకటించేసరికి ఈ కేసులో తన పేరు చేర్చారని లోకేష్ ఆరోపించారు. ‘‘నా పాద‌యాత్ర ఆరంభం కాకూడ‌ద‌ని జీవో 1 తెచ్చినా, ఆగ‌ని యువ‌గ‌ళం జ‌న‌గ‌ళ‌మై గ‌ర్జించింది. ఎక్క‌డిక‌క్క‌డ అడ్డుకున్నా జ‌న‌జైత్రయాత్ర‌గా ముందుకు సాగింది. మ‌ళ్లీ యువ‌గ‌ళం ఆరంభిస్తామ‌నే స‌రికి, నా శాఖ‌కి సంబంధంలేని, అస‌లు వేయ‌ని రింగ్ రోడ్డు కేసులో న‌న్ను ఏ14గా చేర్పించారీ 420 సీఎం’’ అంటూ దుయ్యబట్టారు.