ఆంధ్ర ప్రదేశ్ లో వార్డు సచివాలయాల ఏర్పాటును కంపో్ట్రలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తప్పుబట్టింది. ఇది రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధమని తీవ్రంగా వ్యాఖ్యానించింది. వార్డు సచివాలయాలను రాజ్యాంగబద్ధమైన వార్డు కమిటీలు, ప్రాంతీయ సభలకు జవాబుదారీగా చేసి, రాజ్యాంగంలో ఏకీకృతం చేయాలని వైసీపీ ప్రభుత్వానికి కాగ్ సూచించింది.
2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాగ్ నివేదికను సోమవారం ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. నివేదికలో కాగ్ లేవనెత్తిన అభ్యంతరాల ప్రకారం, రాజ్యాంగపరంగా ఏర్పాటు చేయాల్సిన వార్డు కమిటీలను ప్రభుత్వం విస్మరించింది. ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం లేకుండా వాటి ఏర్పాటు సరికాదని పేర్కొంది. “ఎన్నికైన ప్రజాప్రతినిధులకు అందులో భాగస్వామ్యం లేదు. ఈ చర్య స్థానిక స్వపరిపాలన కోసం ఉద్దేశించిన రాజ్యాంగ స్ఫూర్తిని నీరుగార్చింది’’ అని కాగ్ ఆక్షేపించింది. 2019 జూలైలో జగన్ ప్రభుత్వం వార్డు సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చింది.
ఒక్కొక్క వార్డు సచివాలయంలో 10 మంది వార్డు కార్యదర్శుల చొప్పున 37,860 పోస్టులతో ప్రభుత్వం 3786 వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఉన్న బిల్ కలెక్టర్, వర్క్ ఇన్స్‌పెక్టర్, ట్యాప్ ఇన్స్‌పెక్టర్, ఫిట్టర్, టీపీ ట్రేసర్ పోస్టులను అందులో విలీనం చేశారు. ఇవి మొత్తం 2434 పోస్టులు. అలాగే, 70,888 వలంటీర్లను ఎంపిక చేసింది.
వార్డు స్థాయిలో కొత్త వ్యవస్థ ఏర్పాటు చేయడం పురపాలక చట్టాలకు అనుగుణంగా లేదని కాగ్ తీవ్రమైన వ్యాఖ్య చేసింది. ‘‘వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయడం వల్ల రాజ్యాంగంలో నిర్దేశించినట్టు పౌరులకు, పాలనకు మధ్య వారధిగా ఉండాలనే వార్డు కమిటీ ఉద్దేశాన్ని, రాజ్యాంగ నిబంధనలను జగన్ ప్రభుత్వం నీరుగార్చింది. వార్డు కమిటీలు/ప్రాంతీయ సభల లాంటి వ్యవస్థల్లో నిర్దేశించినట్టు ఎన్నికైన ప్రతినిధులు లేదా పౌరసమాజ సభ్యుల భాగస్వామ్యం లేనందున, వాటి ఏర్పాటు ఆమోదయోగ్యం కాదు’’ అని తేల్చింది.
స్థానిక అవసరాల కోసం అభివృద్ధి ప్రణాళికలను రూపొందించడానికి మహానగర ప్రణాళిక కమిటీలు, జిల్లా ప్రణాళిక కమిటీలు ఏర్పాటు చేయాలని కాగ్ సూచించింది. ఆస్తి పన్ను వసూలు చేసే అధికారం పట్టణ స్థానిక సంస్థలకు ఉన్నప్పటికీ, పన్నురేట్లు, వాటి సవరణ, వసూలు చేసే విధానం, మినహాయింపులు లాంటి విషయాల్లో నిర్ణయాధికారం ప్రభుత్వం వద్దే ఉందని కాగ్ తెలిపింది.
‘‘భవనాలు, ఖాళీ స్థలాలపై ఆస్తి పన్నును సరైన విధంగా మదింపు కోసం అన్ని పట్టణ స్థానిక సంస్థలకు తోడ్పాటు, సాంకేతిక మార్గదర్శకాలను అందించడానికి చట్టం, 13వ ఆర్థిక సంఘం ఆదేశాల ప్రకారం ప్రభుత్వం ఆస్తి పన్ను బోర్డును ఏర్పాటు చేయలేదు. తక్షణమే బోర్డు ఏర్పాటు చేయాలి’’ అని కాగ్ సిఫారసు చేసింది.
ఇక గత ప్రభుత్వం రాజధాని కోసం భూసేకరణ విధానాన్ని తప్పు పట్టింది. ల్యాండ్ పూలింగ్ ద్వారా 70 శాతం భూమిని సేకరించినప్పటికీ , అక్కడ మౌలిక సదుపాయాల కోసం రూ 13 వేల కోట్లకు పైగా ఖర్చు చేయాలని నిర్ణయించింది. ఇది ప్రభుత్వానికి పెను ఆర్ధికభారమేనని పేర్కొంది కాగ్.
అలాగే భూసేకరణ, సద్వినియోగంపై నిపుణుల కమిటీ సూచనలను గత తెలుగుదేశం ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని వెల్లడించింది. రాజధాని మౌలికసదుపాయల కోసం కేవలం 139 కోట్ల రూపాయిలనే ఖర్చుచేసిందని పేర్కొంది.. 2019 నుంచి రాజధాని అమరావతిలో పనులన్నీ నిలిచిపోయాయని, దీనివల్ల ప్రభుత్వానికి ఆర్ధికపరమైన ఇబ్బందులు తలెత్తాయని కాగ్ తన నివేదికలో తెలిపింది.
More Stories
ట్రంప్ `పౌరసత్వం’ నిర్ణయంపై అమెరికాలోని 22 రాష్ర్టాల దావా
తిరుమలలో శారదాపీఠం అక్రమ నిర్మాణంపై హైకోర్టు ఆగ్రహం
ఈ నెల 22 నుంచి ఒకే వరుసలోకి ఆరు గ్రహాలు!