జగన్ కేవలం కక్ష సాధింపులపైనే దృష్టి సారిస్తున్నారు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేవలం కక్ష సాధింపులపైనే దృష్టి సారిస్తున్నారని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ధ్వజమెత్తారు. రైతులు, రైతాంగ సమస్యలపై దృష్టి సారించడం లేదని చెబుతూ ఏడు సార్లు కరెంట్ ఛార్జీలను పెంచారని, కరెంట్ కోతలు పెరిగిపోయాయని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వం పాలనను గాలికి వదిలేయడంతో పరిస్థితులు అగమ్యగోచంగా మారాయని చెబుతూ ఉత్తుత్తి బటన్లు నొక్కుతూ ప్రజలను జగన్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు.  

ఏపీ పోలీసులపై వైసీపీ ప్రభుత్వ ఒత్తిడి ఎక్కువయిందని సత్యకుమార్ విమర్శించారు.  ప్రభుత్వ ఒత్తిడిని తట్టుకోలేక ప్రతిరోజు పోలీసులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళ అని కూడా చూడకుండా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఏపీ ఎన్నికల్లో పొత్తులపై జనవరిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

అంతర్జాతీయ నేరస్తుడు చార్లెస్ శోభరాజుతో ముఖ్యమంత్రి జగన్ ను సత్యకుమార్ పోల్చారు. నేరస్తుడైన శోభరాజ్ ఏళ్లపాటు చిక్కకుండా తప్పించుకు తిరిగారని., ఇప్పుడు జగన్ పదేళ్లుగా బెయిల్ పై తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. బైజూస్ లో వైసీపీ అవినీతిపై బీజేపీ ఆధారాలను సేకరిస్తోందని, త్వరలోనే కేసులు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

15 రోజులుగా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు వెకిలి మాటలు, వికృత చేష్టలతో ప్రజల దృష్టిని మరల్చుతున్నారని ఆయన విమర్శించారు.  స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు పట్ల వ్యవహరించిన తీరు సరికాదని సత్యకుమార్ స్పష్టం చేశారు. అయితే, చంద్రబాబు బెయిల్ అంశం అనేది కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిది కాదని, కోర్టు పరిధిలోని అంశమని చెప్పారు. ప్రతి అంశంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోలేదని తెలిపారు.