ప్రధాని విజయవాడ పర్యటనలో భద్రతా వైఫల్యంపై కేంద్రం సీరియస్

* నో ఫ్లై జోన్ గా ప్రకటించినా డ్రోన్ ల ఎగరవేతపై ఆగ్రహం

ఎపిలోని విజయవాడలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల మొదటివారంలో జరిపిన  రోడ్‌షోలో జరిగిన భద్రతా వైఫల్యంపై కేంద్రం సీరియస్ అయింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 8న విజయవాడలో ప్రధాని మోదీ ఎన్డీయే భాగస్వాములు చంద్రబాబు నాయుడు, పవన్‌కల్యాణ్‌లతో కలిసి రోడ్‌షో నిర్వ్రహించారు. బందరు రోడ్దులో మున్సిపల్‌ స్టేడియం నుంచి బెంజ్‌సర్కిల్‌ వరకూ సాగిన ఈ రోడ్డుషో సాయంత్రం 6.15కు మొదలైంది. 

అంతకు 45 నిముషాల ముందు రోడ్‌ షో ప్రారంభమయ్యే ప్రాంతంలో ఒకటి, ముగించే దగ్గర మరొకటి గాల్లో ఎగురుతున్న డ్రోన్లను ప్రధాని రక్షణ బాధ్యతలు పర్యవేక్షించే నేషనల్‌ సెక్యూరిటీ గ్రూప్‌(ఎన్‌ఎ్‌సజీ) గమనించి వాటిని కిందికి దించేసింది. ప్రధాని పర్యటించే ప్రాంతంలో కనీసం 2కిలోమీటర్ల దూరంలో ఎలాంటి డ్రోన్లు ఎగరకుండా నిషేధం ఉందంటూ అడ్డుకుంది.

ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖకు తెలియజేయడంతో రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్రధాని పర్యటనకు సంబంధించి సెక్యూరిటీపై మే 5న జరిగిన చర్చలో ఈ విషయాన్ని వివరించినప్పటికీ ఏపీ పోలీసులు డ్రోన్లు ఎందుకు ఎగురవేశారని ప్రశ్నించింది.  ప్రధాని రోడ్‌షో ప్రాంతం ముందుగానే నోప్లై జోన్‌గా ప్రకటించినా డ్రోన్లు ఎలా ఎగరగలిగాయాని కేంద్ర హోంశాఖ డిజిపిని ప్రశ్నించింది. ఈ ఘటన వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిజిపికి కేంద్ర హోం శాఖ లేఖ పంపించింది. 

ఇప్పటి వరకూ ఇలా ప్రధాని రోడ్ షోలో అనధికారిక డ్రోన్లు ఎగిరిన విషయం బయటకు రాలేదు. ప్రధాని మోదీ భద్రతా ఏర్పాట్లను ఎస్‌పిజి చూసుకుంటుంది. ఏ మాత్రం చిన్న తేడా కనిపించినా సీరియస్‌గా స్పందిస్తుంది. ప్రధాని రోడ్ షో రోజున మొదట ఓ డ్రోన్ ఎగరడం గమనించి కిందకి దించి వేయించారు. ఈ ఘటన తర్వాత మరో డ్రోన్ ఎగరకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 

కాగా, వీఐపీల భద్రతలో భాగంగా పోలీసు శాఖ నిఘా కోసం డ్రోన్లను ఎగురవేస్తుంది. ప్రధాని రోడ్‌షో ప్రాంతం నో ఫ్లయింగ్‌ జోన్‌ గా ప్రకటిస్తూ సీపీ ఆదేశాలు ఇచ్చా రు. దీంతో డోన్‌ ఎగరవేయాలంటే ముం దుగా పోలీసు కమిషనర్‌ అనుమతి తీసుకోవాలి. కాగా, ప్రకాశం జిల్లా నుంచి పోలీసులు ఈ డ్రోన్‌ను ఎగురవేసినట్టు పోలీ సు కమిషనర్‌కు సమాచారం అందింది. దీనిపై అంతర్గతంగా విచారణ చేస్తున్నారు.

 కేంద్ర హోంశాఖ స్వయంగా ఆదేశించడంతో ఇప్పుడు డిజిపి అసలు డ్రోన్లు ఎగురవేసిన వాళ్లు ఎవరు? ఎందుకు ఎగురవేశారు? పోలీసులు ఎందుకు పట్టించుకోలేదు? ఒక వేళ పోలీసులే ఎగురవేస్తే? నిబంధనలు ఎందుకు పట్టించుకోలేదు వంటి అంశాలపై దర్యాప్తు చేసి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

మోదీ  భద్రతా ఏర్పాట్లను సీనియర్ ఐపిఎస్ అధికారులు చూస్తారు. వారిలో నిర్లక్ష్యం ఎవరితో విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మోదీ పర్యటనలో భద్రతా వైఫల్యం ఇదే మొదటి సారి కాదు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే మోదీ  చిలుకలూరిపేట బహిరంగసభకు హాజరయ్యారు. ఆ సభలో మొత్తం గందరగోళం ఏర్పడింది. 

పోలీసులు నిర్లిప్తంగా వ్యవహరించారన్న ఆరోపణలు వచ్చాయి. ఫలితంగా ఆ సభ రక్షణ బాధ్యతల్లో ఉన్న పలువురు ఎస్‌పిలపై ఇసి వేటు వేసింది. ఈ సారి మరికొంత మంది ఐపిఎస్ అధికారులపై చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.