జూన్‌ 6 వరకు పిన్నెల్లిపై చర్యలొద్దన్న హైకోర్టు

ఈవీఎం ధ్వంసం కేసులో ఏపీ హైకోర్టును ఆశ్రయించిన మాచర్ల ఎమ్మెల్యే  పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఉరట దక్కింది. జూన్ 6న ఉదయం 10 గంటల వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అరెస్ట్‌తో పాటు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకో వద్దని కోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ జూన్‌ 6కి వాయిదా వేసింది. 
పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి మాత్రమే కాకుండా వివిధ కేసుల్లో ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మిగిలిన ఎమ్మెల్యే అభ్యర్థులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.  తాడిపత్రి టీడీపీ అభ్యర్థి అస్మిత్ రెడ్డి, వైసీపీ పెద్దారెడ్డిలకు కూడా ఏపీ హైకోర్ట్‌లో ఊరట దక్కింది. జూన్ 6 వరకు అరెస్ట్ చేయవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అయితే ఈ సమయంలో వీరిద్దరూ తాడిపత్రికి వెళ్లకూడదని, ఎటువంటి క్రిమినల్ చర్యలకు పాల్పడకుండా ఉండాలని ఏపీ హైకోర్ట్ షరతు విధించింది. వీరి కదలికలపై నిఘా ఉంచాలని ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలు జారీ చేసింది. వీరితో పాటు నలుగురికి మించి తిరగకూడని స్పష్టత ఇచ్చింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే అభ్యర్థులకు కీలక సూచనలు చేసింది. ఆయా కేసుల్లో సాక్షులుగా ఉన్న వారిని ప్రభావితం చేయకూడదంటూ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి సహా ఎమ్మెల్యే అభ్యర్థులకు హైకోర్టు షరతులు విధించింది.

మే 13న పోలింగ్‌ రోజు మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రం(202)లో ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేయడం, పోలింగ్ ఏజెంట్ కు బెదిరింపులు, మహిళలను దుర్భాషలాడిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ అయింది. 

ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియోలు వెలుగులోకి రావడంతో ఈసీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. వెంటనే పిన్నెల్లిని అరెస్టు చేయాలని డీజీపీని ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీసు బృందాలు ఎమ్మెల్యే పిన్నెల్లి కోసం గాలింపు చేపట్టారు.  ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిపై పోలీసులు 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఐపీసీ, ప్రజాప్రాతినిధ్య చట్టం, పీడీపీపీ చట్టాల పరిధిలోని 10 సెక్షన్లు ఈ నెల 20న పిన్నెల్లిపై నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.