ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు

జూన్ 4 తేదీన ఓట్ల లెక్కింపునకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారులకు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. ఫలితాలను కచ్చితత్వంతో త్వరితగతిన ప్రకటించేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచనలు ఇచ్చారు. వివిధ జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కౌంటింగ్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. 25వ తేదీ నుంచి స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలించేందుకు తాను స్వయంగా పర్యటనలు చేపడతానని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.

జూన్ 4 తేదీన కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులకు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. ఓట్ల లెక్కింపులో ఎలాంటి వివాదాలకూ తావు లేకుండా చూడాల్సిందిగా సూచనలు ఇచ్చారు. కౌంటింగ్ సంబంధిత వివరాలను అభ్యర్దులకు, ఏజెంట్లకు ముందుగా తెలియచేయాలని స్పష్టం చేశారు. 

ఎన్ని టేబుళ్లు, ఎన్ని రౌండ్ల లెక్కింపు అనే విషయాలను తెలియచేయాలని సూచనలు జారీ చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేకంగా మీడియా సెంటర్లను ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. స్ట్రాంగ్ రూముల నుంచి ఈవీఎంల తరలింపు మార్గాలు, అభ్యర్ధులు , ఏజెంట్లు వెళ్లేందుకు వేర్వేరు మార్గాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. బారికేడ్లు, సూచికలను కూడా ఏర్పాటు చేయాల్సిందిగా సూచనలు ఇచ్చారు.

అసెంబ్లీ, పార్లమెంటులకు వేర్వేరుగా పోలింగ్ కేంద్రాల సంఖ్యను బట్టి ఓట్ల లెక్కింపు టేబుళ్లను ఏర్పాటు చేయాలని ముఖేష్ కుమార్ మీనా సూచనలు ఇచ్చారు. పోస్టల్ బ్యాలెట్ కోసం ప్రత్యేకంగా టేబుళ్లు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కించాకే ఈవీఎంల లెక్కింపు మొదలు కావాలని మీనా స్పష్టం చేశారు.

ఈసీ నిర్వహించే ఎన్ కోర్ వెబ్ అప్లికేషన్ లో ఫలితాలను వెంటనే అప్ లోడ్ చేయాల్సిందిగా సూచనలు ఇచ్చారు. అనధికార వ్యక్తులు, గుర్తింపు కార్డులు లేని వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ కౌంటింగ్ కేంద్రాలకు అనుమతించ వద్దని సీఈఓ తేల్చి చెప్పారు. లెక్కింపు పూర్తయ్యే వరకూ స్ట్రాంగ్ రూముల వద్ద మూడంచెల భద్రత కొనసాగుతుందని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు.