పోలీసుల సహకారంతోనే ఎమ్యెల్యే పిన్నెల్లి పరార్!

పోలింగ్‌ రోజున మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయిగేట్‌ పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నారు. పోలింగ్‌ రోజున జరిగిన ఘటనల్లో కేసు అవుతుందని గ్రహించిన ఆయన తన సోదరుడు వెంకటరామిరెడ్డితో కలిసి హైదరాబాద్‌ అదే రోజు చేరుకున్నట్లు తెలుస్తోంది. కీలకమైన ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలోనే ఆయనను మాచర్ల నుండి, ఆ తర్వాత హైదరాబాద్ నుండి తప్పించారని తెలుస్తున్నది.

ఈ విషయంలో తెలంగాణకు చెందిన ఓ కీలక నాయకుడు కూడా సహకరించినట్లు చెప్పుకొంటున్నారు.  బుధవారం సాయంత్రం పోలీసులకు తెలంగాణాలో చిక్కిన్నట్లు వార్తలు వచ్చినా అవన్నీ అందరి దృష్టి మళ్లించడం కోసమే అని తెలుస్తున్నది. ఫోన్‌ ఆధారంగా ఆయన హైదరాబాద్‌లో ఉంటున్నట్లు తెలుసుకొని బుధవారం ఉదయం గురజాల డీఎస్పీ ఆధ్వర్యంలోని ప్రత్యేక పోలీసు బృందం హైదరాబాద్ కు వచ్చి ఆయన కారును వెంబడించిన అందులో పిన్నెల్లి సోదరులు ఉన్నట్లు వారెవ్వరూ చూడలేదని తెలుస్తున్నది. వ్యూహాత్మకంగా వారిని దారి మళ్లించడం కోసం కారు వెంబడి తిరిగేటట్లు చేశారని భావిస్తున్నారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళడానికి ముందే పిన్నెల్లి కలవడంతో అరెస్ట్ తప్పకపోవచ్చని గ్రహించారని, అప్పుడే కొందరు నమ్మకస్తులైన అధికారులకు ముఖ్యమంత్రి ఈ బాధ్యత అప్పగించారని తెలుస్తున్నది. పిన్నెల్లి సోదరులు పోలీసులకు దొరకకుండా తాడేపల్లి ప్యాలెస్‌కు అత్యంత సన్నిహితుడైన ఓ సీనియర్‌ ఐపీఎస్‌ దర్శకత్వం వహించగా, మరో సీనియర్‌ ఐఏఎస్‌ సహకరించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

హింసాత్మక సంఘటనలు జరిగిన నేపథ్యంలో పోలీసులు పిన్నెల్లి సోదరులను హౌస్‌ అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే పోలీసులకు తెలియకుండా ఇంట్లో నుంచి వారిద్దరూ తప్పించుకున్నారు. స్థానిక పోలీసుల సహకారంతోనే తప్పించుకున్నట్లు భావిస్తున్నారు.  ఆ తర్వాత పోలింగ్‌ బూత్‌లో ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియో బయటకు రావడంతో పిన్నెల్లిని అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో తన అరెస్టు అనివార్యమని భావించిన పిన్నెల్లి మరోసారి పోలీసు ల కళ్లు గప్పి తప్పించుకున్నారు.

తెలంగాణలో వారిని అరెస్ట్‌ చేసినట్టు వార్తలు కూడా వచ్చాయి. అయితే పిన్నెల్లి సోదరుల జాడ తెలియరాలేదు. పోలీసుల కదలికలను పిన్నెల్లికి చేరవేస్తున్నది ఎవరు? ఈవీఎం ధ్వంసంతో పాటు ఎమ్మెల్యేపై మరో హత్యాయత్నం కేసు కూడా ఉన్న నేపథ్యంలో పారిపోయేందుకు సహకరించింది ఎవరు? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఓ కీలక అధికారి పోలీసుల కదలికలను ఎప్పటికప్పుడు పిన్నెల్లికి చేరవేస్తూ  తప్పించుకునే మార్గాలను సూచిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవంక,  పిన్నెల్లి సోదరు లు విదేశాలకు పారిపోయే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. దీనికోసం ఒక ప్రముఖ టీవీ చానల్‌కు చెందినవారిని ఉపయోగించుకున్నట్లు సమాచారం. పిన్నెల్లి సోదరులు ఆంధ్ర సరిహద్దులు దాటే సమయంలో కూడా ఆ చానల్‌కు చెందిన ప్రముఖ వ్యక్తి వారితో ఉన్నట్లు తెలుస్తోంది.