బిజెపి, కాంగ్రెస్ నేతల రెచ్చగొట్టే ప్రసంగాలపై ఈసీ హెచ్చరిక

లోక్‌సభ ఎన్నికల ప్రచార సభలలో అటు అధికారంలోని బీజేపీ, ఇటు విపక్ష కాంగ్రెస్‌ పార్టీలు ఓటర్లను రెచ్చగొట్టేలా చేస్తున్న ప్రసంగాలను ఎన్నికల కమిషన్‌ తప్పుబట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీలు సహా ఆయా పార్టీలు స్టార్‌ క్యాంపెయినర్లు ఎన్నికల సభలలో చేస్తున్న ప్రసంగాలపై అభ్యంతరం తెలుపుతూ ఇకనైనా వాటిని సరిదిద్దుకోవాలని హెచ్చరించింది.

ఉద్రిక్తతలను పెంచే ప్రసంగాలను దూరం పెట్టాలని, ప్రచారంలో సంయమనాన్ని పాటించాలని కోరింది. దేశంలోని రెండు ప్రధాన పార్టీలు కులం, మతం, భాష, ప్రాంతీయత్వం, రాజ్యాంగం వంటివి ప్రధాన అంశాలుగా చేసుకుని ప్రచారం చేస్తున్నాయని గుర్తు చేసింది.  ఈ పార్టీల అగ్రనేతలపై సుమారు నెలరోజుల క్రితం అందిన ఫిర్యాదులకు సంబంధించి ఆ రెండు పార్టీల అధ్యక్షుడు జెపి నడ్డా, మల్లిఖార్జున ఖర్గేలకు ఎన్నికల కమిషన్ సుదీర్ఘ లేఖలు వ్రాసింది.

తమ స్టార్ క్యాంపెయినర్లు మర్యాదపూర్వకంగా ఉండేలా చూసుకోవాలని ఇరు పార్టీలకు సూచించింది. మతతత్వ వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని కోరింది.  భారత రాజ్యాంగంపై వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ, కాంగ్రెస్‌లు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. దీంతో ఎన్నికల సంఘం వారికి నోటీసులు ఇచ్చింది. నోటీసులకు వారు సమాధానం కూడా చెప్పారు.

దీనిపై తాజాగా ఈసీ తాజా ప్రకటన జారీ చేసింది. తమ స్టార్ క్యాంపెయినర్ల ప్రసంగాలపై బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షులకు నోటీసులు జారీ చేసిన దాదాపు నెల రోజుల తర్వాత బుధవారం ఈసీ ఈ ప్రకటన చేసింది. ఈసీ నోటీసుకు ఇచ్చిన సమాధానాల్లో ఇరు పార్టీలు తమ నేతల ప్రకటనలను సమర్థించుకున్నాయి. మోదీ  లేదా గాంధీ పేరును ప్రస్తావించకుండా.. పోల్ ప్యానెల్ బుధవారం వరుసగా బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షులు జేపీ నడ్డా, మల్లికార్జున్ ఖర్గేలకు లేఖలు రాసింది.

తమ స్టార్ క్యాంపెయినర్లు “సమాజాన్ని విభజించే” ప్రసంగాలు, ప్రకటనలు చేయకుండా చూసుకోవాలని బిజెపిని కోరినప్పటికీ.. దాన్ని స్టార్ క్యాంపెయినర్లు పట్టించుకోవడం లేదని పేర్కొంది.  భారత రాజ్యాంగం గురించి తప్పుడు ప్రకటనలు చేయకుండా చూసుకోవాలని కాంగ్రెస్‌ను కోరింది. ఇరు పార్టీల నేతలు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని ఈసీ తెలిపింది. వివాదాస్పద వ్యాఖ్యలపై పోల్ ప్యానెల్ ఆందోళన వ్యక్తం చేసింది.

రెండు పార్టీల నాయకులు చేసిన అనేక వ్యాఖ్యలను సంబంధిత లేఖలో ప్రస్తావించింది.  కుల, మతాల మధ్య విభజనకు దారితీసే అంశాలు, రాజ్యాంగం రద్దు లాంటి అంశాలను ఈ ప్రధాన పార్టీలు తమ ప్రచారంలో ప్రధానంగా ఉంచడాన్ని ఎన్నికల సంఘం తప్పుబట్టింది. ఇలాంటి అంశాలపై ప్రచారం సాగిస్తూ ఆయా వర్గాలలో ఉద్రిక్తతలు పెంచవద్దని కోరింది. ఈ విషయంలో పార్టీ అధ్యక్షులు తమ స్టార్‌ క్యాంపెయినర్లను రెచ్చగొట్టే ప్రసంగాలకు దూరంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేయాలని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గేలను ఎన్నికల సంఘం ఆదేశించింది.