బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమతో పాటు డ్రగ్స్ సేవించిన 83 మంది

కర్ణాటకలోని బెంగళూరు శివారు ప్రాంతంలో ఆదివారం రాత్రి జరిగిన ఓ రేవ్ పార్టీని అక్కడి పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. ఆ పార్టీకి ఏపీ, బెంగళూరుకు చెందిన 100 మందికి పైగా ప్రముఖులు హాజరు కాగా, వారిలో సినీ రంగానికి చెందిన కొందరు నటులు, బుల్లితెర నటులు, మోడల్స్ ఉన్నట్లు పోలీసులు ఇదివరకే వెల్లడించారు. 

వీరితో పాటు 17 గ్రాముల ఎండీఎంఏ పిల్స్, కొకైన్ లాంటి మత్తు పదార్థాలు, అలాగే మెర్సిడెస్ బెంజ్, ఆడీ, జాగ్వార్ సహా 15 ఖరీదైన కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఇందులో భాగంగా పట్టుబడిన వారి రక్త నమూనాలు సేకరించి ఇటీవల వైద్య పరీక్షలకు పంపగా, 103 మందిలో 86 మందికి డ్రగ్‌ పాజిటివ్​గా నిర్ధారణ అయినట్లు కర్ణాటక పోలీసులు నిర్ధారించారు. పలువురు నటుల రక్త నమూనాల్లోనూ మాదక ద్రవ్యాల ఆనవాళ్లను గుర్తించిన పోలీసులు, వారిలో తెలుగు నటి హేమ సైతం ఉన్నట్లు స్పష్టం చేశారు. 

ఆమె కృష్ణవేణి పేరుతో పార్టీలో పాల్గొన్నారని వెల్లడైంది.  హేమ త‌న‌కు ఆ పార్టీకి ఎటువంటి సంబంధం లేదంటూ వీడియో విడుద‌ల చేయడంతోనే బెంగళూరు పోలీసుల‌కు ఆధారం దొరికిన‌ట్ల‌యిందని చెబుతున్నారు. రేవ్ పార్టీలో ఉన్న వీడియో.. హేమ విడుద‌ల చేసిన వీడియో ఒకేలా ఉండ‌డంతో పోలీసులు హేమని అదుపులోకి తీసుకున్నారు.

‘సన్ సెట్ టు సన్ రైజ్ విక్టరీ’ పేరుతో బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ జీఆర్ ఫామ్‌ హౌస్‌లో జరిగిన ఈ రేవ్‌పార్టీలో పాల్గొన్న 103 మంది రక్త నమూనాలను ఇటీవల బెంగళూరు నార్కొటిక్ టీమ్ సేకరించింది. 103 మందిలో మొత్తం 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. 59 మంది పురుషుల, 27 మంది మహిళల రక్త నమూనాలు పాజిటివ్ అని తేలింది. 

నటి హేమ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. రక్త నమూనాలు పాజిటివ్‌గా తేలిన వారందరికీ సీసీబీ సమన్లు ​​జారీ చేయనుంది. హేమతో పాటు వీరందరినీ బాధితులుగా పరిగణించే అవకాశం ఉంది. కనుక వీరిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. డ్రగ్స్ టెస్టులో సినీ నటి హేమతోపాటు తెలుగు వారందరికీ పాజిటివ్ వచ్చినట్లు సమాచారం.

పార్టీలో దాదాపు 200మంది పాల్గొన్నారు. వీరిలో ప్రధాన నిందితులు నలుగురు మినహా మిగిలిన వారిని స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. ఒక్కొక్కరి నుంచి పార్టీలో పాల్గొనడానికి రూ.2లక్షలు వసూలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. పార్టీని నిర్వహించిన లంకపల్లి వాసు విజయవాడకు చెందిన క్రికెట్ బుకీగా గుర్తించారు. నగరానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకులకు బినామీగా క్రికెట్ నుంచి పాలిటిక్స్‌ వరకు పందాలు నిర్వహిస్తూ కోట్లకు పడగలెత్తాడు. విజయవాడ నగరం నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలకు దందాలు విస్తరించాడు.

తెలుగు రాష్ట్రాల పోలీసులతో సంబంధాలు పెట్టుకుని వ్యాపారాన్ని విస్తరించాడు. హైదరాబాద్‌లో డ్రగ్ పార్టీలపై నిఘా ఉండటంతో బెంగుళూరులో ఈవెంట్స్‌ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. విజయవాడకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులకు బినామీగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. డ్రగ్స్‌ వినియోగంతో నిందితుడు రెండు కిడ్నీలు విఫలమయ్యాయని తెలుస్తోంది.