ప్రజ్వల్ పోలీసుల ఎదుట లొంగిపో

కర్ణాటక సెక్క్‌ స్కాండల్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తన మనవడు ప్రజ్వల్‌ రేవణ్ణకు మాజీ ప్రధాని దేవె గౌడ గట్టి హెచ్చరిక చేశారు. ఎక్కడున్నా వెంటనే భారత్‌కు తిరిగి వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోవాలని కోరారు. లేదంటే తన ఆగ్రహానికి గురికాక తప్పదంటూ ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా గట్టిగా హెచ్చరించారు. ఈ మేరకు ‘ప్రజ్వల్‌ రేవణ్ణకు ఇదే నా హెచ్చరిక’ పేరుతో ఓ లేఖను కూడా పోస్టుకు జతచేశారు.

‘నా సహనాన్ని పరీక్షించొద్దు. ఎక్కడున్నా వెంటనే భారత్‌కు తిరిగి రావాలి. పోలీసుల ఎదుట లొంగిపోయి చట్టపరమైన విచారణను ఎదుర్కోవాల్సిందిగా ప్రజ్వల్‌ను నేను హెచ్చరిస్తున్నాను. లేదంటే నా ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుంది’ అని దేవె గౌడ ఎక్స్‌లో పేర్కొన్నారు.  మే 18న స్థానిక ఆలయానికి వెళ్లినప్పుడు ప్రజ్వల్‌ రేవణ్ణ గురించి మీడియాతో మాట్లాడినట్లు దేవె గౌడ తన లేఖలో పేర్కొన్నారు.

ప్రజ్వల్‌ చేసిన పని తనకు, తన కుటుంబానికి, సహచరులను, స్నేహితులను, పార్టీ కార్యకర్తలను షాక్‌కు గురిచేసినట్లు చెప్పారు. దాన్నుంచి కోలుకోవడానికి కొంత సమయం పట్టిందని పేర్కొన్నారు.  అతని విదేశీ పర్యటనకు సంబంధించిన సమాచారం తనకు పూర్తిగా తెలియదని దేవెగౌడ పేర్కొన్నారు. ఏది ఏమైనా వెంటనే భారత్‌కు తిరిగి వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోవాలన్నారు. ఇది విజ్ఞప్తి కాదని, ఇది ప్రజ్వల్‌కు తాను చేస్తున్న హెచ్చరిక అని లేఖలో దేవెగౌడ కోరారు.

ఏప్రిల్ 26న జరిగిన కర్ణాటక లోక్‌సభ ఎన్నికల తొలి దశకు ముందు ప్రజ్వల్‌పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అతను విదేశాలకు పారిపోయాడు. దీంతో పోలీసులు ప్రజ్వల్‌పై అరెస్ట్‌ వారెంట్‌ కూడా జారీ చేశారు. దీంతో వారం రోజుల్లో భారత్‌కు వస్తానని ప్రజ్వల్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు.  అయితే, ఇప్పటి వరకూ అతడు భారత్‌కు తిరిగిరాలేదు. దీంతో ప్రజ్వల్‌ దౌత్య పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలని కర్ణాటక ప్రభుత్వం కేంద్రానికి లేఖ కూడా రాసింది. లైంగిక ఆరోపణల కేసులో ప్రజ్వల్‌ రేవణ్ణపై ఇప్పటికే న్యాయస్థానం అరెస్ట్‌ వారెంట్‌ను జారీ చేసిందని, ఈ క్రమంలో వెంటనే అతడి దౌత్య పాస్‌పోర్టును రద్దు చేయాలని విజ్ఞప్తి చేసింది.

మరోవైపు కుమారస్వామి సైతం ప్రజ్వల్‌కు ఇటీవలే కీలక విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. తనపై, హెచ్‌డీ దేవెగౌడపై ఏమాత్రం గౌరవం ఉన్నా 48 గంటల్లో స్వదేశానికి తిరిగి వచ్చి సిట్‌ ఎదుట లొంగిపోవాలని కోరారు. ‘ఎక్కడున్నా భారత్‌కు తిరిగొచ్చి విచారణకు హాజరవ్వు. తప్పించుకోవద్దని నేను అభ్యర్థిస్తున్నాను. ఏ తప్పూ చేయకపోతే.. ఎందుకు భయపడుతున్నావ్‌? ఎన్ని రోజులు దొంగా పోలీసు ఆట ఆడుతావు..? విదేశం నుంచి వచ్చి విచారణకు సహకరించు’ అని విజ్ఞప్తి చేశారు.