చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై రేపు సుప్రీంలో విచారణ

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. తన రిమాండ్‌ను క్వాష్ చేయాలని సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్ వేశారు. బుధవారం విచారణ చేపట్టేందుకు సిజెఐ అంగీకరించారు. ఏ బెంచ్ ముందు విచారణకు వస్తుందో సాయంత్రానికి వెల్లడించనున్నారు. 

చంద్రబాబు తరఫు లాయర్లు వేసిన మెన్షన్ మెమోపై సిజెఐ నిర్ణయం తీసుకోనుంది. సోమవారం సిజెఐ ముందు చంద్రబాబు తరఫు న్యాయవాదులు మెన్షన్ చేశారు.  అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఎ కింద గవర్నర్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ  చంద్రబాబు సుప్రీంను ఆశ్రయించారు.

మరోవంక, చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా పడింది. రెండు పిటిషన్లపై విచారణ ఎసిబి కోర్టు ఇన్‌ఛార్జి జడ్జి బుధవారానికి వాయిదా వేశారు. మంగళవారం విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి సెలవులో ఉన్నారు. ఎసిబి కోర్టు ఇన్‌ఛార్జి జడ్జిగా మెట్రోపాలిటన్ సెషన్స్ న్యాయమూరి పని చేయనున్నారు. 

చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లను విచారణ చేయాలని ఆయన తరుఫు న్యాయవాదులు కోరారు. సిఐడి వేసిన కస్టడీ పిటిషన్‌లో చంద్రబాబు న్యాయవాదులు పిటిషన్ వేశారు. బెయిల్ పిటిషన్‌పై మంగళవారం వాదనలు వినాలని చంద్రబాబు తరఫు లాయర్లు తెలిపారు. ఇవాళే వాదనలు విని ఉత్తర్వులు ఇవ్వడం కష్టమని జడ్జి పేర్కొన్నారు. రేపటి నుంచి తాను సెలవుపై వెళ్లనున్నట్లు ఇన్‌ఛార్జి జడ్జి తెలిపారు. రెగ్యులర్ కోర్టులో వాదనలు వినిపించాలని న్యాయమూర్తి కోరారు.

చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్

మరోవంక, ఉమ్మడి చిత్తూరు జిల్లా అంగళ్లులో చోటు చేసుకున్న అల్లర్ల కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ఏ1గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.  ఈ నెల 22వ తేదీన ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు మంగళవారం విచారణను వాయిదా వేసింది.  ఈరోజు హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పై వాదనలు జరగగా,  ఇరువైపు వాదనలు ముగిశాయి. వాదనలు విన్న హైకోర్టు బెయిల్ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసింది.