పిన్నెల్లి జూన్ 6 వరకు మాచర్లకు వెళ్లొద్దని హైకోర్టు ఆంక్షలు

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పిన్నెల్లి కదలికలపై ఆంక్షలు విధించింది. ఓట్ల లెక్కింపు రోజున మాచర్ల వెళ్లొద్దని పిన్నెల్లికి స్పష్టం చేసింది. నరసరావుపేట కౌంటింగ్‌ కేంద్రానికి వెళ్లొచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది.  వచ్చే నెల 6 వరకు లోక్‌సభ నియోజకవర్గ కేంద్రంలోనే ఉండాలని ఆదేశించింది.

కౌంటింగ్​ కేంద్రానికి వెళ్లడానికి ఓట్ల లెక్కింపు రోజు మాత్రమే హైకోర్టు అనుమతించింది. కేసు గురించి మీడియాతో మాట్లాడకూడదని హైకోర్టు తేల్చిచెప్పింది. సాక్షులతో మాట్లాడేందుకు కూడా వీల్లేదని పేర్కొంది.  పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కదలికలపై నిఘా ఉంచాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి, పోలీసులకు ఉత్తర్వులు జారీ చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వుల కాపీని హైకోర్టు ఇవాళ విడుదల చేసింది.

ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో ఎమ్మెల్యే పిన్నెల్లిని అరెస్టు చేయాలని ఈసీ ఆదేశించగా ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ మేరకు జూన్ 6 వరకు పిన్నెల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది.

 
అదే విధంగా పిన్నెల్లి సహా పోటీ చేసిన అభ్యర్థుల ముందస్తు బెయిల్‌పైనా ఆదేశాలిచ్చింది. అయితే హైకోర్టును ఆశ్రయించడానికంటే ముందు, పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి లొంగిపోతాడని భావించి అప్రమత్తమైన పోలీసులు, కోర్టు ఆవరణలో పహారా కాశారు. ఇప్పటికే హైదరాబాద్‌లో పిన్నెల్లి డ్రైవర్‌, గన్‌మెన్‌ను అదుపులోకి తీసుకున్నారు. 
 
పిన్నెల్లి కోసం 8 ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ పిన్నెల్లిని పట్టుకోలేకపోయారు. ఇప్పటికే మాచర్ల ఈవీఎం ధ్వంసం ఘటనపై ఆగ్రహంగా ఉన్న ఈసీ, పిన్నెల్లిని తక్షణమే అరెస్టు చేయాలని ఆదేశించింది. ఈసీ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ఏపీ పోలీసులు హెదరబాద్​ సహా పలు ప్రాంతాల్లో ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
 
పిన్నెల్లిపై పది సెక్షన్లతో కేసులు నమోదు చేసినట్లు, ఏపీ సీఈఓ ఎంకే మీనా వెల్లడించారు. తాజాగా ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పుతో ఆయనకు కొంత ఊరట లభించినట్లైంది.